డాటా లీక్ పై రగడ: సి‌సి‌ఐకి వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించిన గూగుల్..

First Published Sep 24, 2021, 6:43 PM IST

గూగుల్  సంస్థ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఒప్పందాలపై కొనసాగుతున్న విచారణకు సంబంధించి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ రూపొందించిన రహస్య మధ్యంతర ఫాక్ట్ ఫైండింగ్ నివేదిక మీడియాకు లీక్  చేసిందని ఆరోపిస్తూ గూగుల్ ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. 

 కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ విభాగాల గోప్యపు నివేదికలను చట్టవిరుద్ధంగా పబ్లిక్ చేయకూడదని గూగుల్ ఢిల్లీ హైకోర్టుకు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గూగుల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ డీల్‌కు సంబంధించి  కొనసాగుతున్న దర్యాప్తు నివేదికను సిసిఐ మీడియాకు లీక్ చేయడంపై అవతలి వ్యక్తుల ప్రాథమిక హక్కుల్ని భంగపరచడమే అవుతుందని గూగుల్‌ వాదిస్తోంది. ఇక మీదట దర్యాప్తునకు సంబంధించిన వివరాలు బయటకు రాకుండా కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తు విభాగాన్ని నిలువరించాలని హైకోర్టును అభ్యర్థించినట్లు  గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది.
 

ప్రధాన న్యాయమూర్తి డిఎన్ పటేల్ ముందు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ గూగుల్ తరఫున కేసు గురించి ప్రస్తావించారు. అలాగే ఈ కేసులో అత్యవసర విచారణ చేపట్టాలని  అభ్యర్థించారు.

యాంటీ-ట్రస్ట్ బాడీ గూగుల్‌పై ప్రతికూల దర్యాప్తు నివేదికను సిద్ధం చేసిందని, అది ఇప్పుడు మీడియాకు లీక్ అవుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ నివేదికలు ఇప్పటికే అంతటా బయటపడ్డాయని లైవ్‌లా నివేదించినట్లు ఆయన పేర్కొన్నారు.

హైకోర్టులో పిటిషన్‌పై గూగుల్ ప్రతినిధి మాట్లాడుతూ, సిసిఐ కస్టడీలో ఉన్నప్పుడు ఈ నివేదిక మీడియాకు లీక్ చేయబడిందని కంపెనీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో అలాంటి డేటా లీక్ ఉండకూడదని డిమాండ్ చేస్తున్నాము అని అన్నారు.

"రహస్య సమాచారాన్ని కాపాడటం అనేది ఏ ప్రభుత్వ విచారణకైనా ప్రాథమికమైనది, మేము ఇటువంటి చట్టవిరుద్ధమైన బహిర్గతాలను నివారించడానికి మా చట్టపరమైన హక్కును అనుసరిస్తున్నాము. దర్యాప్తు ప్రక్రియ అంతటా మేము పూర్తిగా సహకరించాము, గోప్యతను కొనసాగించాము. అలాగే మేము వారి నుండి అదే స్థాయి గోప్యతను ఆశిస్తున్నాము”అని ప్రతినిధి ప్రకటనలో తెలిపారు.

మరోవైపు డీజీ దర్యాప్తులోని అంశాలు కేవలం ఆరోపణలేనని, అవి తుదితీర్పుపై ప్రభావం చూపించకపోవచ్చనే గూగుల్‌ చెబుతోంది. దీనికి సంబంధించి నివేదికగానీ, నోటీసులుగానీ తమదాకా రాలేదని, అందుకే ఈ అంశంపై సమీక్ష దిశగా కూడా ఆలోచన చేయట్లేదని పేర్కొంది.
 

click me!