అవినీతిని అరికట్టడానికి రూ.2000 నోట్లను ఉపసంహరించుకున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఆ తర్వాత పెద్ద నోటుగా ఉన్న రూ.500 కూడా నకిలీ తయారయ్యాయని ఇటీవల ప్రకటించింది. నకిలీ రూ.500 నోట్లను గుర్తించడానికి అనేక మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఇటీవల రూ.200 నోట్లకు కూడా ఫేక్ నోట్లు తయారు చేసిన ఉదంతం తెలంగాణ రాష్ట్రంలోనే వెలుగు చూసింది. మోసగాళ్లు ఏకంగా రూ.200 నోటును కలర్ జిరాక్స్ తీయించి చలామణి చేసేశారు.
దీంతో రూ.100 నోట్లు కూడా వస్తాయన్న అనుమానంతో నిజమైన రూ.100 నోటులో ఎలాంటి స్ట్రాంగ్ గుర్తులు ఉంటాయో తెలియజేస్తూ RBI మార్గదర్శకాలను జారీ చేసింది.
రూ.100 నోటు భారతదేశంలో విస్తృతంగా ఉపయోగించే కరెన్సీ నోట్లలో ముఖ్యమైనది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నకిలీ రూ.100 నోట్ల గురించి ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది. నకిలీ నోట్లు అసలైన కరెన్సీని పోలి ఉంటాయి. వీటిని మొదటి చూపులోనే గుర్తించడం కష్టం. అందుకే అసలైన రూ.100 నోట్లను ప్రజలు గుర్తించడంలో సహాయపడటానికి RBI స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించింది.
అసలైన కరెన్సీ నోట్లలో వాటర్‌మార్క్ పక్కన నిలువు బ్యాండ్‌లో ఒక పూల డిజైన్ ఉంటుంది.
వాటర్‌మార్క్ విండోలో "100" సంఖ్యతో మహాత్మా గాంధీ చిత్రం ఉంటాయి. ఈ రెండు నిజమైన రూ.100 నోటును గుర్తించడంలో కీలకమైన గుర్తులు.
ఇవే కాకుండా అసలైన రూ.100 నోటులోని సెక్యూరిటీ థ్రెడ్‌లో "భారత్", "RBI" అనే శాసనాలు ఉంటాయి.
వివిధ కోణాల నుండి చూసినప్పుడు అవి నీలం, ఆకుపచ్చ రంగుల్లోకి మారతాయి.
నిలువు బ్యాండ్, మహాత్మా గాంధీ చిత్రం మధ్య ఖాళీలో "RBI, 100" అనే శాసనం కనిపిస్తుంది.
రూ.100 కరెన్సీ నోటులో ఈ లక్షణాలు కచ్చితంగా ఉండాలి. వీటిల్లో ఏ ఒక్కటి లేకపోయినా అవి నకిలీ నోట్లని నిర్ధారించవచ్చు. 2016 నోట్ల రద్దు తర్వాత నకిలీ కరెన్సీ నోట్ల పెరుగుదల ఆందోళనకరంగా మారింది.
నకిలీ కరెన్సీ నోట్లు ముఖ్యంగా రూ. 100 నోట్లు మార్కెట్‌లో విస్తృతంగా ఉన్నాయని, సాధారణ పౌరులకు రోజువారీ ఇబ్బందులను కలిగిస్తున్నాయని తరచూ వార్తలు వస్తున్నాయి. అధికారుల నివేదికలు కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి, ప్రజలు అలాంటి మోసాలకు బలైపోకుండా కాపాడటానికి RBI ఇలాంటి మార్గదర్శకాలు చేస్తోంది.
నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడంలో ప్రజలు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా చెబుతోంది. ప్రజలు అప్రమత్తమైతేనే మోసగాళ్లు నకిలీ నోట్ల తయారీని ఆపేస్తారని చెబుతోంది. అందుకే ప్రజలంతా తప్పకుండా ఆర్బీఐ సూచించిన సూచనలు పాటించాలి.