హెచ్చరిక.. రైల్వే ట్రాక్ పై రీల్స్, షార్ట్స్ తీస్తే ఏం చేస్తారో తెలుసా?

First Published | Nov 17, 2024, 11:56 AM IST

త్వరగా ఫేమస్ అయిపోవాలని కొందరు రైలు పట్టాలపై ప్రమాదకరంగా రీల్స్‌ తీస్తుంటారు. సోషల్ మీడియాలో లైక్స్ కోసం ప్రాణాలను పణంగా పెడుతుంటారు. అనుకోకుండా ప్రమాదం జరిగి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు.  ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి రైల్వే శాఖ కఠిన చర్యలు తీసుకోనుంది. రూల్స్ బ్రేక్ చేస్తే రీల్స్ తీసే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఇక్కడ తెలుసుకుందాం. 

మనిషి లక్ష్యం ఆనందంగా జీవించడమే. సెల్ ఫోన్ రాక ముందు వరకు అందరూ ఆనందంగానే జీవించారని చెప్పొచ్చు. చుట్టూ ఉండే వారితోనే తమ జీవితాన్ని షేర్ చేసుకుంటూ కష్టాలు, సుఖాలు అందరితోనూ పంచుకుంటూ సంతోషంగా బతికేవారు. గొడవలు పడ్డా.. మళ్లీ కలిసిపోవడం సరదాగా ఉండటం.. వారి లైఫ్ స్టైల్ గా ఉండేది. మరి ఇప్పుడు ఫేమస్ అవడమే జీవిత లక్ష్యంగా చాలా మంది భావిస్తున్నారు. జీవిస్తున్నారు. అంతేకాకుండా టాలెంట్ తో సంబంధం లేకుండా త్వరగా పేరు తెచ్చుకోవాలని ఆరాటపడుతున్నారు. అందుకోసం చేతకాకపోయినా రకరకాల స్టంట్స్ చేయడం, డాన్సులు చేయడం లాంటివి చేస్తున్నారు. ముఖ్యంగా అందరూ చూడాలని, సోషల్ మీడియాలో లైక్స్ ఎక్కువ రావాలని ప్రమాదకరమైన చోట్ల రీల్స్, షార్ట్స్, షూటింగ్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 

ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించడం కోసం కొత్త కొత్త మార్గాలను కనిపెడుతున్నారు. ఇది మంచిదే అయినా కొందరు ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. త్వరగా ఫేమస్ అయిపోవాలని ప్రమాదకర చెరువులు, బావులు, నదులు, రోడ్లు, రైల్వే ట్రాక్స్ లాంటి వాటిపై షూటింగ్స్ చేస్తున్నారు. అనుకోకుండా వెహికల్స్, ట్రైన్స్ వస్తే తప్పించుకొనే ఛాన్స్ లేక ప్రమాదాలకు గురవుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇలాంటి సంఘటనలు దేశ వ్యాప్తంగా రోజూ జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన జైపూర్‌లో రైలు పట్టాలపై కారు నడిపి ప్రమాదం లేటెస్ట్ ఉదాహరణ మాత్రమే.


జైపూర్‌లో రైల్వే ట్రాక్‌పై ఇన్‌స్టాగ్రామ్ రీల్ తీయడం కోసం జరిగిన సంఘటన అందరినీ ఆశ్చర్యపరచింది. ఒక వ్యక్తి, మద్యం తాగి తన మహీంద్రా థార్ కారును రైల్వే ట్రాక్‌పై నడిపాడు. ఈ రీల్ తీసే క్రమంలో కారు ట్రాక్‌పై ఇరుక్కుపోయింది. ఒక గూడ్స్ ట్రైన్ అదే టైమ్ లో ఆ ట్రాక్ పై వస్తోంది. లోకో పైలట్ అప్రమత్తంగా ట్రైన్‌ను ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రీల్స్ తీసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి, కారు సీజ్ చేశారు.

ఈ సంఘటనతో సోషల్ మీడియాలో స్టంట్‌ల ప్రమాదాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వ్యక్తుల ప్రవర్తన రైల్వే నిబంధనలకు వ్యతిరేకంగా ఉండటంతో పాటు ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుండటంతో అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకొనేలా నూతన ఆదేశాలు వచ్చాయి. 

ఇండియాలో రైల్వే ట్రాక్‌లపై రీల్స్ తీయడం వల్ల జరిగిన పలు ప్రమాదాలు ఇక్కడ ఉన్నాయి. 

ఉత్తరాఖండ్, రూర్కీ: 2024లో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి తన మిత్రుడితో కలిసి రైల్వే ట్రాక్ వద్ద ఇన్‌స్టాగ్రామ్ రీల్ తీసుకుంటోంది. ఆ టైమ్ కి బర్మేర్ ఎక్స్‌ప్రెస్ రైలు రావడంతో దాని కింద పడి మరణించింది. ఆమె మిత్రుడు తప్పించుకున్నాడు. 

తెలంగాణ, వరంగల్: 2023లో 17 ఏళ్ల బాలుడు రైల్వే ట్రాక్‌పై వీడియో తీస్తుండగా రైలు ఢీకొని గాయాలపాలయ్యాడు. 

మహారాష్ట్ర, ముంబై: 2021లో రైల్వే ట్రాక్‌పై వీడియో తీయడం వల్ల ఓ యువకుడు గాయపడ్డాడు. రైల్వే ట్రాక్‌లపై వీడియో తీయడం వల్ల రైల్వే ప్రయాణికుల జీవితాలకు ముప్పు ఏర్పడుతుంది. అంతేకాకుండా  రైల్వే సేవలకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి.

రైల్వే ట్రాక్‌లు , రైల్వే డిపార్ట్ మెంట్ కి చెందిన ఏ ప్లేస్ లో అయినా రీల్స్, స్టంట్స్ చేస్తే అటువంటి వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని రైల్వే బోర్డు అధికారులను ఆదేశించింది. సోషల్ మీడియా పోస్ట్‌ల కోసం యువకులు రైళ్లలో వీడియోలు తీస్తున్న సంఘటనలు వెలుగుచూడటంతో ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే రీల్స్ తీసే వారిపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాలని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ప్రభుత్వ రైల్వే పోలీసులను రైల్వే బోర్డు ఆదేశించింది.  

Latest Videos

click me!