PM Kisan 24th Installment: పీఎం కిసాన్ 24వ విడత సొమ్ము అక్టోబర్ 30న విడుదల కానుంది. 9.34 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో రూ.2000 జమ కానున్నాయి. పూర్తి వివరాలు ఇవే..
దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు చెప్పింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PMKSNY) 24వ విడత సొమ్ము విడుదలకు ముహూర్తం ఖరారైంది.
కేవలం 24 గంటల వ్యవధిలోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు వచ్చి చేరనున్నాయి. దీంతో వ్యవసాయ పనులకు అవసరమైన పెట్టుబడి సాయం చేతికి అందుతుండడంతో రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
25
గుజరాత్ లో ప్రధాని మోదీ చేతుల మీదుగా పంపిణీ
పీఎం కిసాన్ 24వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ లోని బనాస్ కాంతా జిల్లా నుంచి స్వయంగా ప్రారంభించనున్నారు. అక్టోబర్ 30న భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 151వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ ప్రత్యేక సందర్భంలో ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.2000 చొప్పున జమ చేయనున్నారు. ఇప్పటివరకు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా 23 విడతలను పూర్తి చేసింది. ప్రత్యక్ష నగదు బదిలీ (DBT) విధానం ద్వారా ప్రతీ ఏటా రైతులకు రూ.6000 ఆర్థిక సాయం అందిస్తున్నారు.
35
9.34 కోట్లకు పైగా రైతులకు ₹18,680 కోట్ల లబ్ధి
ఈసారి 24వ విడత కింద దేశవ్యాప్తంగా సుమారు 9.34 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ. 18,680 కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని విడుదల చేస్తోంది.
గుజరాత్ వ్యవసాయ శాఖ మంత్రి జీతూ వాఘాణీ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఒక్క గుజరాత్ రాష్ట్రంలోనే సుమారు 52.33 లక్షలకు పైగా రైతు కుటుంబాల ఖాతాల్లో రూ. 1,051 కోట్లకు పైగా నగదు జమ కానుంది.
పీఎం కిసాన్ పథకంలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కొందరు అర్హత లేకపోయినా తప్పుడు సమాచారంతో రిజిస్ట్రేషన్ చేసుకుని లబ్ధి పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు, అసలైన అన్నదాతలకే ప్రయోజనం చేకూరేలా ఈకేవైసీని కేంద్రం తప్పనిసరి చేసింది. ఒకవేళ మీరు ఇప్పటివరకు ఈకేవైసీ పూర్తి చేయకపోతే మీ ఖాతాలో డబ్బులు పడవు. అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఫార్మర్ ఐడీ నమోదు చేసుకోవడం కూడా నిర్బంధంగా మారింది.
55
పీఎం కిసాన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?
రైతులు తమ వివరాలను అధికారిక పీఎం కిసాన్ వెబ్సైట్ లో సులభంగా సరిచూసుకోవచ్చు. పోర్టల్లోకి వెళ్లి 'Farmers Corner' విభాగంలో మీ ఆధార్ నంబర్ లేదా బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేయడం ద్వారా లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో క్షణాల్లో తెలుసుకోవచ్చు.
ఈ పథకం ద్వారా లభించే పెట్టుబడి సాయం చిన్న, సన్నకారు రైతులకు పంట సాగు ఖర్చుల కోసం ఎంతో ఊరటనిస్తోంది. మీ ఈకేవైసీ ప్రక్రియ పూర్తికాకపోతే వెంటనే సంబంధిత మీసేవ లేదా పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా పూర్తి చేసుకోవడం మంచిది.