కేరళలోని యూట్యూబర్‌ల నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించగా, అందులో సుమారు రూ. 26 కోట్ల పన్ను ఎగవేత కనుగొన్నట్లు ఐటీ అధికారులు తెలిపారు. ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లించని 13 మంది యూట్యూబర్‌లపై చర్యలు ప్రారంభించింది.
ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు ఆర్జించే కేరళలోని ప్రముఖ యూట్యూబర్‌ల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసిన తర్వాత, ఆదాయపు పన్ను వారు పన్నుల రూపంలో చెల్లించాల్సిన మొత్తాన్ని అంచనా వేిసంది. మొత్తం రూ. 26 కోట్ల పన్ను ఎగవేత జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రూ. 2 కోట్ల వరకు వార్షిక ఆదాయం ఉన్న యూట్యూబర్‌లు ఒక్క రూపాయి కూడా పన్నులు చెల్లించకపోవడం గమనార్హం.
కొందరు తమ ఐపీ అడ్రస్‌ను విదేశాల్లో నమోదు చేసి పన్నులు ఎగ్గొట్టారు. ఇదిలా ఉంటే పన్ను మొత్తాన్ని రికవరీ చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. చెల్లించవలసిన పన్నును నిర్ణయించే ప్రతి ఒక్కరికీ నోటీసు జారీ చేసింది.
పన్నులు చెల్లించనందుకు 13 మంది యూట్యూబర్‌లపై తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కొందరు పక్కాగా పన్ను చెల్లిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. యూట్యూబ్‌లో వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాలని తమకు తెలియదని కొంతమంది యూట్యూబర్‌లు వాపోవడం విశేషం. ప్రస్తుతానికి, ఆదాయపు పన్ను ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోకుండా యూట్యూబర్‌లందరినీ పన్ను పరిధిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఆదాయపు పన్ను ఎగవేతలపై విస్తృత తనిఖీలు కొనసాగుతాయని తెలిపింది.
నటి, యాంకర్ పెర్లీ మణి, ఫిషింగ్ ఫ్రీక్ (సెబిన్), అర్జు, కోల్మీ షాస్మ్, జయరాజ్ జీ నాథ్, అఖిల్ NRD, M4 టెక్, అన్‌బాక్సింగ్ డ్యూడ్, రైజింగ్ స్టార్, ఈగిల్ గేమింగ్, క్యాస్ట్రో గేమింగ్ వంటి ప్రముఖ యూట్యూబర్ల ఇళ్లపై కూడా ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది.