సురక్షితమైన పెట్టుబడి కోరుకునే వారికి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందాలనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ వివిధ పథకాలను అమలు చేస్తోంది. ప్రభుత్వ మద్దతు ఉన్న పథకం కాబట్టి పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు చాలా సురక్షితమైనవి. ఇందులో మీరు పెట్టిన పెట్టుబడి ఎటువంటి మోసాలకు గురికాకుండా ఉంటుంది. మీరు తక్కువ కాలంలో రూ.లక్షలు సంపాదించాలనుకుంటే పోస్టాఫీసులో RD స్కీమ్ లో పెట్టుబడి పెట్టండి. తక్కువ పెట్టుబడితో 5 సంవత్సరాల్లో లక్షల రూపాయలను దాచుకోవచ్చు. ఇలాంటి చిన్న పొదుపులు భవిష్యత్తుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
ఎంత పెట్టుబడి పెట్టాలి?
రోజుకు 100 రూపాయలు ఆదా చేసి పోస్ట్ ఆఫీస్ RD పథకంలో పెట్టుబడి పెడితే 5 సంవత్సరాల తర్వాత మంచి లాభం పొందవచ్చు. RD పథకంలో పెట్టుబడి పెడితే రోజుకు రూ.100 అంటే నెలకు రూ.3000 పొదుపు చేయవచ్చు. ఇలా 5 సంవత్సరాల తర్వాత మీరు లక్షల రూపాయలు ఆదా చేయవచ్చు.
వడ్డీ రేటు ఎంత ఉంటుంది?
పోస్ట్ ఆఫీస్ RD 6.7 శాతం వడ్డీ రేటు ఇస్తుంది. దీనితో పాటు కనీసం రూ.100 పెట్టుబడి పెట్టే వెసులుబాటు కూడా ఉంది. మీకు కావలసినంత గరిష్టంగా పెట్టుబడి పెట్టవచ్చు. నెలకు రూ.3000 అంటే రోజుకు రూ.100 పెట్టుబడి పెడితే ఈ 5 సంవత్సరాల్లో రూ.1,80,000 ఆదా అవుతుంది. దీనికి 6.7 శాతం వడ్డీ రేటు ప్రకారం దాదాపు మొత్తం రూ.2,14,097 మీ చేతికి వస్తుంది.
దాదాపు అన్ని పోస్ట్ ఆఫీస్ పథకాలు ప్రజలకు సురక్షితమైన పెట్టుబడులు పెట్టడానికి అనుమతిస్తాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఈ పథకాల్లో వడ్డీ రేట్లు కూడా ఎక్కువగా ఉండటంతో పాటు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టే వెసులుబాటు కూడా ఉంది. RD పథకంలో లోన్ సౌకర్యం కూడా ఉంది. డిపాజిట్‌లో 50 శాతం వరకు మీరు లోన్ తీసుకోవచ్చు. దీనితో పాటు 5 సంవత్సరాల తర్వాత కూడా పెట్టుబడిని కొనసాగించాలనుకుంటే మెచ్యూరిటీ తర్వాత కూడా 5 సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం ఉంటుంది.
పోస్ట్ ఆఫీస్‌లో RD ఖాతా తెరవడం కూడా చాలా సింపుల్. దేశంలోని ఏ పౌరుడైనా RD పథకంలో ఖాతా తెరవవచ్చు. సమీపంలోని పోస్ట్ ఆఫీసుల్లో నెలకు రూ.100 నుంచి రికరింగ్ డిపాజిట్ ఖాతా తెరిచే వెసులుబాటు ఉంది. జాయింట్ లేదా సింగిల్ అకౌంట్ తెరిచే వెసులుబాటు ఉంది. దీనికి ఆధార్ కార్డు, ఫోటో, పాన్ కార్డు, ఇతర సాధారణ డాక్యుమెంట్లు అవసరం. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఇప్పటికే ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.