భారత దేశంలో అత్యంత సంపన్న మహిళ సావిత్రి జిందాల్. ఆమె తర్వాతి స్థానం రేఖా జున్‌జున్‌వాలాది. రూ. 72,814 కోట్ల నికర విలువతో భారతదేశంలో రెండవ అత్యంత సంపన్న మహిళగా గుర్తింపు పొందారు. ఆమె విలాసవంతమైన జీవనశైలి, ఆస్తులు, విలక్షణమైన పెట్టుబడి వ్యూహాలు నిజంగా గమనార్హమైనవి.
రేఖా జున్‌జున్‌వాలా మలబార్ హిల్‌లోని రిడ్జ్ రోడ్‌లో సముద్ర అందాలను వీక్షించేలా నిర్మించిన లగ్జరీ అపార్ట్‌మెంట్‌తో సహా అనేక విలాసవంతమైన ఆస్తులను కలిగి ఉన్నారు. గతంలో రిడ్జ్‌వే అపార్ట్‌మెంట్స్ అని పిలిచే ఈ 14 అంతస్తుల భవనాన్ని రేఖా మాజీ భర్త రాకేష్ జున్‌జున్‌వాలా రూ. 370 కోట్లకు కొనుగోలు చేశారు.
70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్తి ముంబైలోని అత్యంత విశిష్టమైన ప్రాంతాలలో ఒకటైన మలబార్ హిల్‌లో ఉంది. ఈ 14 అంతస్తుల లగ్జరీ అపార్ట్‌మెంట్‌తో పాటు, రేఖా జున్‌జున్‌వాలా రూ. 118 కోట్ల విలువైన తొమ్మిది అదనపు అపార్ట్‌మెంట్‌లను కూడా కలిగి ఉన్నారు.
కుటుంబం మరియు ప్రారంభ జీవితం
సెప్టెంబర్ 12, 1963న జన్మించిన రేఖా జున్‌జున్‌వాలా ముంబై విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలయ్యారు. ఆమె 1987లో రాకేష్ జున్‌జున్‌వాలాను వివాహం చేసుకున్నారు, రాకేష్ ప్రముఖ స్టాక్ పెట్టుబడిదారుడిగా తన ముద్ర వేసి విజయవంతమైన ప్రయాణాన్ని సాగించారు.
రేఖా మరియు రాకేష్ జున్‌జున్‌వాలాకు ముగ్గురు పిల్లలు: నిష్ట, ఆర్యమాన్, ఆర్యవీర్.
రేఖ భర్త రాకేష్ తన అసాధారణ ట్రేడింగ్ నైపుణ్యంతో ఇండియన్ వారెస్ బఫెట్ గా పేరుగాంచారు. అతడు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడుల ద్వారా భారీగా సంపాందించారు. ఇలా జున్‌జున్‌వాలా కుటుంబం భారీ ఆస్తులను కూడబెట్టింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు
రేఖా జున్‌జున్‌వాలా రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియో ఆమె హోదా, అధునాతన అభిరుచిని ప్రదర్శిస్తుంది, ఆమె తన జీవనశైలిని ప్రతిబింబించేలా విలువైన ఆస్తులను కలిగివున్నారు.
రేఖా జున్‌జున్‌వాలా
విలువైన విల్లాలతో పాటు 2023లో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC), అంధేరి తూర్పులోని చాందివాలిలో రూ. 739 కోట్లకు ఐదు వాణిజ్య కార్యాలయ స్థలాలను కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. మొత్తం 1.94 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్తులు ఆమె పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను గణనీయంగా పెంచుతాయి.