ప్రపంచంలో పవర్‌ఫుల్ బిజినెస్ మెన్‌ లిస్టులో ఒకే ఒక్క ఇండియన్ ఎవరో తెలుసా?

First Published | Nov 15, 2024, 12:13 PM IST

ప్రపంచంలో 100 మంది మోస్ట్ పవర్‌ఫుల్ బిజినెస్ మెన్‌ లిస్టులో ఇండియాకు చెందిన వ్యాపారవేత్త ఒకరు చోటు దక్కించుకున్నారు. అది కూడా టాప్ 20లో ఆయన ఉన్నారు. ఆయన ఇప్పటికే ప్రపంచ దిగ్గజాల్లో ఒకరుగా రికార్డుల్లోకెక్కారు. ఇప్పుడు తాజా నివేదికల ప్రకారం మరోసారి ఆయన ఇండియా నుంచి జాబితాలో చేరిన ఏకైక వ్యక్తిగా నిలిచారు. ఆ వ్యాపారవేత్త ఎవరు? మోస్ట్ పవర్‌ఫుల్ బిజినెస్ మెన్‌ లిస్టులో ఏ స్థానంలో ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

భారత దేశంలో ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉన్నారు. అంబానీ, అదానీ, టాటా, మహేంద్ర, శివనాడార్ ఇలా అనేక మంది బడా వ్యాపారవేత్తలుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. వారిలో ఒకరు ఇటీవల ప్రపంచంలోని 100 అత్యంత శక్తివంతమైన పారిశ్రామికవేత్తల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆయన ఎవరో కాదు రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ. ఆయన శక్తివంతమైన వ్యాపారవేత్తగా దేశానికే కాకుండా ప్రపంచానికీ మరోసారి నిరూపించారు. ఈ విషయాన్ని ఫార్చ్యూన్ మ్యాగజైన్ సంస్థ ప్రకటించింది. 
 

ముకేశ్ అంబానీ 2024 సంవత్సరానికి ఫార్చ్యూన్ మ్యాగజైన్ పవర్‌ఫుల్ బిజినెస్‌మెన్ జాబితాలో చేరిన ఏకైక భారతీయుడు. ఈ జాబితాలో విదేశాల్లో స్థిరపడ్డ ఆరుగురు భారతీయ మూలాలతో ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. ఫార్చ్యూన్ ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 100 మంది అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్తల జాబితాను విడుదల చేసింది. ఇందులో ముకేశ్ అంబానీ 12వ స్థానాన్ని సంపాదించారు.
 


ముకేశ్ అంబానీ రిలయన్స్ గ్రూప్ యజమాని. అంతేకాకుండా దేశంలో అత్యంత పెద్ద వ్యాపారవేత్తలలో ఒకరు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చడం ద్వారా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. జియోను ప్రారంభించడం ద్వారా దేశంలోని టెలికాం రంగం ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశారు. దేశం డిజిటలైజేషన్ దిశగా పయనించడం వల్ల అభివృద్ధి వేగవంతమైంది. రిటైల్ రంగంలో కంపెనీ కొత్త రికార్డులు  నెలకొల్పుతోంది. అలాగే గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా సంస్థ ప్రతిష్టాత్మకంగా పనిచేస్తోంది. ఇలా రిలయన్స్ ఇండస్ట్రీస్ అడుగు పెట్టని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. 
 

రూ.8,49,926 కోట్ల ఆస్తులతో ముఖేష్ అంబానీ భారతదేశంలో అత్యంత సంపన్నుడుగా కొనసాగుతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.17,27,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో భారతదేశంలో అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశవ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల్లోనూ అనేక రంగాల్లో వ్యాపారాలు చేస్తోంది. అందువల్లనే ఫార్చ్యూన్ పవర్‌ఫుల్ బిజినెస్‌మెన్ లిస్ట్ 2024లో ముకేశ్ అంబానీ టాప్ లిస్టులో  చోటు దక్కించుకున్నారు. 
 

ప్రపంచంలోని అత్యంత పవర్‌ఫుల్ బిజినెస్‌మెన్ లిస్ట్ లో మొదటి స్థానంలో ఎలాన్ మస్క్ ఉన్నారు. ఎన్వీడియ సీఈఓ జెన్సెన్ హువాంగ్ రెండవ స్థానంలో ఉన్నారు. సత్య నాదెళ్ల మూడవ స్థానంలో, వారెన్ బఫెట్ నాలుగో స్థానంలో నిలిచారు. ఇక జేమీ డిమోన్ ఐదవ స్థానంలో, టిమ్ కుక్ 6వ స్థానాన్ని పొందారు. ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ 7వ స్థానంలో, సామ్ ఆల్ట్మన్ 8వ స్థానంలో ఉన్నారు. మేరీ బార్రా, సుందర్ పిచాయ్ వరుసగా 9, 10వ స్థానాల్లో నిలిచారు. ముకేశ్ అంబానీకి ముందు 11వ స్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఉన్నారు.

Latest Videos

click me!