ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచడం ఈ మధ్య కాలంలో చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం 60 ఏళ్ల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచింది. దీంతో చాలా మంది ఎంప్లాయిస్ సంతోషించినప్పటికీ కొంత మంది మరో రెండేళ్లు ఎలా పనిచేయాలో తెలియక, పని చేయలేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఇదే విషయంపై కేంద్రప్రభుత్వం కూడా కేంద్రంలో సర్వీస్ చేస్తున్న ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు కూడా పెంచాలని ఆలోచిస్తోందని, త్వరలోనే పెంచుతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ పత్రికా సమాచార కార్యాలయం (PIB) స్పందించింది.
గత కొన్ని రోజులుగా రిటైర్మెంట్ వయసు పెరుగుతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇది పూర్తిగా అవాస్తవమని పీబీఐ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని వెల్లడించింది.
'రిటైర్మెంట్ వయసు పెంపు 2024, రిటైర్మెంట్ వయసు 2 సంవత్సరాలు పెంపు, కేబినెట్ సమావేశంలో ఆమోదం' అనే శీర్షికతో ఒక లేఖ వైరల్ అవుతోంది. ఈ పథకం పేరు 'రిటైర్మెంట్ వయస్సు పెంపు పథకం' అని కూడా ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు ఏప్రిల్ 1, 2025 నుంచి 2 సంవత్సరాలు పెంచి 62 ఏళ్లు చేస్తారని ఉంది. అందరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దీని ద్వారా ప్రయోజనం పొందుతారని కూడా అందులో పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ పత్రికా సమాచార కార్యాలయం (PIB) ఇది ఫేక్ అని ప్రకటించింది. ఇటీవల విడుదల చేసిన ప్రకటనలో 'కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ 2 సంవత్సరాలు పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వాదన అవాస్తవం. భారత ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోలేదు' అని పేర్కొంది. వార్తలను నిజనిర్ధారణ చేసుకోకుండా షేర్ చేయవద్దని కూడా సూచించింది.
ఆగస్టు 2023లో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ మార్చే ప్రణాళిక ఉందా లేదా అని లోక్‌సభలో ప్రశ్న వచ్చింది. దీనికి కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిస్తూ.. "కేంద్ర ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును మార్చే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదు" అని చెప్పారు.