గాడిద చర్మాలతో పాటు పలు వస్తువులను చైనాకు ఎగుమతి చేసేందుకు పాకిస్థాన్ మంగళవారం ఆమోదం తెలిపింది. పాకిస్తాన్‌కు చెందిన ARY న్యూస్ ఈ సమాచారాన్ని ప్రసారం చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే పశువులు, పాల ఉత్పత్తులు, మిరపకాయలు, గాడిద చర్మాల ఎగుమతి కోసం చైనాతో నాలుగు ప్రోటోకాల్‌లపై సంతకం చేయడానికి పాకిస్తాన్ కేంద్ర మంత్రివర్గం సిద్ధంగా ఉందని పేర్కొంది. ముఖ్యంగా గాడిద చర్మాన్ని ప్రాసెసింగ్ కోసం చైనాకు పంపనున్నట్లు తెలిపింది. ARY న్యూస్ ప్రకారం, చైనా, పాకిస్తాన్ సంతకం చేసే నాలుగు ప్రోటోకాల్‌లను లా అండ్ జస్టిస్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆమోదించింది.
పాకిస్తాన్ వాణిజ్య మంత్రిత్వ శాఖ 4 అక్టోబర్ 2022 న సెనేట్ కమిటీకి పాకిస్తాన్ నుండి గాడిదలు, కుక్కలను దిగుమతి చేసుకోవడానికి చైనా ఆసక్తి చూపుతుందని తెలిపింది. ఎగుమతి-దిగుమతులకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని కమిటీ ఛైర్మన్‌ను కోరారు. ప్రపంచం మొత్తంలో గాడిదలకు పెద్దగా ప్రాధాన్యత లేదు. కానీ చైనాలో గాడిద తోలును చాలా విలువైనదిగా భావిస్తారు. చైనాలో వీటికి మంచి గిరాకీ ఉంది. అనేక రకాల ఉత్పత్తులను చైనాలో గాడిద చర్మంతో తయారు చేస్తారు. అందువల్ల దీనికి డిమాండ్ ఉంది. చైనా వద్ద తగినన్నీ గాడిదలు లేవు, కాబట్టి వాటిని పాకిస్తాన్‌తో సహా ఇతర ప్రాంతాల నుండి దిగుమతి చేసుకుంటుంది.
చైనాలో గాడిద చర్మాన్ని అనేక రకాల ఔషధాలలో కూడా ఉపయోగిస్తారు. ఇది రక్తహీనత, సంతానోత్పత్తి నిద్రలేమికి సంబంధించిన వ్యాధులను నయం చేస్తుందని చైనీయులు నమ్ముతారు. అయితే, ఈ వాదనలకు ఎటువంటి వైద్యపరమైన ఆధారాలు లేవు. నివేదికల ప్రకారం, చైనాలో సౌందర్య ఉత్పత్తులను తయారు చేయడానికి గాడిద చర్మాన్ని ఉపయోగిస్తారు. 2016 జిన్హువా న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం, చైనాకు ప్రతి సంవత్సరం నాలుగు మిలియన్ గాడిదలు అవసరం.
పాకిస్థాన్‌పై చైనా ఎందుకు ఆసక్తి చూపుతోంది
చైనాలో ప్రతి సంవత్సరం 1.8 మిలియన్ గాడిదలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ప్రపంచంలో గాడిదల ఉత్పత్తిలో పాకిస్థాన్ మూడో స్థానంలో ఉంది. ఆఫ్రికాలో గాడిదలు ఎక్కువగా ఉంటాయి. 2014 నుంచి 2016 వరకు పాకిస్థాన్ 2 లక్షలకు పైగా గాడిద చర్మాలను చైనాకు పంపింది. గాడిద చర్మాన్ని అక్రమంగా చైనాకు ఎగుమతి చేయడం కూడా పాకిస్తాన్‌లో చాలాసార్లు కనిపిస్తుంది.
ఇదిలా ఉంటే ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్న పాకిస్థాన్ విదేశీ రుణం 100 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. ఆ దేశ విదేశీ మారక నిల్వలు కూడా నామమాత్రంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి, వీలైనంత త్వరగా ఆర్థిక ప్యాకేజీ అవసరం, లేకపోతే పాకిస్తాన్ కూడా దివాళా తీయవచ్చు. పాకిస్థాన్ కరెన్సీ విలువ కూడా రోజురోజుకు తగ్గుతోంది, ఇప్పుడు ఒక డాలర్ విలువ 288 పాకిస్థాన్ రూపాయిలకు పడిపోయింది. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి, పాకిస్తాన్ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)ని నిరంతరం వేడుకుంటున్నది. ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తోంది. ఇక చేసేదేమీ లేక గాడిద చర్మాలను చైనాకు విక్రయించాలని నిర్ణయం తీసుకుంది.