మీ దగ్గరున్న కరెన్సీ నోట్లు నడవడం లేదా? ఈజీగా మార్చుకునే మార్గాలివే

First Published | Sep 4, 2024, 5:55 PM IST

మీ దగ్గర పాడయిపోయిన లేదా చిరిగిపోయి నడవకుండా వున్న కరెన్సీ నోట్లు వున్నాయా..?  వాటిని ఈజీగా మార్చుకోవడం ఎలాగో తెలుసుకొండి.

torn currency notes

మన  దగ్గర ఏదయినా వస్తువులు పాడయిపోతే చెత్త సేకరించేవారికి అమ్మేస్తాం... ఎంతో కొంత డబ్బు వస్తుంది. లేదంటే మనకు తెలిసిన పేదవారికి ఇచ్చేస్తాం. చివరకు ఆహార పదార్థాలు పాడయిపోయేలా వున్నా ఊరికే పారేయడానికి ఇష్టపడం...  బిచ్చగాళ్లకో లేదంటే కుక్కలకో పెడుతుంటాం. మరి  మన దగ్గరుండే కరెన్సీ నోట్లు పాడయిపోతే, చిరిగిపోతే..? పాత వస్తువుల్లా అమ్మలేం. అలాగని అహార పదార్థాల మాదిరిగా ఎవరికో ఇచ్చేందుకు మనసొప్పదు. ఆ కరెన్సీని ఏం చేయాలి? ఎలా మార్చుకోవాలి? అనేది తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. వారికోసమే ఈ సమాచారం.  

torn currency notes

నడవని కరెన్సీ నోట్లను ఎలా మార్చుకోవాలి : 

వీదుల్లో చిన్న కిరాణాషాప్ సరుకులు, తోపుడుబండ్ల వద్ద కూరగాయల కొనడం నుండి పెద్దపెద్ద మాల్స్ లో షాపింగ్, హోటల్స్ లో బిల్ చెల్లింపు... ఇలా నిత్యజీవితంలో అనేకచోట్ల డబ్బులు చెల్లిస్తుంటాం. ఇలాంటి సమయంలో ఒక్కోసారి మనకు ఓ మాట వినిపిస్తుంటుంది... ఈ నోటు నడవదు? అని.

బాగా నలిగిపోయి పాడైపోయినా, చిరిగిపోయినా, కొంచెం కాలిపోయినా...  ఈ కరెన్సీ నోట్లను తీసుకునేందుకు ఎవ్వరూ అంగీకరించారు. అంతెందుకు మనమే అలాంటి నోట్లను ఎవరైనా ఇస్తే తీసుకోం... మరి వేరేవాళ్లు ఎందుకు తీసుకుంటారు. 

ఏ పదో ఇరవై రూపాయలో నడవకుంటే పర్వాలేదు... ఏ వందో,రెండొందలో, ఐదొందల నోట్లో నడవకపోతే కంగారు పడతాం. ఎలాగైనా మార్చుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తాం. చిరిగిన నోట్లను గమ్ తోనే, ప్లాస్టర్ తోనో అతికించేందుకు చూస్తాం.  

అయితే ఇలా కష్టపడకుండానే మన దగ్గర నడవని కరెన్సీ నోట్లు వుంటే ఈజీగా మార్చుకోవచ్చు. దగ్గర్లోని ఏ బ్యాంకుకైనా వెళ్లి నడవని నోట్లను ఇచ్చి కొత్తనోట్లను పొందవచ్చు.  అంతేకాదు రిజర్వ్ బ్యాంక్ ప్రాంతాయ కార్యాలయాల్లోనూ ఇలా కరెన్సీని మార్చుకోవచ్చు. ఇలా కరెన్సీ నోట్లతో కుస్తీ పట్టకుండా చాలా ఈజీగా మార్చుకోవచ్చు.  

మన దగ్గరకు ఎలా వచ్చాయో తెలియదు... కానీ ఖర్చు చేయడానికి పనికిరాకుండా వుంటాయి కొన్ని కరెన్సీ నోట్లు. వాటిని ఏ షాప్ వాళ్లు తీసుకోరు... అలాగని పడేయడానికి చేతులురావు. అలాంటి కరెన్సీ నోట్లలో వేటిని మార్చుకోవచ్చు, వేటిని మార్చుకోడానికి వీలుండదో తెలుసుకుందాం. 


torn currency notes

మార్చుకోదగిన కరెన్సీ నోట్లు : 

సాయిల్డ్ నోట్స్ అంటే బాగా పాడయిపోయిన కరెన్సీ నోట్ల అని అర్థం. ప్రింట్ చేసి చాలాకాలం గడిచినా, ఏళ్లపాటు ఒకేచోట దాచివుంచినా, తడిసిపోయినా కరెన్సీ నోట్లు పాడయిపోతాయి. ఒక్కోసారి సహజంగానే వందలు, వేల చేతులుమారి దెబ్బతింటాయి. 

ఇలా వివిధ కారణాలతో నోట్లు పాడయిపోతుంటాయి. ఇలాంటి నోట్లు అక్కడక్కడా చిరిగిపోయి, కొన్నిచోట్ల రంగుచెదిరి వుంటాయి. కొన్ని రెండు బాగా పాడయిపోయి మెత్తగా మారి రెండు ముక్కలవుతాయి. ఇలాంటి కరెన్సీని సాయిల్డ్ నోట్లస్ అంటారు. వీటిని మార్చుకునే అవకాశం వుంటుంది.

అయితే నోటు మొత్తం పాడయిపోయినా దానిపై వుండే అంకెలు చెదిరిపోకూడదు. అలాగే చిరుగు నంబర్ల మీదుగా జరిగి వుండకూడదు. పోడయిపోయినా, చిరిగిపోయినా పూర్తి నోటు వుండాలి. అలాంటప్పుడే మార్చేందుకు అవకాశం వుంటుంది. 

రెండు కంటే ఎక్కువ ముక్కలైన నోట్లను చిరిగిన నోట్లు అంటారు. ఇలాంటి నోట్లలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గాంధీ బొమ్మ వంటి కీలకమైనవి మిస్సయినా నోటును మార్చుకునే అవకాశం వుంటుంది. అయితే చిరిగిన ముక్కలన్నీ ఒకే నోటువి అయివుండాలి.  

ఇక చాలాకాలం దాచివుంచడంతో వాడటానికి వీలులేకుండా మారిపోయిన, కాలిపోయిన కరెన్సీని కూడా మార్చవచ్చు.  కానీ అసలు నామరూపాలు లేకుండావుండి ఏదో చిన్నముక్క మిగిలితే మాత్రం మార్చుకోలేం. పూర్తి నోటు వుండి కొద్దిగా దెబ్బతింటేనే మార్చడానికి సాధ్యపడుతుంది. 
 

torn currency notes

ఎలాంటి నోట్లను మార్చుకోలేం : 

పాడయిపోయిన నోట్లను పరిశీలించిన వాటిని తీసుకోవాలో వద్దో బ్యాంకు సిబ్బంది నిర్ణయిస్తారు. సంబంధిత అధికారి ఒక్కసారి కరెన్సీ నోటు PAY/PAID లేదా REJECT అనే స్టాంప్స్ వేస్తారు. 

ఇలా పే, పేయిడ్ స్టాంప్ వేసారంటే ఈ నోటుకు ఇప్పటికే డబ్బులు చెల్లించారని. రిజెక్ట్ చేస్తే ఈ నోటు డబ్బులు చెల్లించే అవకాశం లేనిదని అర్థం. ఇలా స్టాంప్ చేసిన నోట్లను ఏ బ్యాంకుకు వెళ్లినా తీసుకోరు. 

ఇక పూర్తిగా చినిగిపోయి ఏ ముక్క ఏ నోటుదో తెలియకుండా వున్న కరెన్సీని కూడా బ్యాంకులు, ఆర్బిఐ బ్రాంచ్ లు తిరస్కరిస్తాయి. అంటే ఆ కరెన్సీ నోటు ఏదో పూర్తిగా గుర్తించేలా వుండాలి. 

కరెన్సీ నోటుపై అంకెలు చెదిరిపోయినా, రంగులుపడి గుర్తించలేకుండా మారిపోయినా తిరస్కరిస్తారు. ముఖ్యంగా కరెన్సీ నోట్ ముక్కలన్నీ వుండాలి... వాటిని ఒక్కచోటికి చేర్చితే పూర్తి నోటు ఏర్పడాలి. 

భారత రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం  కరెన్సీ నోట్లపై ఎలాంటి నినాదాలు, మతపరమైన సందేశాలు రాయకూడదు. అంటే నోటుపై ఖాళీగా వుండే ప్రదేశాల్లో ఎలాంటి రాతలు రాయకూడదు. అలాంటి నోట్లను బ్యాంకులు స్వీకరిస్తాయి... కానీ వాటిని చెలామణీ నుండి తొలగిస్తాయి. 

torn currency notes

నడవని కరెన్సీ నోట్లను ఇలా మార్చుకొండి : 

చెడిపోయిన నోట్లను రిజర్వ్ బ్యాంక్ పరిధిలోని ఏ బ్యాంకులో అయినా మార్చుకోవచ్చు. బ్యాంకు వేళలో చిరిగిన, పాడయిన నోట్లను తీసుకెళ్లి ఇస్తే చాలు వాటికి తీసుకుని కొత్త నోట్లను ఇస్తారు.ఇందుకోసం ఎలాంటి ఫారాలు నింపాల్సిన అవసరం లేదు... ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన  పనిలేదు. 

ఒక వ్యక్తి రూ.5000 కంటే ఎక్కువ విలువ కలిగిన 5 కంటే ఎక్కువ కరెన్సీ నోట్లను మార్చుకోవాలంటే కరెన్సీ చెస్ట్ బ్రాంచ్ ను సంప్రందించాల్సి వుంటుంది. అంతకంటే తక్కువ విలువగల నోట్లు 5 వరకు బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. 

కాబట్టి బయట కమీషన్ తీసుకుని చిరిగిన నోట్లను తీసుకుని కొత్తనోట్లను అందించేవారి చేతిలో నష్టపోకండి. నడవని నోట్లను ఎలా మార్చుకోవాలో తెలిసింది కాబట్టి బ్యాంకులను సంప్రదించండి. రిజర్వ్ బ్యాంక్ సూచనల ప్రకారం ప్రతి బ్యాంక్ కూడా నడవని నోట్లను తీసుకోవాలి. ఈ విషయంలో ఎలాంటి వివక్ష చూపించకూడదు. ఏదయినా  ఇబ్బంది కలిగిస్తే బ్యాంక్ ఉన్నతాధికారులు, ఆర్బిఐ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.   
 

Latest Videos

click me!