ఎక్కువ డబ్బు సంపాదించి ధనవంతులు కావాలని అందరూ కోరుకుంటారు కదా.. ఇక ధనవంతులైతే ఇంకా ఇంకా ఆస్తులు పెంచుకోవాలని చూస్తారు. ఇలా ఆస్తులు పెంచుకొని విలాసవంతమైన జీవితం గడపాలనుకునే కోటీశ్వరుల మధ్య ఒక కోటీశ్వరుడు తన కోట్ల ఆస్తులను వదిలేసి అడవిలో సన్యాసిగా జీవిస్తున్నారు. ఆయనే మలేషియా కోటీశ్వరుడు ఆనంద కృష్ణన్ కుమారుడు వెన్ అజాన్ సిరిపన్యో. సన్యాస జీవితం కోసం ఆయన 5 బిలియన్ డాలర్లు అంటే రూపాయల్లో 40,000 కోట్లు వదులుకున్నారు. 20 ఏళ్లకు పైగా థాయిలాండ్-మయన్మార్ సరిహద్దులో అరణ్య వాసం చేస్తూ సన్యాసిగా జీవిస్తున్నారు.
మలేషియా ధనవంతుల్లో ఒకరైన ఆనంద కృష్ణన్.. టెలికమ్యూనికేషన్స్, ఉపగ్రహాలు, చమురు, రియల్ ఎస్టేట్, మీడియా వంటి రంగాల్లో రూ.కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని కలిగి ఉన్నారు.
ఎవరీ వెన్ అజాన్ సిరిపన్యో?
పుట్టుకతోనే కోటీశ్వరుడైన అజాన్ సిరిపన్యో 18 ఏళ్ల వయసులో బౌద్ధ సన్యాసిగా మారాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం అసాధారణమైనది అయినప్పటికీ ఆయన తండ్రి ఆనంద కృష్ణన్ అంగీకరించారు. కారణం ఏంటంటే ఆయన కూడా బుద్ధిజాన్ని నమ్ముతారు. చిన్నప్పటి నుంచే ఆయన కూడా బౌద్ధ ధర్మాలను ఆచరిస్తున్నారు.
అజాన్ సిరిపన్యో కూడా చిన్నతనం నుంచి బుద్ధుడి బోధనలు వింటూ ఆకర్షితులయ్యారు. తండ్రి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్న అజాన్ సిరిపన్యో బౌద్ధ సన్యాసి కావాలని చిన్నప్పుడే నిర్ణయించుకున్నారు. ఆయన వ్యక్తిగత నిర్ణయాన్ని ఆయన కుటుంబ సభ్యులు కూడా గౌరవించి అంగీకరించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే రూ.40 వేల కోట్ల ఆస్తికి వారుసుడు కావాల్సిన వ్యక్తి సన్యాసిగా మారతానంటే ఎవరు ఒప్పుకుంటారు. ఇందులో మరో గొప్ప విషయం ఏమిటంటే సిరిపన్యో తల్లి అయిన మోమ్‌వజరోంగ్సే సుప్రిందా చక్రపాన్, థాయిలాండ్ రాజ కుటుంబానికి చెందినవారు.
అరణ్య సన్యాసిగా జీవితం
20 ఏళ్లకు పైగా వెన్ అజాన్ సిరిపన్యో అరణ్య సన్యాసిగా జీవిస్తున్నారు. ప్రధానంగా థాయిలాండ్-మయన్మార్ సరిహద్దులోని తావో డమ్ మఠంలో నివసిస్తున్నారు. రూ.కోట్ల సంపదను వదులుకొని సాదా జీవితం గడపాలనే బౌద్ధ సూత్రాన్ని ఆయన ఆచరణలో చేసి చూపిస్తున్నారు.
సన్యాసిగా ఉన్నప్పటికీ సిరిపన్యో అప్పుడప్పుడు తన కుటుంబాన్ని కలుస్తారు. తన తండ్రిని కూడా వ్యక్తిగతంగా కలుస్తారు. కుటుంబ సంబంధాలను నొక్కి చెప్పే బౌద్ధ సూత్రాలకు అనుగుణంగానే ఆయన కుటుంబ సభ్యులను కలుస్తారు.
లండన్‌లో తన ఇద్దరు సిస్టర్స్ తో కలిసి పెరిగిన సిరిపన్యో ఇంగ్లాండ్‌లో చదువుకున్నారు. 8 భాషల్లో ఆయన అనర్గళంగా మాట్లాడగలరు. భిన్న సాంస్కృతిక అనుభవాలు ఆయనలో కొత్త ఆలోచనలు కలిగించి బుద్ధిజం వైపు నడిపించాయి. బౌద్ధ బోధనలపై ఆయన అవగాహనను మరింతగా పెంచాయి. అజాన్ సిరిపన్యో జీవిత ప్రయాణం నిజమైన ఆధ్యాత్మిక సాధకుడిగా సాగుతుండటం ఒక విషయమైతే, దానికి వారి కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు అందిస్తుండటం మెచ్చుకోదగిన విషయం.