రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది. ఫీచర్స్ అదుర్స్

First Published | Nov 5, 2024, 5:56 PM IST

రాయల్ లుక్ కి కేరాఫ్ అడ్రస్ అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టింది. భవిష్యత్తును అంచనా వేస్తూ ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇటీవలే రాయల్ ఎన్ ఫీల్డ్ తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 'ఫ్లయింగ్ ఫ్లీ C6'ని విడుదల చేసింది. మరి ఈ బైక్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి? మైలేజ్, కలర్స్ తదితర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. 

రాయల్ ఎన్ఫీల్డ్ ఒక భారతీయ బహుళజాతి మోటార్ సైకిల్ తయారీ సంస్థ. అత్యంత పురాతనమైన ప్రపంచ మోటార్‌సైకిల్ బ్రాండ్. మొదటి రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ను 1901లో ది ఎన్‌ఫీల్డ్ సైకిల్ కంపెనీ ఇంగ్లండ్ లో తయారు చేసింది. స్వదేశీ ఇండియన్ మద్రాస్ మోటార్స్ ద్వారా అసలైన ఇంగ్లీష్ రాయల్ ఎన్ఫీల్డ్ నుండి లైసెన్స్ పొందింది. ఈ కంపెనీ ఇప్పుడు భారతీయ వాహన తయారీ సంస్థ అయిన ఐషర్ మోటార్స్ యొక్క అనుబంధ సంస్థ . ఈ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, క్లాసిక్ 350, రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్, మెటోర్ 350, క్లాసిక్ 500, ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్, హంటర్ 350 వంటి క్లాసిక్ లుక్ ఉండే మోటార్‌సైకిళ్లను తయారు చేస్తుంది. 

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను ఇటలీలోని మిలాన్ నగరంలో ఇటీవల ఆవిష్కరించింది. 'ఫ్లయింగ్ ఫ్లీ C6' మార్చి 2026 నాటికి విడుదల కానుంది. 'ఫ్లయింగ్ ఫ్లీ' అనేది రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ల కోసం కొత్త సబ్ బ్రాండ్. త్వరలోనే S6 స్క్రాంబ్లర్ కూడా రానుంది.

రెండవ ప్రపంచ యుద్ధంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ తయారు చేసిన మోటార్‌సైకిల్ ఆధారంగా ఫ్లయింగ్ ఫ్లీ C6 డిజైన్ చేశారు. లో స్లంగ్ బాబర్ స్టైల్, రేక్ అవుట్, గార్డర్ స్టైల్ ఫోర్క్‌లతో 1940ల నాటి సస్పెన్షన్ స్టైల్‌ను ఇది పోలి ఉంటుంది. అల్యూమినియం ఫ్రేమ్, వృత్తాకార హెడ్‌లైట్, టెయిల్-లైట్, ఎల్‌ఈడీ ఇండికేటర్లు ఇందులో ఉన్నాయి.


వృత్తాకార TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ బండి వేగాన్ని, ప్రయాణించిన దూరం, బ్యాటరీ, రేంజ్ వంటి వివరాలను చూపిస్తుంది. నావిగేషన్ డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉండవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ABS, క్రూయిజ్ కంట్రోల్, ఐదు రైడింగ్ మోడ్‌లతో ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి బైక్ అని చెప్పొచ్చు.

ఫ్లయింగ్ ఫ్లీ C6 అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. ఇది బడ్జెట్ EVలలో చాలా అరుదు. ఈ ఫ్రేమ్ లోపల మెగ్నీషియం బ్యాటరీ కవర్ ఉంది. బ్యాటరీ ప్యాక్ గురించి రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇది 5kWh కంటే పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 నుంచి 200 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు.

C6 చిన్న టైర్లను కలిగి ఉంది. ఇవి నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి. రోలింగ్ రెసిస్టెన్స్‌ను తగ్గించడం ద్వారా రేంజ్ పెరుగుతుంది. 10 స్పోక్ అల్లాయ్ వీల్స్ మధ్యలో ఇ-మోటార్ అమర్చబడి ఉంటుంది. ఇరువైపులా డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఒకే సీటు ఉంది. వెనుక కూర్చునే వారికి పిలియన్ సీటును ఆప్షన్‌గా అందించవచ్చు లేదా డ్యూయల్ సీట్లతో మరో వేరియంట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. 

Latest Videos

click me!