Gold Overdraft: ఆర్థిక అవసరాలు ఎప్పుడెప్పుడు వస్తాయో చెప్పలేం. అలాంటి సందర్భాల్లో చాలామంది బంగారాన్ని తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకుంటారు. అయితే గోల్డ్ లోన్‌కంటే మరింత సౌకర్యంగా ఉండే మరో ఆప్షన్ కూడా ఉంది. అదే బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్.
బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్ అనేది ఒక రకమైన క్రెడిట్ లైన్. సాధారణ గోల్డ్ లోన్‌లా ఒకేసారి మొత్తం డబ్బు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. బ్యాంక్ మీ బంగారం విలువ ఆధారంగా ఒక పరిమితి (లిమిట్) నిర్ణయిస్తుంది. ఆ లిమిట్ నుంచి మీకు అవసరమైనప్పుడు, ఎంత కావాలంటే అంత మాత్రమే తీసుకోవచ్చు. మీరు తీసుకున్న మొత్తంపైనే వడ్డీ చెల్లించాలి. లిమిట్ మొత్తం మీద కాదు. ఇది చాలా సౌకర్యంగా ఉండే విధానం.
26
గోల్డ్ లోన్‌తో తేడా ఏమిటి?
గోల్డ్ లోన్‌లో ఒకేసారి మొత్తం డబ్బు తీసుకోవాలి. తీసుకున్న మొత్తం మీద వడ్డీ పడుతుంది. కానీ ఓవర్‌డ్రాఫ్ట్‌లో మీరు అవసరానికి అనుగుణంగా డబ్బు తీసుకోవచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, గోల్డ్ లోన్‌లో EMIలు కచ్చితంగా చెల్లించాలి. కానీ ఓవర్‌డ్రాఫ్ట్‌లో మీరు మీ సౌలభ్యానికి అనుగుణంగా డబ్బు తిరిగి చెల్లించవచ్చు. ఇది క్రెడిట్ కార్డు విధానం లాంటిదే.
36
బంగారం విలువ ఎలా లెక్కిస్తారు?
బ్యాంక్ ముందుగా మీ బంగారు నగల బరువు, స్వచ్ఛత (18K నుంచి 24K వరకు) పరిశీలిస్తుంది. ఆ తర్వాత ప్రస్తుత మార్కెట్ ధర ఆధారంగా మొత్తం విలువ నిర్ణయిస్తుంది. ఈ విలువలో సాధారణంగా 70% నుంచి 75% వరకు ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితి ఇస్తారు. ఉదాహరణకు, మీ బంగారం విలువ రూ.10 లక్షలు అయితే, సుమారు రూ.7 లక్షల వరకు లిమిట్ ఇవ్వొచ్చు.
ఓవర్‌డ్రాఫ్ట్‌లో వడ్డీ మీరు వాడిన మొత్తంపైనే లెక్కిస్తారు. బ్యాంకును బట్టి వడ్డీ రేటు సుమారు 8% నుంచి 15% మధ్య ఉంటుంది. దీనిని రోజువారీగా లెక్కిస్తారు. కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు కూడా వసూలు చేస్తాయి. ఇది సాధారణంగా 0.5% నుంచి 1.5% వరకు ఉంటుంది. అలాగే వాల్యుయేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీ వంటి ఇతర చిన్న ఖర్చులు కూడా ఉండొచ్చు.
56
గోల్డ్ ఓవర్‌డ్రాఫ్ట్ లాభాలు
ఈ సదుపాయం ద్వారా మీరు చాలా ఫ్లెక్సిబిలిటీ పొందుతారు. అవసరమైనప్పుడు మాత్రమే డబ్బు తీసుకోవచ్చు. తీసుకున్న మొత్తంపైనే వడ్డీ ఉంటుంది. వ్యాపారం, వైద్య ఖర్చులు, అత్యవసర అవసరాల కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. బంగారం అమ్మాల్సిన అవసరం ఉండదు. బ్యాంక్‌లో సురక్షితంగా ఉంటుంది. మొబైల్ బ్యాంకింగ్, ATM ద్వారా కూడా ఈ డబ్బు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. మీరు తీసుకున్న మొత్తాన్ని ఎప్పుడైనా తిరిగి చెల్లించి మళ్లీ ఉపయోగించుకోవచ్చు.
66
ఏ బ్యాంకులు ఈ సదుపాయం ఇస్తున్నాయి?
భారతదేశంలో కొన్ని ప్రధాన బ్యాంకులు ఈ సదుపాయం అందిస్తున్నాయి. ఉదాహరణకు ఫెడరల్ బ్యాంక్, సీఎస్‌బీ బ్యాంక్, తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ వంటి బ్యాంకులు తమ ఖాతాదారులకు గోల్డ్ ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం కల్పిస్తున్నాయి.