టాప్ -5లోకి భారతీయ స్టాక్ మార్కెట్.. ఫ్రాన్స్ తరువాత ఇప్పుడు బ్రిటన్‌ను అధిగమించనున్న సూచీలు..

First Published Oct 12, 2021, 2:58 PM IST

మార్చి 2020లో భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుండి దేశీయ స్టాక్ మార్కెట్ అస్తవ్యస్తంగా మారింది, కానీ ఇప్పుడు సెన్సెక్స్ 60 వేలకు మించిపోయింది. ప్రపంచంలోని టాప్ స్టాక్ మార్కెట్ల గురించి మాట్లాడితే యుఎస్ స్టాక్ మార్కెట్ మొదటి స్థానంలో ఉంది. దీని తరువాత అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన చైనా, జపాన్, హాంకాంగ్, యూ‌కే ఉన్నాయి.

స్టాక్ మార్కెట్‌లో మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మార్కెట్ స్థానం క్రమంగా పెరుగుతూ వచ్చింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా భారతీయ స్టాక్ మార్కెట్ ఐదవ స్థానంలోకి చేరనుంది. అయితే గత నెల సెప్టెంబర్ లోనే ఫ్రాన్స్ ను అధిగమించి ఆరో స్థానానికి చేరుకుంది. రికార్డు స్థాయిలో తక్కువ వడ్డీ రేట్లు, రిటైల్ పెట్టుబడులు భారతదేశ స్టాక్ మార్కెట్‌ను రికార్డు స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

37 శాతం పెరిగిన మార్కెట్ క్యాపిటలైజేషన్
బ్లూమ్స్ బెర్గ్ ప్రకారం భారత స్టాక్ మార్కెట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ ఏడాది 37 శాతం పెరిగి 3.46 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. బ్రిటన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ సంవత్సరం తొమ్మిది శాతం పెరిగి 3.59 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. భారతదేశ స్టాక్ మార్కెట్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోందని లండన్ & క్యాపిటల్ అసెట్ మేనేజ్‌మెంట్ ఈక్విటీస్ హెడ్ రోజర్ జోన్స్ అన్నారు. 

మార్చి 2020 నుండి 130 శాతం పెరిగిన మార్కెట్ 
2020 మార్చిలో భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పుడు స్టాక్ మార్కెట్ అస్తవ్యస్తమైన సంగతి మీకు తెలిసిందే. కానీ ఇప్పుడు బిఎస్‌ఇ సెన్సెక్స్ గత సంవత్సరం మార్చి నుండి 130 శాతం పెరిగింది. దీంతో గత ఐదేళ్లలో పెట్టుబడిదారులకు 15 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది. బ్రిటన్ బెంచ్ మార్క్ ఎఫ్‌టి‌ఎస్‌ఈ 100 ఇండెక్స్ ఈ కాలంలో ఆరు శాతం రిటర్న్ ఇచ్చింది.

 విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) కూడా అదే విధంగా పెరుగుతూ ఉంటే దీపావళి నాటికి దేశీయ మార్కెట్ మళ్లీ రికార్డు స్థాయికి చేరుకోవచ్చు. వ్యాక్సినేషన్ కారణంగా ఇన్వెస్టర్లలో కరోనా భయం  ముగిసినట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా జి‌డి‌పిలో వృద్ధి సంకేతాల అంచనాల కారణంగా ఈ రోజుల్లో షేర్ మార్కెట్ వృద్ధి చెందుతోంది. గ్లోబల్ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాల ప్రభావంతో మార్కెట్ త్వరలో కొత్త గరిష్టాలను చేరుకుంటుంది. భారతీయ స్టాక్ మార్కెట్ వృద్ధి చెందుతున్న విధంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా యూ‌కేని కూడా అధిగమిస్తుందని ఊహిస్తున్నారు.

2020 సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఐ‌పి‌ఓ మార్కెట్ సందడి చేస్తోంది. ఇటీవల చాలా కంపెనీలు తమ ఐ‌పి‌ఓని ప్రవేశపెట్టాయి. కొత్తగా జాబితా చేసిన కంపెనీల సహకారం కారణంగా ఈ సంవత్సరం కూడా షేర్ మార్కెట్ పెరిగింది.

click me!