Google Earth - time travel : కొత్త టెక్నాలజీలను పరిచయం చేస్తూ అద్భుతమైన అనుభూతిని, మానవ జీవనాన్ని మరింత సులభతరం చేయడంలో గూగుల్ కీలక పాత్ర పోషిస్తోంది. సరికొత్త టెక్నాలజీని పరిచయం చేస్తూ ప్రపంచాన్ని మన ముందర ఉంచుతోంది. ఈ క్రమంలోనే మరో అద్భుతంలో గూగుల్ ముందుకొచ్చింది. దీంతో 80 సంవత్సరాల వెనక్కి టైమ్ ట్రావెల్ చేయవచ్చు. ఆ సమయంలో ఇప్పుడున్న ప్రాంతాలు ఏలా ఉండేవో చూడవచ్చు. దీనిని తలుచుకుంటేనే అద్భుతంగా అనిపిస్తుంది కాదా.. ! ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం.
గూగుల్ అందిస్తున్న సర్వీసులలో గూగుల్ ఎర్త్ కూడా ఒకటి. Google Earth అనేది ఇతర ఉపగ్రహాల నుంచి భూమిని చూస్తే ఏలా ఉంటుందో అలాంటి భూ దృశ్యాలను అందిస్తుంది. అంటే గూగుల్ ఎర్త్ సర్వీసులను ప్రారంభించినప్పటి నుంని భూమిని మానిటర్ చేస్తూ దాని దృశ్యాలను రికార్డు చేస్తోంది.
అంటే భూ గ్రహం పై ఉన్న ప్రాంతాలను రికార్డు చేస్తుంది. ఉపగ్రహాల నుంచి చూసినట్టుగా భూ గ్రహం, దాని అనేక స్థానాలను చూడటానికి వినియోగదారులను అనుమతిస్తుంది గూగుల్ ఎర్త్. ఇది భూమి దృశ్యాలను త్రీడీ రూపంలో అందిస్తుంది. వెబ్, కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా భూ ప్రాంతాలను చూడటానికి వీలు కల్పిస్తుంది. ప్రజలు వివిధ కోణాల నుండి నగరాలు, ప్రకృతి దృశ్యాలను చూడవచ్చు.
ఎప్పటికప్పుడు గూగుల్ ఎర్త్ తన సర్వీసును మెరుగుపరుస్తోంది. ఈ క్రమంలోనే 80 సంవత్సరాల క్రితం భూమి ఎలా ఉందనే రికార్డులను చూసే అవకాశం వినియోగదారులకు అందిస్తోంది. అంటే మిమ్మల్ని 1930వ దశకం నాటి కాలంలోకి తీసుకెళ్తుంది.
ఇది ఒక టైమ్ ట్రావెలింగ్ లాంటిదనే చెప్పాలి. ఇక్కడ మనం గత కాలంలోకి వెళ్తాం. దీని కోసం గూగుల్ సెర్చ్ ఇంజిన్ తన శాటిలైట్ ఇమేజరీ ప్లాట్ఫామ్ గూగుల్ ఎర్త్ లో కొన్ని కొత్త అప్డేట్లను తీసుకురానుంది. కొత్త ఫీచర్లను ఉపయోగించి మీరు 80 సంవత్సరాల వరకు వెళ్లి, ఆ కాలానికి చెందిన ఉపగ్రహ, వైమానిక చిత్రాలతో భూమిని, ఇక్కడి ప్రాంతాలను చూడవచ్చు.
ప్రస్తుతం, గూగుల్ ఎర్త్ కొన్ని దశాబ్దాల క్రితం వరకు చాలా ప్రదేశాల చిత్రాలను చూడటానికి ప్రజలను అనుమతిస్తుంది. కొత్త అప్డేట్ తో లండన్, బెర్లిన్, వార్సా, పారిస్ వంటి కొన్ని నగరాల్లో 1930ల నాటి చిత్రాలు ఉంటాయని గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాథమికంగా, చాలా ప్రదేశాలకు కాలపరిమితి రెట్టింపు అవుతుంది. ఇది ప్రజలను "టైమ్ ట్రావెల్" చేయడానికి, ఆ సమయంలో ఆ ప్రాంతాలు ఏలా ఉన్నాయో చూడటానికి అనుమతిస్తుంది.
వినియోగదారులు నగరాలను పక్కపక్కనే పెట్టి పోల్చి చూడవచ్చు. ఈ సంవత్సరాలలో అవి ఎలా మారిపోయాయో కూడా చూడవచ్చు. ఈ వివరాలు వెల్లడించిన గూగుల్ తన ప్రకటనలో శాన్ ఫ్రాన్సిస్కో 1938లో ఎలా ఉండేది-2024లో ఈ రోజు ఎలా ఉంది అనే వివరాలతో రెండింటి మధ్య పోలికలతో చిత్రాలను, వివిధ రకాల డేటాను పంచుకుంది. భౌగోళికంగా ఏలా మారిపోయిందో ఈ చిత్రాలు వివరిస్తున్నాయి.
Gigantic Ocean
1938లో శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓడరేవులు ప్రధానంగా షిప్పింగ్ కోసం ఎలా ఉపయోగించబడ్డాయో నమూనా ఫోటో చూపిస్తుంది. అయితే, గూగుల్ అందించిన తాజా Google Earth చిత్రం ప్రకారం, ఈ ప్రదేశం ఇప్పుడు రెస్టారెంట్లు, క్రూయిజ్ షిప్‌లతో నిండిపోయింది. వినియోగదారులు మొబైల్, వెబ్ రెండింటిలోనూ కొత్త Google Earth ఫీచర్‌ని యాక్సెస్ చేయవచ్చు. రాబోయే వారాల్లో అప్‌డేట్‌లు విడుదల చేయనున్నట్టు సమాచారం.
తన గూగుల్ ఎర్త్ అప్ డేట్ లో చారిత్రక చిత్రాలతో పాటు, దాదాపు 80 దేశాల్లో గూగుల్ మ్యాప్స్‌లో వీధి వీక్షణను కూడా విస్తరిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. గూగుల్ ఎర్త్, గూగుల్ మ్యాప్స్‌లో వాటి నాణ్యతను మెరుగుపరచడానికి కంపెనీ ప్రణాళికలు చేసిందనీ, రాబోయే కాలంలో చిత్రాలు, భూ దృశ్యాలు మరింత స్పష్టంగా ఉంటాయనీ, దీని కోసం కొత్త AI మోడల్‌ల వైపు ముందుకు నడుస్తున్నదని కూడా సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.