మీ దగ్గర ఇంకా రూ.2,000 నోట్లు ఉన్నాయా? మార్చుకోవడానికి ఫైనల్ ఛాన్స్

First Published | Nov 13, 2024, 10:32 AM IST

రూ.2,000 నోట్లు మార్చుకోవడానికి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఇప్పటికే ఎన్నో అవకాశాలు ఇచ్చింది. బ్యాంకుల్లో మార్చుకోవడానికి అక్టోబర్ 7, 2023 వరకు గడువు ఇచ్చింది. ఇప్పటికీ కొంత మొత్తం రావాల్సి ఉండటంతో ఫైనల్ ఛాన్స్ ప్రకటించింది. మీ దగ్గర ఉన్న రూ.2,000 నోట్లు ఎలా మార్చుకోవచ్చో ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు. 
 

రూ. 500, రూ. 1000 నోట్లను 2016 నవంబరు నెలలో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. వాటి స్థానంలో 2 వేల నోటును ప్రవేశపెట్టింది. అయితే రూ. 2 వేల నోట్లను వెనక్కు తీసుకుంటున్నట్టు ఆర్బీఐ 2023 మే 19న మొదటిసారి ప్రకటించింది. అప్పటికి సర్క్యులేషన్ లో ఉన్న 2 వేల రూపాయల నోట్ల విలువ రూ. 3.56 లక్షల కోట్లు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో వీటిని మార్చుకోవచ్చని ఆర్బీఐ సూచించింది. ఆర్బీఐ ప్రకటనతో జనం తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవడం ప్రారంభించారు. ఇప్పటి వరకు రూ. 2 వేల నోట్లు దాదాపు 98.04 శాతం వెనక్కి వచ్చాయి. 
 

రూ.2,000 నోట్లు వెనక్కు తిరిగి తీసుకోవడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఇటీవల మరో కీలక ప్రకటన చేసింది. ఇంకా మార్కెట్ లో సుమారు రూ.6,970 కోట్లు వినియోగంలో ఉన్నాయని సమాచారం. వీటిని కూడా వెనక్కు రప్పించేందుకు మరో అవకాశం కల్పిస్తూ ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికీ రెండు వేల నోట్లు కలిగిన వారు RBI ఆఫీసుల్లో వీటిని మార్చుకోవచ్చని ప్రకటించింది. అంతే కాకుండా పోస్టాఫీసుల ద్వారా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు పంపి కూడా మార్చుకోవచ్చు. 
 


దేశవ్యాప్తంగా 19 చోట్ల ఆర్బీఐ రీజనల్ ఆఫీసులు ఉన్నాయి. వీటిల్లో 2 వేల రూపాయల నోట్లు ఇచ్చేందుకు అవకాశం ఉంది. హైదరాబాద్ సహా దేశం మొత్తం మీద 19 ఆర్బీఐ రీజనల్ ఆఫీసుల్లో వీటిని అప్పగించొచ్చు. 2 వేల నోట్లకు బదులు ఇతర నోట్లు కూడా తీసుకోవచ్చు. భారీ మొత్తంలో ఉంటే వారి అకౌంట్లలోకి జమ చేయించుకోవచ్చు. మీరు 2 వేల నోట్లు మార్చుకోవాలంటే మీ బ్యాంకు అకౌంట్ తో పాటు ఆధార్, పాస్ పోర్ట్, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డుల్లో ఏదో ఒకదాని జెరాక్స్ కాపీ సబ్మిట్ చేయాలి. 
 

ఇప్పటికీ ఈ 2 వేల నోట్లను వెనక్కు తీసుకుంటున్నారు. అయితే రద్దు మాత్రం చేయలేదు. అంటే ఇప్పటికీ ఈ నోటును ప్రజలు తమ అవసరాలకు ఉపయోగించొచ్చు. రూ. 2 వేల నోట్లు పూర్తిగా వెనక్కి వచ్చిన తర్వాత వీటిని రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడైతే రెండు వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిందో అప్పటి నుంచి ఈ నోట్లను తీసుకోవడానికి ఇటు వ్యాపారులు, అటు ప్రజలు కూడా ఇష్టపడటం లేదు. 
 

ఇంకా రూ. 6,970 కోట్ల విలువైన 2 వేల రూపాయల నోట్లు జనం దగ్గర ఉన్నాయని ఆర్బీఐ ప్రకటించింది. అయితే ఇవి చెల్లుబాటు కరెన్సీ అయినప్పటికీ బయట తీసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. దీంతో పూర్తి స్థాయిలో వెనక్కి వస్తాయని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది.

రూ.1000 నోట్లను మళ్లీ విడుదల చేయనున్నట్లు బాగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంపై ఆర్బీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. అందుకే దీని గురించి స్పష్టత లేదు.

Latest Videos

click me!