ప్రధానమంత్రి అన్వారుల్ హక్ కకర్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం గురువారం పెట్రోల్ ధరను లీటరు పై రూ.14.91 అండ్ హై-స్పీడ్ డీజిల్ (హెచ్‌ఎస్‌డి) ధర పై రూ.18.44 చొప్పున పెంచింది. తాజా పెంపుతో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటరుకు రూ.305.36గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.311.84కి చేరింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోలియం ధరల పెరుగుదల, కరెన్సీ ఎక్స్చేంజ్ ధరల మార్పు కారణంగా ప్రస్తుతం ఉన్న పెట్రోలియం ఉత్పత్తుల ధరలను సవరించాలని నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
విద్యుత్ బిల్లుల పెంపుపై తాజాగా పాకిస్థాన్ దేశంలో పెద్దఎత్తున నిరసనలు జరిగాయి. ముల్తాన్, లాహోర్ అలాగే కరాచీతో సహా పలు ప్రాంతాల్లో నిరసనలు, కరెంటు బిల్లులను తగలబెట్టిన భారీ ప్రదర్శనలు జరిగాయి. విద్యుత్ పంపిణీ సంస్థల అధికారులతోనూ అక్కడి ప్రజలు వాగ్వాదానికి దిగారు.
ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వం పేర్కొణగా, ఈ వారం ప్రారంభంలో, తాత్కాలిక ప్రధానమంత్రి కాకర్ ఈ సమస్యపై అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు అలాగే విద్యుత్ బిల్లుల తగ్గింపు కోసం చర్యలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం ముందుకు రాలేదు.
రాజకీయ అస్థిరతతో పాటుగా పాకిస్థాన్ చరిత్రలో అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున పెట్రోల్ డీజిల్ ధరల పెంపు ఆమోదం పొందింది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 21.3 శాతంగా ఉంది. గత ఏడాది కాలంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి విలువ దాదాపు సగం కోల్పోయింది. పాకిస్థాన్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు దాదాపు $10 బిలియన్ల వద్ద అత్యంత తక్కువ స్థాయిలో ఉన్నాయి.
ఇంధన ధరల పెరుగుదల పాకిస్థాన్ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భయపడుతున్నారు.