సుకన్య సమృద్ధి యోజన పథకంలో మీరు సంవత్సరానికి రూ.250 నుండి రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. మీ కుమార్తె వయస్సు 10 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే, మీరు సుకన్య సమృద్ధి యోజన పేరు మీద అకౌంట్ తీయాలి. ఈ పథకంలో 15 సంవత్సరాలు డబ్బులు కట్టాలి. 15 ఏళ్లు కట్టాక, మరో ఆరేళ్లు అంటే 21 సంవత్సరాలకు ఈ అకౌంట్ మెచ్యూర్ అవుతుంది. అప్పటి వడ్డీరేట్లను లెక్కగడితే మీరు కట్టిన అమౌంట్ కి మూడు రెట్లు వస్తుంది. సుకన్య సమృద్ధి యోజన పథకంలో కట్టిన డబ్బులకు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. ఇది మీకు, మీ కూతురి భవిష్యత్తుకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది.
SSY అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి
SSY అకౌంట్ ఏదైనా పోస్టాఫీసు లేదా గుర్తింపు పొందిన బ్యాంకుల్లో ఓపెన్ చేయొచ్చు. ఖాతాను ప్రారంభించే సమయంలో మీ గురించి, మీ కుమార్తె గురించి కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని అందించాలి. కొన్ని డాక్యుమెంట్లను సమర్పించడం ద్వారా సులభంగా ఖాతా తెరవవచ్చు.
సుకన్య సమృద్ధి యోజన ఎప్పడు ప్రారంభమైంది
సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని 2015 సంవత్సరంలో ప్రధాని మోడీ ప్రారంభించారు. ఆడపిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చిన్న వయసు నుంచే తమ ఆడపిల్లల కోసం తల్లిదండ్రులు ఆదా చేయడం ప్రారంభించేలా ప్రోత్సహించేలా ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రధాని మోడీ నిర్ణయించారు. సుకన్య సమృద్ధి యోజన దీర్ఘకాలిక పథకం. మీ కుమార్తె భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి మార్గం.
ఈ పథకంలో పాప పేరు మీద 15 సంవత్సరాలు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు డబ్బులు కట్టాలి. కుమార్తెకు 18 సంవత్సరాలు నిండే వరకు ఈ ఖాతాను తల్లిదండ్రులు, చట్టపరమైన సంరక్షకులు మాత్రమే నిర్వహించగలరు. ఆ తర్వాత సంబంధిత ఆడపిల్లే ఈ అకౌంట్ ను నడపాలి.
SSY లో మారిన రూల్స్ ఏంటి
సుకన్య సమృద్ధి యోజన పథకం నిబంధనల్లో అక్టోబర్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం పెద్ద మార్పు తీసుకొచ్చింది. కొత్త నిబంధన ప్రకారం ఈ పథకంలో ఖాతాను బాలిక తల్లిదండ్రులు లేదా చట్టపరమైన ఆమె సంరక్షకులు మాత్రమే ప్రారంభించాలి. లేదా నిర్వహించాలి. అంటే ఇప్పుడు కూతురి తాత, అమ్మమ్మ లేదా ఇతర బంధువులు ఈ ఖాతాను ఓపెన్ చేయలేరు. నిర్వహించలేరు.
ఈ పని చేయకపోతే సుకన్య అకౌంట్ క్యాన్సిల్ అయిపోతుంది
కొత్త నిబంధన ప్రకారం సుకన్య సమృద్ధి యోజన కింద బాలికల చట్టపరమైన సంరక్షకులు మాత్రమే అక్టోబర్ 1 నుండి వారి ఖాతాలను నిర్వహించగలరు. కొత్త నిబంధన ప్రకారం బాలిక సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ఇతరులు ప్రారంభించి, ఆమె చట్టపరమైన సంరక్షకులు కాకపోతే సదరు వ్యక్తి ఈ ఖాతాను బాలిక చట్టపరమైన సంరక్షకుడికి లేదా తల్లిదండ్రులకు బదిలీ చేయాలి. ఇలా చేయకపోతే అకౌంట్ క్యాన్సిల్ అయిపోతుంది.