పెళ్లి చేసుకోవడానికి లోన్ కావాలా? ఈ బ్యాంకులు రెడీగా ఉన్నాయి

First Published | Nov 23, 2024, 5:37 PM IST

పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, గోల్డ్ లోన్స్ మాత్రమే కాదు మీకు కావాలంటే మ్యారేజ్ లోన్స్ కూడా ఇస్తామంటున్నాయి కొన్ని బ్యాంకులు. మీరు గాని పెళ్లి చేసుకోవాలని అనుకుంటే బ్యాంకులే ముందుకొచ్చి అప్పులిస్తాయి. ఇలా పెళ్లిళ్లకు లోన్స్ ఇస్తున్న బ్యాంకులు, అవి వసూలు చేసే వడ్డీ రేట్లు, ఈఎంమైల లాంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. 
 

ఈ రోజుల్లో పెళ్లి అంటే అత్యంత ఖరీదైన వేడుకగా మారిపోయింది. పెళ్లి బడ్జెట్ ఎంతలా పెరిగిపోయిందంటే.. పదేళ్లు కష్టపడి దాచుకున్న డబ్బంతా ఒక్క రోజులో ఖర్చయిపోతుంది. అంతేకాకుండా చాలా మంది ఆర్భాటం కోసం అప్పులు చేసి మరీ పెళ్లిళ్లు  చేస్తుంటారు. లేకపోతే రిలేషన్స్ తక్కువగా చూస్తారని, మాట్లాడతారని స్తోమతకు మించి పెళ్లిళ్లు చేస్తుంటారు. ఈ వివాహ వేడుకను అందరూ ఆర్థికంగా మేనేజ్ చేయలేరు.  అందుకే బ్యాంకులు, కొన్ని ఫైనాన్స్ కంపెనీలు కూడా లోన్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి. 
 

చాలా మంది తమ పెళ్లిని గ్రాండ్‌గా చేసుకోవడానికి ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. బ్యాంకులు, కొన్ని ఫైనాన్స్ కంపెనీలు పెళ్లిళ్ల కోసం రూ.లక్షల్లో అప్పులు ఇస్తున్నాయి. ఈ మ్యారేజ్ లోన్ ను పర్సనల్ లోన్ మాదిరిగానే వసూలు చేస్తారు. మ్యారేజ్ లోన్ కోసం రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. ఎలాంటి సెక్యూరిటీ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు తీసుకున్న లోన్ ను బట్టి ఈఎంఐ విధానంలో మీరు అప్పు తిరిగి చెల్లించవచ్చు. 
 


మ్యారేజ్ లోన్స్ కావాల్సిన వారు 21 నుంచి 60 ఏళ్ల వయసున్న భారతీయ పౌరులై ఉండాలి. జాబ్ చేసే వాళ్లయితే కనీసం రూ.15000 జీతం అంతకంటే ఎక్కువ సంపాదిస్తూ ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారికి మ్యారేజ్ లోన్స్ వస్తాయి. ఒక వేళ మీరు ఈ లోన్ కోసం అప్లై చేయాలనుకుంటే సాలరీ స్లిప్, బ్యాంక్ స్టేట్‌మెంట్, ఆధార్ కార్డు, ఓటరు ఐడి, పాన్ కార్డ్ జిరాక్సులు బ్యాంకు అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే క్రెడిట్ స్కోర్ కచ్చితంగా 750, అంతకంటే ఎక్కువ ఉండాలి.  
 

మ్యారేజ్ లోన్ కూడా పర్సనల్ లోన్ లాంటిదే. దీని కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ ఏవిధంగానైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా ఐడెంటిటీ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, 3 నెలల జీతం స్లిప్, 3 నెలల అకౌంట్ స్టేట్‌మెంట్ సమర్పిస్తే సరిపోతుంది. మ్యారేజ్ లోన్ నిబంధనలు, వడ్డీ రేట్లు బ్యాంకును బట్టి మారుతూ ఉంటాయి. మీరు మ్యారేజ్ లోన్ కోసం అప్లై చేసే ముందు రూల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోండి. వేరే ఆప్షన్లు లేనప్పుడు మాత్రమే దీన్ని ఎంచుకోండి. మీ స్తోమతలోనే అప్పు తీసుకోండి.
 

మ్యారేజ్ లోన్లను ఎక్కువగా ప్రైవేటు బ్యాంకులు ఇస్తున్నాయి. ఇవి రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఇస్తాయి. వీటిల్లో అతి తక్కువ వడ్డీ రేటును ICICI బ్యాంక్ అందిస్తోంది. ఈ బ్యాంకు 10.85% వడ్డీ రేటుతో మ్యారేజ్ లోన్లు ఇస్తోంది. అదేవిధంగా HDFC అయితే  11.22 % వడ్డీ రేటుతో లోన్ ఇస్తుంది. యాక్సిస్ బ్యాంక్ మ్యారేజ్ లోన్లకి 11.25 %, బ్యాంక్ ఆఫ్ బరోడా 11.10 % వడ్డీ రేటును వసూలు చేస్తుంది. మీరు తీసుకున్న అప్పును బట్టి ఈఎంఐల ద్వారా మీరు అప్పును తిరిగి చెల్లించవచ్చు. 
 

Latest Videos

click me!