భారీ డిస్కౌంట్‌తో విమాన టిక్కెట్లు అమ్మి, తప్పైపోయిందన్న ఎయిర్‌లైన్‌ సంస్థ: అసలేం జరిగిందంటే..

First Published | Sep 4, 2024, 1:05 PM IST

చిన్న టెక్నికల్‌ ప్రాబ్లం.. ఓ ఎయిర్‌లైన్ సంస్థకు లక్షల్లో నష్టం తీసుకొచ్చింది. ఎయిర్‌ లైన్‌ టికెట్ల విక్రయంలో భారీ తగ్గింపు ప్రకటన కనబడటంతో ప్రయాణికులు వెంటవెంటనే టిక్కెట్లు కొనేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన సదరు ఎయిర్‌లైన్‌ సంస్థ పొరపాటు జరిగిందని చెప్పి ప్రయాణికులకు లక్షల డబ్బు వెనక్కు ఇవ్వాల్సి వచ్చింది. ఈ సంఘటన ఎక్కడ జరిగింది? ఏమిటా ఎయిర్‌లైన్‌ సంస్థ? ఎంత నష్టపోయింది తదితర వివరాలు ఇప్పడు తెలుసుకుందాం. 
 

ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్ అనే  విమానయాన సంస్థ ఈ నష్టాన్ని ఎదుర్కొంది. క్వాంటాస్ వెబ్‌సైట్‌లోని కోడింగ్ లోపం కారణంగా ఫస్ట్ క్లాస్ టిక్కెట్లు 85 శాతం తగ్గింపు ప్రకటన విడుదలైంది. ఆశ్యర్యానికి గురైన ప్రయాణికులు చాలా ఉత్సాహంగా వెంటవెంటనే టిక్కెట్లు కొనేశారు. విలాసవంతమైన సౌకర్యాలతో కూడిన టిక్కెట్లు తక్కువ ధరకు అమ్ముడయ్యాయి. 
 

ఆస్ట్రేలియా, యుఎస్ఎ మధ్య క్వాంటాస్ ఎయిర్‌లైన్‌ సర్వీసులు నడుపుతోంది. రెగ్యులర్‌గా టిక్కెట్లు బుక్‌ చేసుకొనే క్రమంలో ప్రయాణికులు క్వాంటాస్‌ వెబ్‌సైట్‌ను సందర్శించారు. అక్కడ సాధారణ ధర కంటే చాలా తక్కువ ధరను ఫస్ట్‌ క్లాస్‌ టిక్కెట్లు కనిపించాయి. 85 శాతం తగ్గింపు కనిపించింది. అసాధారణమైన ఆఫర్‌ను చూసిన చాలా మంది ప్రయాణికులు వెంటనే టిక్కెట్లను బుక్ చేసుకోవడం ప్రారంభించారు. దాదాపు 300 మంది ప్రయాణికులు ఆస్ట్రేలియా-యుఎస్ రౌండ్ ట్రిప్ టిక్కెట్ ఆఫర్ ధరకు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు.
 


ఈ విషయం కంపెనీకి తెలిసేసరికి దాదాపు 300 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. షాక్‌ గురైన కంపెనీ సిబ్బంది పొరపాటును గుర్తించి టిక్కెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులను వెంటనే సంప్రదించారు. అయితే ధరల్లో తేడాలు జరిగితే ఆ టిక్కెట్ బుకింగ్‌ను రద్దు చేసే హక్కు కంపెనీకి ఉంటుంది. అంతేకాకుండా డబ్బును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కొత్త టిక్కెట్ జారీ చేసే అధికారం కంపెనీ నిబంధనల్లో ఉంది. ఈ పొరపాటుకు బాధ్యత వహిస్తూ క్వాంటాస్ ఎయిర్‌లైన్‌ మరో ఆఫర్‌ ఇచ్చింది. బిజినెస్ క్లాస్ ప్రయాణికులు సాధారణంగా 65 శాతం తగ్గింపుతో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. 

ఫస్ట్‌ క్లాస్‌ టిక్కెట్లు కావడంతో సౌకర్యాలు అద్భుతంగా ఉంటాయి. ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, షాంపేయిన్‌, బెడ్‌ ఉండే విశాలమైన సీట్లు, ఫుడ్‌లోనూ ప్రత్యేక మెనూ ఇందులో ఇస్తారు. ఇంత విలాసవంతమైన సేవలతో కూడిన టిక్కెట్లు తక్కువ ధరకు లభించడంతో సుమారు 300 మంది ఈ టిక్కెట్లు కొనేశారు. సాధారణంగా ఈ టిక్కెట్ల ధర 15,000 డాలర్లు ఉంటుంది. అయితే 5000 డాలర్ల కంటే తక్కువ ధరకు అమ్ముడయ్యాయి. ఈ టిక్కెట్ల విక్రయం దాదాపు ఎనిమిది గంటల పాటు కొనసాగింది. 

ఈ ఏడాది ప్రారంభంలో కూడా రద్దు చేసిన విమానాల టిక్కెట్లను క్వాంటాస్‌ అమ్మింది. దీనికి  ఆ కంపెనీ భారీ జరిమానా కట్టాల్సి వచ్చింది. ఆస్ట్రేలియన్ కాంపిటీషన్, కన్స్యూమర్ కమిషన్‌తో జరిగిన ఒత్తిడి తర్వాత కంపెనీ మొత్తం 100 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించింది. ఇటీవల మళ్లీ కోడింగ్‌లో లోపం వచ్చింది. క్వాంటాస్‌ ఎయిర్‌లైన్స్‌లో తరచూ జరుగుతున్న ఈ పొరపాట్లు ఆ కంపెనీకి తరచూ నష్టాలు తెచ్చిపెడుతోంది. తమ విలువైన సమయం, డబ్బు వృథా అవుతున్నాయని ప్రయాణికులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

Latest Videos

click me!