Gold Silver Price: కొన్నాళ్లుగా చుక్కలు చూపిస్తున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. పసిడి ధరలు భారీగా తగ్గగా.. వెండి ధరలు 11 నెలల కనిష్టానికి చేరాయి. ఒక్కరోజే తులం బంగారంపై వేల రూపాయలు, కిలో వెండిపై రూ.10 వేల మేర తగ్గుదల నమోదైంది.
బంగారం కొనాలనుకునే వారికి ఇది ఊరటనిచ్చే వార్తే. గత కొంతకాలంగా వరుస హెచ్చుతగ్గులతో ఆందోళనకు గురిచేసిన పసిడి ధరలు శనివారం భారీగా తగ్గాయి. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం.. శనివారం ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,880గా నమోదైంది. శుక్రవారంతో పోలిస్తే ఏకంగా రూ.3,880 తగ్గింది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,300కు చేరింది. క్రితం రోజుతో పోలిస్తే రూ.3,100 మేర దిగొచ్చింది.
24
వెండి కూడా పతనం
బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయి. ఒక్కరోజే కిలో వెండిపై రూ.10,000 తగ్గుదల నమోదై ధర రూ.2 లక్షలకు చేరింది. దీంతో వెండి ధరలు గత 11 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇటీవల భారీగా పెరిగిన వెండి ధరలు ఇలా ఒక్కసారిగా తగ్గడం కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ధరలు మరింత తగ్గుతాయా? లేక మళ్లీ పెరుగుతాయా? అనే విషయంలో మార్కెట్ పరిస్థితులను గమనించాల్సి ఉంటుంది.
34
పసిడి ధరలు పడిపోవడానికి కారణాలేంటి?
అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ఆర్థిక గణాంకాలు, ద్రవ్యోల్బణం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాలు పసిడి మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. అమెరికాలో అంచనాలను మించి జీడీపీ వృద్ధి నమోదవడం, సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం పెరగడం వంటి పరిణామాలు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలకు బలం చేకూర్చాయి. మరోవైపు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం కూడా ద్రవ్యోల్బణ భయాలను పెంచుతోంది. వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉన్నప్పుడు పెట్టుబడిదారులు బంగారం కంటే బాండ్లు వంటి వడ్డీ ఆదాయం ఇచ్చే పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతారు. ఎందుకంటే బంగారంపై ఎలాంటి వడ్డీ ఆదాయం లభించదు. దీంతో పసిడిపై పెట్టుబడుల ఆసక్తి తగ్గి ధరలపై ఒత్తిడి ఏర్పడుతుంది.
మరోవైపు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు కూడా అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితిని పెంచుతున్నాయి. సాధారణంగా యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా ఆర్థిక గణాంకాలు, వడ్డీ రేట్ల అంచనాలు, డాలర్ కదలికలు కూడా పసిడి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో సురక్షిత పెట్టుబడిగా పేరున్న బంగారం సైతం భారీ ఒడిదుడుకులకు లోనవుతోంది.
మొత్తంగా అంతర్జాతీయ పరిణామాలు బంగారం, వెండి మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ధరలు తగ్గడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించినప్పటికీ, పెట్టుబడి పెట్టాలనుకునేవారు మార్కెట్ కదలికలను గమనించడం అవసరం. బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతాయా? లేక మరింత తగ్గుతాయా? అనేది రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది.