Independence Day 2023: నాటి నెహ్రూ నుంచి నేటి ప్రధాని మోదీ వరకూ భారత్ సాధించిన ఆర్థిక ప్రగతి విజయాలు ఇవే..

First Published | Aug 14, 2023, 11:47 AM IST

గడచిన 76 సంవత్సరాలు మన దేశం స్వశక్తితో ముందుకు సాగుతోంది. ఒక ప్రణాళిక ప్రకారం భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది దీని వెనుక సాగినటువంటి కృషి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మన దేశానికి స్వాతంత్రం లభించి ఇప్పటికీ 76 సంవత్సరాలు గడిచింది. ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో మన దేశం ఆర్థికంగా  గణనీయమైన పురోగతి సాధించింది.  ముఖ్యంగా 1947 నుంచి 2023 వరకు మన దేశం ఆర్థికంగా ఒక ప్రభలమైన శక్తిగా ప్రపంచానికి పరిచయమైంది. బ్రిటిష్ వలస రాజ్యంగా  ఉన్నటువంటి మన దేశం.  1947లో స్వాతంత్రం పొంది స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. 

తొలినాళ్లలో పంచవర్ష ప్రణాళికల పేరిట అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ,  భారీ  నీటిపారుదల ప్రాజెక్టులు, శాస్త్ర సాంకేతిక రంగం, హరిత విప్లవం వంటి రంగాలపైన  ఎక్కువగా దృష్టి సారించారు.  ఫలితంగా భారతదేశ స్వతంత్రానికి ముందు ఆహార ధాన్యాల కొరతను ఎదుర్కొనేది అక్కడి నుంచి ప్రస్తుతం సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు, బహుళార్థ సాధక  ప్రాజెక్టులైన హీరాకుడ్ డ్యామ్, నాగార్జునసాగర్, భాక్రానంగల్ డ్యాం వంటి ప్రాజెక్టులను  నిర్మించడం ద్వారా సాగు విస్తీర్ణం పెరిగింది.  ఫలితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా పెరిగింది.


భాక్రా నంగల్ డ్యాం 1.2 లక్షల కోట్ల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు. దీని జలాలు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీలలోని 135 లక్షల ఎకరాల భూమికి సాగు నీరందించాయి. భాక్రా డ్యామ్ కోట్లాది భారతీయ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపింది.  ఫలితంగా భారతదేశంలో హరిత విప్లవానికి నాంది పలికింది.

స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో భారతదేశ నిర్మాణానికి అవసరమైన ఉక్కును ఉత్పత్తి చేసిన భిలాయ్, బొకారో స్టీల్ ప్లాంట్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే  భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ISRO, DRDO ప్రపంచానికి పోటీగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాయి, AIIMS, IIT, IIM, NIT వంటి సంస్థలు మనకు వైద్యులు, ఇంజనీర్లను ఉత్పత్తి చేయడానికి దోహదపడ్డాయి. భారతదేశాన్ని ప్రపంచ పారిశ్రామిక శక్తిగా నిర్మించడానికి లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించేందుకు PSU సంస్థలు దోహదపడ్డాయి.

ఆ తర్వాత వచ్చినటువంటి ఇందిరాగాంధీ పరిపాలనలో దేశం అణుశక్తిగా మారింది.  బ్యాంకుల జాతీయ కరణ దేశానికి మరో స్వాతంత్రం అని చెప్పవచ్చు. ప్రైవేటు సంస్థలు, సంస్థానాధీశుల  ఆధ్వర్యంలో ఉండే బ్యాంకులు  జాతీయం  చేయడంతో  సామాన్యులకు సైతం బ్యాంకింగ్ రుణాలు,  అదేవిధంగా బ్యాంకు సదుపాయాలు  అందుబాటులోకి వచ్చాయి. మహారత్న, మినీ రత్న,  నవరత్న పేరుతో  ప్రభుత్వ యాజమాన్య సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా దేశం పారిశ్రామికంగా ఎదిగేందుకు దోహదపడింది.

ఇక 1991 నుంచి ప్రధాని పీవీ ఆధ్వర్యంలో భారత దేశంలో తీసుకున్నటువంటి సరళీకృత ఆర్థిక విధానాల వల్ల,  దేశం మరింత అభివృద్ధి సాధించింది.  ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి పెట్టుబడి భారతదేశంలోకి ప్రవేశించింది. ఐబీఎం, కోకోకోలా, పెప్సీ, మైక్రోసాఫ్ట్  వంటి బహుళ జాతి సంస్థలు మనదేశంలో పెట్టుబడులు పెట్టాయి. ఫలితంగా విదేశీ మారకద్రవ్యం  అడుగంటే పరిస్థితి నుంచి మిగులు స్థాయికి చేరింది.
 

2007 సంవత్సరంలో ప్రపంచ ఆర్థికసంక్షోభం యావత్ ప్రపంచ దేశాలను కుదిపినప్పటికీ భారతదేశం సమర్థవంతంగా తట్టుకుంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో మన దేశం  ప్రస్తుతం పురోభివృద్ధి సాధిస్తుంది.  2014 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మన దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతోంది.  ప్రపంచంలోనే ఐదవ  అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం ప్రస్తుతం రూపుదిద్దుకుంటుంది. 

Latest Videos

click me!