కరెన్సీ నోట్ల మార్పిడికి ఎదురవుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని సెంట్రల్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మే 19న రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసి ఇతర విలువల నోట్లతో మార్చుకునే వెసులుబాటును ప్రజలకు కల్పించారు. ఇలాంటి నోట్లు ఉన్న ప్రజలు ఇంకా కంపెనీలు మొదట సెప్టెంబర్ 30 లోగా వాటిని మార్చుకోవాలని లేదా బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేయాలని కోరింది.
తరువాత గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించారు. అక్టోబరు 7న బ్యాంకు శాఖలలో డిపాజిట్ అండ్ ట్రాన్స్ఫర్ సేవలు రెండూ మూసివేసారు. అక్టోబరు 8 నుండి RBI కార్యాలయాలలో కరెన్సీ నోట్లని మార్చుకోవచ్చు లేదా సమానమైన మొత్తాన్ని వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయవచ్చు. అయితే ఇప్పుడు ఈ నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం కుదరదు. అయితే రూ.2,000 నోట్లను ఆర్‌బీఐ కార్యాలయాల్లో డిపాజిట్ చేసుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు.
కాగా, రూ.2000 నోట్లను మార్చుకునేందుకు లేదా డిపాజిట్ చేసేందుకు పనివేళల్లో ఆర్‌బీఐ కార్యాలయాల వద్ద పెద్ద క్యూలు కనిపిస్తున్నాయి. రూ.2000 నోట్ల మార్పిడి ప్రక్రియను ఆర్బీఐ ఇప్పుడు మరింత సులభతరం చేసింది. అదే ట్రిపుల్ లాక్ రిసెప్టాకిల్ (TLR). నివేదిక ప్రకారం, రూ. 2000 నోట్లను పోస్ట్ ద్వారా మార్చుకునే సదుపాయాన్ని కస్టమర్లకు కల్పిస్తున్నామని ఆర్‌బిఐ రీజినల్ డైరెక్టర్ రోహిత్ పి. దాస్ తెలిపారు.
నోట్ల మార్పిడి తర్వాత మొత్తం నేరుగా కస్టమర్ అకౌంట్లో జమ అవుతుంది. మంచి విషయమేమిటంటే, కస్టమర్లు బ్యాంకులకు వెళ్లి గంటల తరబడీ క్యూలలో నిలబడి నోట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇటీవలి నివేదిక ప్రకారం, 2000 రూపాయల నోట్లలో 97 శాతం మాత్రమే ఇప్పటివరకు ఆర్‌బిఐ వద్ద డిపాజిట్ చేయబడ్డాయి. కాగా ఇప్పటి వరకు కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఇంకా మార్కెట్‌లో ఉన్నాయి. ఈ నోట్లను వీలైనంత త్వరగా డిపాజిట్ చేయాలని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రజలను కోరారు.