ఇప్పుడు మనం డిజిటల్ ఇండియాలో ఉంటున్నాం. ఎందుకంటే మాక్సిమం ట్రాన్సాక్షన్స్ డిజిటల్ మోడ్ లోనే జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ డిజిటల్ లావాదేవీలను ఆ విధంగా ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పుడు చాలా మంది నగదుకు బదులుగా GPay, PhonePe వంటి యాప్‌లనే ఉపయోగిస్తున్నారు. ఏదైనా కొనాలంటే చిల్లర నాణేలు తీసుకెళ్లడం ఇబ్బందిగా ఉండటం, నోట్లు ఇచ్చిన చిల్లర ఇవ్వలేక వ్యాపారులు ఇబ్బంది పడటం వల్ల ఆన్‌లైన్ పేమెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి.
నాణేల విషయంలో వస్తున్న ఇబ్బందులు, వీటిని కొందరు వేరే పనులకు ఉపయోగిస్తున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం, RBI రూ.5 నాణేలపై కీలక నిర్ణయం తీసుకున్నాయని తెలిసింది. మార్కెట్లో రూ.5 నాణేలు రెండు, మూడు రకాలు ఉన్నాయి. వాటిలో మందపాటి రూ.5 నాణేలను ఇకపై ముద్రించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇవి కాకుండా మార్కెట్లో ఇత్తడి, స్టీల్ రూ.5 నాణేలు కూడా చలామణిలో ఉన్నాయి. వాటిని ఎప్పటిలాగానే కొనసాగించనున్నారు.
ఒక ఏడాదిలో ఎన్ని నాణేలు తయారు చేయాలో కేంద్రం నిర్ణయిస్తుంది. తర్వాత RBIకి సూచనలు జారీ చేస్తారు. నాణేలు లేదా నోట్లను ఉపసంహరించినా లేదా కొత్తవి విడుదల చేసినా RBIకి కేంద్రం అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం 1 రూపాయి నుండి 20 రూపాయల వరకు నాణేలు చెలామణిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మందంగా ఉండే 5 రూపాయల నాణేన్ని ఉపసంహరించుకుంటున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం వెనుక కారణం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
భారతదేశంలో వివిధ రకాల 5 రూపాయల నాణేలు చెలామణిలో ఉన్నాయి. ఇత్తడి, స్టీల్, మరో మందపాటి లోహంతో తయారు చేసిన నాణేలు ఉన్నాయి. మీరు గమనించి ఉంటే ప్రస్తుతం మందపాటి నాణేల సంఖ్య తగ్గింది. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం ఏంటంటే... వీటిని ఉపయోగించి కొందరు దొంగ వ్యాపారాలు చేసే వారు బ్లేడ్లు తయారు చేస్తున్నారు. ఒక్క రూ.5 కాయిన్ తో 4 నుంచి 5 బ్లేడ్లు తయారు చేయవచ్చట.
ఈ అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవడానికి, మార్కెట్ లో చిల్లర సమస్య రాకుండా చేయడానికి కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై మరింత స్పస్టత రావాల్సి ఉంది.