Insurance: ఉచితంగా రూ. 7 లక్షల ఇన్సూరెన్స్‌.. ఎలా క్లెయిమ్‌ చేసుకోవాలంటే

ఉద్యోగం చేస్తున్న ప్రతీ ఒక్కరికీ ఈపీఎఫ్‌ ఉంటుందనే విషయం తెలిసిందే. ఉద్యోగుల భవిష్యత్‌కి ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పేరుతో ఒక సేవను అందిస్తుంది. పదవి విరమణ తర్వాత ఉద్యోగికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండడంలో ఈపీఎఫ్‌ ఉపయోగపడుతుంది. అయితే ఈపీఎఫ్‌ ఉన్న ప్రతీ ఒక్కరికీ ఉచితంగా ఇన్సూరెన్స్‌ లభిస్తుందని మీకు తెలుసా.? 
 

దేశంలోని అతి పెద్ద సామాజిక భద్రతా సంస్థల్లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రధానమైంది. ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్స్, పెన్షన్ పథకాల నిర్వహణ బాధ్యతను ఇది చూస్తుంది. కాగా ఈపీఎఫ్‌ ఉన్న ప్రతీ ఒక్కరికీ ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్ఐ) పథకం కింద రూ.7 లక్షల వరకు జీవిత బీమా కవరేజీ అందిస్తోంది. అయితే చాలా మందికి తెలిసి ఉండదు. ఇన్సూరెన్స్ అనగానే ప్రీమియం చెల్లించాలి కదా అనుకుంటాం. అయితే ఇందుకోసం ఉద్యోగి రూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదు. 
 

ఎంప్లాయూ డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ పథకం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్‌లేనియస్‌ ప్రొవిజన్స్ యాక్ట్, 1952 కింద పనిచేస్తుంది. ఇందులో ప్రతీ ఉద్యోగికి నెలకు గరిష్టంగా రూ. 75 ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది ఉద్యోగి చెల్లించాల్సిన పనిలేదు, సదరు యాజమాన్యమే భరిస్తుంది. ఉద్యోగీ తన సర్వీస్‌ కాలంలో మరణిస్తే, ఉద్యోగి నామినీకి బీమా డబ్బులు చెల్లిస్తారు. 
 


ప్రీమియం ఎలా లెక్కిస్తారంటే.? 

ప్రస్తుతం ఈ పథకం కింద మరణించిన ఉద్యోగి కుటుంబానికి రూ. 2.5 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు చెల్లిస్తారు. చనిపోయే కంటే ముందు గడిచిన 12 నెలల్లో ఉద్యోగి సగటు నెలవారీ జీతం ఆధారంగా మొత్తాన్ని లెక్కిస్తారు. ఈపీఎఫ్‌ సభ్యులైతే చాలు ప్రత్యేకంగా ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన పనిలేదు.  ప్రీమియంను ఉద్యోగి ప్రాథమిక నెలవారీ వేతనంలో 0.5 శాతంగా లెక్కిస్తారు. ఉద్యోగికి అప్పటికే ఉన్న వ్యక్తిగత బీమా పాలసీలతో సంబంధం లేకుండా ఇది అమలవుతుంది. గతంలో ఈ మొత్తం గరిష్టంగా రూ. 6 లక్షలు ఉండగా ఇప్పుడు రూ. 7 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 

ఇంతకీ బీమా మొత్తాన్ని ఎలా క్లెయిమ్‌ చేసుకోవాలో తెలుసా.? 

ఎంప్లాయూ డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ పథకం కింద బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేయడానికి, నామినీలు లేదా చట్టబద్ధమైన వారసులు ఫారం 5ఐఎఫ్‌తో పాటు ఉద్యోగి మరణ ధృవీకరణ పత్రం, నామినేషన్ రుజువు వంటి అవసరమైన పత్రాలను సమర్పించాలి. క్లెయిమ్‌ ఫామ్‌తో పాటు.. అవసరమైన ఇతర డాక్యుమెంట్లను జతచేసి సంబంధిత ఈపీఎఫ్ఓ ఆఫీసులో అందించాలి. నిర్ణీత సమయంలో నామినీకి బీమా లభిస్తుంది. 

Latest Videos

click me!