Published : Jul 28, 2025, 04:07 PM ISTUpdated : Jul 28, 2025, 04:59 PM IST
భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలును విజయవంతంగా పరీక్షించారు. దీంతో త్వరలోనే ఇది పట్టాలెక్కనుంది. ఇంతకూ ఏమిటీ హైడ్రోజన్ రైలు? దీని ప్రత్యేకతలేమిటి? ఇక్కడ తెలుసుకుందాం.
Railway : పొగలు కక్కుతూ బొగ్గుతో నడిచే ఆవిరి ఇంజన్ల స్థాయినుండి జెట్ స్పీడ్ తో దూసుకుపోయే వందేభారత్ రైళ్ళ వరకు ఇండియన్ రైల్వే ప్రయాణం అద్భుతం. ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తోంది. ఇలా అత్యంత వేగంగా నడిచే బుల్లెట్ రైళ్ళనే కాదు పర్యావరణహితమైన హైడ్రోజన్ రైళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ఈ హైడ్రోజన్ రైల్ ప్రాజెక్టుపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు.
భారతీయ రైల్వే మరో అరుదైన రైలును ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే తమిళనాడు రాజధాని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో భారతీయ రైల్వేలు దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్‌తో నడిచే కోచ్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.
DID YOU KNOW ?
భారత్ లో హైడ్రోజన్ రైలు కూత
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇంగ్లాండ్, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్ దేశాల్లో మాత్రమే హైడ్రోజన్ రైళ్లు నడుస్తున్నాయి. త్వరలోనే భారతదేశం కూడా ఈ జాబితాలో చేరనుంది.
25
రైల్వే మంత్రి కీలక ప్రకటన
''చెన్నైలోని ఐసిఎఫ్‌లో హైడ్రోజన్‌తో నడిచే మొట్టమొదటి కోచ్ విజయవంతంగా పరీక్షించబడింది. దేశం 1,200 హార్స్‌పవర్స్ తో నడిచే హైడ్రోజన్ రైలుపై పనిచేస్తోంది... ఇది హైడ్రోజన్ పవర్ ట్రైన్ టెక్నాలజీలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడంలో సహాయపడుతుంది'' అని అశ్విని వైష్ణవ్ అన్నారు.
2023లో పర్యావరణ పరిరక్షణ కోసం ''హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్" ప్రాజెక్ట్ కింద 35 హైడ్రోజన్ రైళ్లను నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఒక్కో రైలుకు రూ. 80 కోట్లు, ఒక్కో మార్గానికి గ్రౌండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ. 70 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు. ఈ హైడ్రోజన్ రైళ్లను వివిధ హెరిటేజ్, కొండ మార్గాల్లో నడపాలని ఇండియన్ రైల్వే భావిస్తోంది.
35
జింద్-సోనిపట్ మధ్య మొదటి హైడ్రోజన్ రైలు
అదనంగా భారతీయ రైల్వే రూ. 111.83 కోట్ల వ్యయంతో గ్రౌండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు ఇప్పటికే ఉన్న డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (DEMU)లో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌ను అమర్చడానికి ఒక పైలట్ ప్రాజెక్ట్‌ను కూడా సిద్దం చేసింది. ఇది రైలును ఉత్తర రైల్వేలోని జింద్-సోనిపట్ సెక్షన్‌లో నడపాలని ప్రణాళిక చేసినట్లు రైల్వే మంత్రి తెలిపారు.
ప్రారంభంలో ఈ హైడ్రోజన్ రైళ్లను నడిపేందుకు ఎక్కువ ఖర్చు అవుతుంది... క్రమేపి వీటి సంఖ్య పెరుగుతున్నకొద్దీ ఖర్చు తగ్గుతుంది. ఇది వాతావరణ కాలుష్యాన్ని కలిగించే కర్బన ఉద్గారాలను విడుదల చేయదు... కాబట్టి హైడ్రోజన్ వాడకం క్లీన్ ఎనర్జీ సోర్స్ గా పేర్కొంటున్నారు. ఇది పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలకు మద్దతుగా గ్రీన్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీ ప్రయోజనాలను అందిస్తుంది.
జింద్ లో హైడ్రోజన్ ఉత్పత్తి కోసం ప్రత్యేక ప్లాంట్ ను రెడీ చేస్తున్నారు. అయితే ఈ హైడ్రోజన్ చాలా ప్రమాదకరమైన గ్యాస్.... దీనికి రంగు, వాసన, రుచి ఉండదు... కానీ మండే స్వభావం గల వాయువు. అందుకే జింద్ లోని హైడ్రోజన్ ప్లాంట్ ను రెండు భాగాలుగా విభజించారు... ఒకటి అల్ప పీడనంతో 2320 కిలోల సామర్థ్యం గలది... ఇంకోటి అధిక పీడనంతో 680 కిలోల సామథ్యం గలది.
55
హైడ్రోజన్ రైలు నడుస్తున్న దేశాలివే
ఇండియాలో నడవనున్న హైడ్రోజన్ రైలులో 10 బోగీలు ఉంటాయి. ఇతర దేశాల్లో నడిచే హైడ్రోజన్ రైళ్లలో ఇన్ని బోగీలు ఉండవు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇంగ్లాండ్, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్ దేశాల్లో మాత్రమే హైడ్రోజన్ రైళ్లు నడుస్తున్నాయి. త్వరలోనే భారతదేశం కూడా ఈ జాబితాలో చేరనుంది.