ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఇండియన్ రైల్వే శాఖది నాలుగో స్థానం. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ వేలాది రైళ్లు నలుమూలలకు పరుగులు పెడుతున్నాయి. లక్షలాది మంది ప్రతిరోజూ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వే అనేక రాయితీలను కూడా అందిస్తోంది.
ఇప్పటికే వందే భారత్, వందే మెట్రో వంటి రైళ్లను వినియోగదారులకు చేరువ చేసి రైల్వే శాఖ వేగంగా అడుగులు వేస్తోంది. త్వరలో బుల్లెట్ రైళ్లు కూడా దేశంలో పరుగులు పెట్టనున్నాయి. అందుకే టికెట్ బుకింగ్ సేవలను మరింత సులభతరం చేయడానికి రైల్వే శాఖ కొత్త యాప్ ను తీసుకు వస్తోంది.
రైల్వేలో టికెట్లు బుక్ చేసుకోవాలన్నా, పీఎన్ఆర్ స్టేటస్ తెలుసుకోవాలన్నా, ఇలాంటి ఇతర ఏ సేవలకైనా అనేక యాప్ లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. రైల్ మదద్, UTS, సటార్క్, TMS-నిరీక్షన్, IRCTC, పోర్ట్‌రీడ్ వంటి యాప్ లు కూడా రైల్వే సేవలను ప్రజలకు అందిస్తున్నాయి.
ఈ యాప్స్ అన్నింటిలో ఉండే అన్ని రకాల సేవలను ఒకే యాప్ లోకి తీసుకు వస్తూ రైల్వే శాఖ ‘సూపర్ యాప్’ను ప్రారంభించనుంది. ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఈ యాప్ తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.
ప్రస్తుతం IRCTC రైల్ కనెక్ట్ యాప్ ను 100 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్ చేసుకొని వినియోగిస్తున్నారు. ఇది రైలు సేవలు అందించే యాప్ లలో అత్యంత ప్రజాదరణ పొందిన రైల్వే యాప్. ఇది కాకుండా UTS, NTES, రైల్‌మదద్, IRCTC రైల్ కనెక్ట్ వంటి యాప్‌లు సేవలందిస్తున్నాయి. వీటన్నింటినీ ఒకే చోట కలిపి ఉపయోగిస్తే ఎలా ఉంటుంతో ‘సూపర్ యాప్’ ఒక్కదాన్ని ఉపయోగిస్తే అలా ఉంటుందని రైల్వే మంత్రిత్వ శాఖ చెబుతోంది.
ఇన్ని సూపర్ ఆప్షన్ ఉన్న రైల్వే సూపర్ యాప్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ యాప్ 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ప్రారంభమవుతుందని సమాచారం. అంటే రానున్న మార్చి, ఏప్రిల్ నెలల్లో CRIS అభివృద్ధి చేసిన ఈ యాప్ ను తీసుకురానున్నారని తెలుస్తోంది.
రైల్వే సూపర్ యాప్ ప్రయోజనాలు
ప్రయాణికులు అన్ని సేవలను ఒకే యాప్‌లో పొందవచ్చు.
ఇది మీ స్మార్ట్‌ఫోన్‌లో తక్కువ స్థలాన్ని తీసుకుంటుంది.
ప్రస్తుతం IRCTC యాప్, రైల్ సారథి, ఇండియన్ రైల్వే PNR, NTES, రైల్ మదద్, UTS, ఫుడ్ ఆన్ ట్రాక్ వంటి అనేక యాప్‌లు ఉన్నాయి. ఈ సూపర్ యాప్ ఆండ్రాయిడ్ మరియు iOS రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది.