ట్రైన్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్‌కి కొత్త రూల్.. ఇకపై 4 నెలల ముందు రిజర్వేషన్ కుదరదు

First Published | Dec 3, 2024, 11:06 AM IST

ట్రైన్ టిక్కెట్స్ అడ్వాన్స్ బుకింగ్ కోసం కొత్త రూల్ అమలులోకి వచ్చాయి. ఇండియన్ రైల్వేస్ కొత్త నియమం ప్రకారం ఇప్పుడు ప్రయాణికులు 120 రోజుల ముందుగానే టికెట్లను బుక్ చేసుకోవడం కుదరదు. ఈ టైమ్ మరింత తగ్గించారు. ఈ కొత్త నియమం వల్ల ప్రయాణికులకు మాత్రమే కాకుండా ఇండియన్ రైల్వేస్ కూడా ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం అడ్వాన్స్ బుకింగ్ రూల్స్ ని చాలాసార్లు మార్చింది. కొత్త నియమం ప్రకారం ఇకపై ప్రయాణికులు కేవలం 60 రోజుల ముందు మాత్రేమే అడ్వాన్స్ టికెట్లు బుక్ చేసుకోగలరు. ఇంతకు ముందు వరకు 120 రోజుల ముందు టికెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది.  అయితే చాలామంది ప్రయాణికులు 120 రోజుల ముందు టికెట్లు బుక్ చేసుకుని తర్వాత రద్దు చేస్తున్నారు. అలాగే చాలామంది ఎక్కువ టికెట్లు బుక్ చేసి మోసం చేస్తున్నారు. ఈ రెండు కారణాల వల్ల రైల్వే ఈ నియమాన్ని మార్చింది. ఇకపై 60 రోజుల ముందు మాత్రమే అడ్వాన్స్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

రైల్వే డేటా ప్రకారం 21 శాతం టికెట్లు రద్దు అవుతున్నాయి. 4 నుండి 5 శాతం ప్రయాణికులు తాము బుక్ చేసిన టికెట్లలో ప్రయాణించడం లేదు. దీనివల్ల చాలామంది ప్రయాణికులకు సీట్లు దొరకడం లేదు. ఈ నేపథ్యంలోనే రైల్వే కొత్త నియమాన్ని తీసుకొచ్చింది. దీనిపై అన్ని రైల్వే స్టేషన్లు, టికెట్ కౌంటర్లకు రైల్వే నోటీసులు పంపింది.

అక్టోబర్ 31 వరకు 120 రోజుల ముందు రైలు టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని రైల్వే స్పష్టం చేసింది. ఆ టికెట్లతో వారు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఈ నియమం నవంబర్ 1 నుండి అమల్లోకి వచ్చిందని అధికారులు ప్రకటించారు. 


అన్ని ట్రైన్స్ కి ఈ రూల్ వర్తిస్తుంది. అయితే తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్ రైళ్ల టికెట్ బుకింగ్ నియమాల్లో ఎలాంటి మార్పులు లేవని భారతీయ రైల్వే తన ప్రకటనలో తెలిపింది. 

కొత్త నియమం అమల్లోకి వచ్చాక స్పెషల్ రైళ్లను సక్రమంగా ప్లాన్ చేయడానికి ఇండియన్ రైల్వే చర్యలు తీసుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. కొత్త రూల్ తో రైల్వే ప్రయాణికుల సంఖ్యను సరిగ్గా అంచనా వేయవచ్చు. పండుగ సమయాల్లో రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించడానికి సరైన సంఖ్యలో స్పెషల్ రైళ్లను నడపడానికి అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

సీట్ల కేటాయింపు టెక్నాలజీని మెరుగుపరచడానికి భారతీయ రైల్వే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తోంది. AI టెక్నాలజీ వాడుకలోకి వస్తే సీట్ల కేటాయింపు చాలా సులభంగా మారుతుంది. AI సిస్టం ప్రయాణికుల డేటా ఖాళీ సీట్లను పరిగణనలోకి తీసుకుని సీట్లను కేటాయిస్తుంది. వృద్ధులు, గర్భిణుల వంటి ప్రయాణికులకు AI సిస్టం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

భారతీయ రైల్వే అడ్వాన్స్ టికెట్ బుకింగ్ రూల్స్ విదేశీ పర్యాటకులకు వర్తించవు. వారు 365 రోజుల ముందుగానే రైళ్లలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. విదేశీ పర్యాటకుల సౌకర్యార్థం భారతీయ రైల్వే ఏడాది ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం కల్పిస్తోంది. 

Latest Videos

click me!