మీరు ఎక్కువగా టాక్స్ కడుతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే టాక్స్ కట్టక్కర్లేదు

First Published | Dec 3, 2024, 2:46 PM IST

చాలా మంది ఇన్ కమ్ టాక్స్ ఆదా చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. హెల్త్ ఇన్సూరెన్స్, హోమ్ లోన్స్, డొనేషన్స్ ఇలా అనేక విధాలుగా టాక్స్ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇవన్నీ సెక్షన్ 80C కింద ఎన్నో ఏళ్లుగా ఫాలో అవుతున్న పద్దతులు. అయితే మీ పన్ను భారాన్ని గణనీయంగా తగ్గించే ఎవరికీ పెద్దగా తెలియని కొన్ని పద్ధతుల గురించి ఇక్కడ తెలుసుకుందాం రండి. 

సాధారణంగా చాలా మంది సెక్షన్ 80C కింద పెట్టుబడులు, ఇంటి లోన్ వడ్డీపై మినహాయింపు, హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు వంటి సాధారణ పన్ను సేవింగ్ పద్ధతులు పాటిస్తుంటారు. మీ పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి మీరు తెలియని అనేక మార్గాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే పిల్లల చదువుల ఖర్చులు, తల్లిదండ్రులకు అద్దె చెల్లింపులు, కుటుంబ సభ్యుల వైద్య ఖర్చులు వంటి వాటికి కూడా పన్ను ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పద్ధతులను ఉపయోగించడం వల్ల గణనీయమైన టాక్స్ ను మీరు ఆదా చేయవచ్చు.

మీ పిల్లల ప్లే గ్రూప్, ప్రీ నర్సరీ లేదా నర్సరీ చదువుల ఖర్చులపై పన్ను మినహాయింపు పొందవచ్చని మీకు తెలుసా? ఈ ప్రయోజనం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కిందకు వస్తుంది. ఈ ప్రయోజనాన్ని 2015లోనే ప్రవేశపెట్టినప్పటికీ స్కూల్ ఎడ్యుకేషన్ ఖర్చుల మినహాయింపు వంటి గుర్తింపు దీనికి రాలేదు. ఇద్దరు పిల్లల వరకు తల్లిదండ్రులు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇది ప్రాథమిక విద్యకు పన్ను ప్రయోజనం పొందడానికి మంచి అవకాశం.


మీ తల్లిదండ్రులు తక్కువ పన్ను పరిధిలో ఉన్నా లేదా టాక్స్ చెల్లించని వారైతే ఇంటి ఖర్చుల కోసం వారి నుండి డబ్బు తీసుకోండి. ఇందుకు గాను మీ తల్లిదండ్రులకు తిరిగి వడ్డీ చెల్లించినట్లుగా బిల్లు తీసుకోండి. దీని ద్వారా సెక్షన్ 24B కింద రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ చక్కటి ఆలోచనతో పన్ను పరిధిలోకి వచ్చే మీ ఆదాయాన్ని తగ్గించడమే కాకుండా మీ కుటుంబానికి కూడా ప్రయోజనం చేకూరినట్లు అవుతుంది.

మీ తల్లిదండ్రులతో కలిసి ఉండటం వల్ల ఇంటి అద్దె(HRA) ప్రయోజనాలను కోల్పోవాల్సిన అవసరం లేదు. సెక్షన్ 10(13A) కింద మీరు మీ తల్లిదండ్రులకు చట్టబద్ధంగా అద్దె చెల్లించవచ్చు. వారిని ఇంటి యజమానులుగా ప్రకటించవచ్చు. HRA పొందవచ్చు. రెంటల్ అగ్రిమెంట్, రసీదులు వంటి సరైన డాక్యుమెంట్లను మీరు మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇప్పటికే సొంత ఇల్లు ఉంటే ఈ మినహాయింపు వర్తించదు.

మీ కుటుంబ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల పన్ను ఆదా అవుతుంది. సెక్షన్ 80D కింద 65 ఏళ్లలోపు తల్లిదండ్రుల ఆరోగ్య బీమా ప్రీమియంపై రూ.25,000 వరకు మినహాయింపు పొందవచ్చు. 65 ఏళ్లు పైబడిన తల్లిదండ్రులకు ఈ మొత్తం రూ.50,000కు పెరుగుతుంది. అదనంగా మీ భార్య, పిల్లలకు చెల్లించిన ప్రీమియంలకు కూడా మినహాయింపులు పొందవచ్చు. 

60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు వైద్య ఖర్చులను సెక్షన్ 80D కింద గరిష్టంగా రూ.50,000 వరకు టాక్స్ మినహాయింపు పొందవచ్చు. ఈ పద్ధతులు చట్టబద్ధమైనవి మాత్రమే కాదు, సరైన డాక్యుమెంట్లతో అమలు చేయడం కూడా సులభం.

Latest Videos

click me!