Today Gold Price: పసిడి ప్రియులు, సామాన్యుల నెత్తిపై ఒక్కసారిగా పిడుగు పడినట్లైంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మార్కెట్లు పాతాళానికి పడిపోయాయి. బంగారం ధరలు రాకెట్‍లా ఆకాశానికి దూసుకెళ్లాయి. కొనుగోలుదారులు, మధ్యతరగతి ప్రజలపై భారీ భారం పడింది.
దేశవ్యాప్తంగా బంగారం మార్కెట్ ఒక్కసారిగా కుదేలైంది. కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాన్ని భారీగా పెంచడంతో పసిడి ధరలు రికార్డు స్థాయికి ఎగబాకాయి. గతంలో 6 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని ఏకంగా 15 శాతానికి పెంచుతూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేయడం మార్కెట్‌లో కలకలం రేపింది. ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిన గంటల్లోనే హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు అగ్నిపర్వతంలా పేలాయి.
26
రూ.1,67,890కు చేరిన మేలిమి బంగారం
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.13,910 పెరిగి రూ.1,67,890కు చేరింది. 22 క్యారెట్ల బంగారం కూడా రూ.12,750 పెరిగి రూ.1,53,900 పలుకుతోంది. వెండి, ప్లాటినమ్ వంటి విలువైన లోహాలపై కూడా సుంకాలు పెరగడంతో మొత్తం బులియన్ మార్కెట్ వేడెక్కిపోయింది.
36
దిగుమతి ఖర్చు పెరగడమే కారణం
అసలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణం దిగుమతి ఖర్చు ఒక్కసారిగా పెరగడమే. భారత్‌లో వినియోగించే బంగారంలో ఎక్కువ భాగం విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. ఇప్పుడు సుంకం 15 శాతానికి చేరడంతో దిగుమతి వ్యయం భారీగా పెరిగింది. దాని ప్రభావం నేరుగా దేశీయ మార్కెట్‌పై పడింది. జ్యువెలరీ వ్యాపారులు వెంటనే కొత్త రేట్లు అమలు చేయడంతో కొనుగోలుదారులు షాక్‌కు గురయ్యారు.
ఇప్పటికే అంతర్జాతీయంగా పశ్చిమాసియా ఉద్రిక్తతలు, డాలర్ మార్పులు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. అలాంటి సమయంలో కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం మార్కెట్‌పై మరింత ఒత్తిడి తీసుకొచ్చింది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ దగ్గరపడుతున్న సమయంలో ఈ పెరుగుదల మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద భారం కానుంది.
56
మోదీ ప్రకటనతో బంగారం కొనుగోళ్లపై ప్రభావం
ఇటీవల ప్రధాని మోదీ కూడా దేశ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొంతకాలం బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. విదేశీ కరెన్సీ వ్యయాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల తర్వాతే దిగుమతి సుంకాల పెంపు జరిగింది. దీంతో ప్రభుత్వం బంగారం దిగుమతులను నియంత్రించాలనే వ్యూహంతో ముందుకెళ్తోందనే చర్చ జరుగుతోంది.
66
అక్రమ బంగారం రవాణా పెరిగే ప్రమాదం ఉందంటున్న నిపుణులు
అయితే ఈ నిర్ణయం వల్ల అక్రమ బంగారం రవాణా పెరిగే ప్రమాదం ఉందని కొందరు మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు, ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందన్న అంచనాలతో కొందరు ఇన్వెస్టర్లు ఇప్పుడు కూడా కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. తాజా నిర్ణయం బంగారం మార్కెట్‌లో భారీ ప్రకంపనలు సృష్టించింది. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిస్థితులు ఎలా మారతాయన్న దానిపైనే ఇప్పుడు గోల్డ్ మార్కెట్ భవిష్యత్ ఆధారపడి ఉంది.