20 రూపాయలకే రూ.2 లక్షల ప్రమాద బీమా: ఎక్కడో తెలుసా?

First Published | Nov 21, 2024, 2:10 PM IST

కేవలం రూ.20 కడితే ప్రమాద బీమా పొందే అవకాశం ఇక్కడ ఉంది. ఈ బీమా పాలసీ ద్వారా లబ్ధిదారులకు రూ.2 లక్షల వరకు లభిస్తాయి. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ఈ ఇన్సూరెన్స్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పాలసీ ఎక్కడ కట్టాలో వివరంగా తెలుసుకుందాం. 

జీవితంలో ఎవరు, ఎప్పుడు, ఏ సమస్యను ఎదుర్కొంటారో చెప్పలేం. కాబట్టి ఏదైనా ఊహించని పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఈ కాలంలో బీమా చాలా ముఖ్యమైన అవసరంగా మారింది. ప్రమాదాలు చెప్పి రావు కాబట్టి యాక్సిడెంటల్ పాలసీలు తీసుకోవడం చాలా అవసరం. 

అయితే ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారు బీమా పాలసీకి ప్రీమియం చెల్లించలేక ఇబ్బంది పడవచ్చు. వారికి ఇన్యూరెన్స్ ద్వారా రక్షణ కల్పించడానికి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (PMSBY).

ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన పథకం కింద రూ. 2 లక్షల వరకు ప్రమాద బీమా లభిస్తుంది. దీనికి ప్రీమియం కూడా చాలా తక్కువ. అందరూ సులభంగా చెల్లించవచ్చు. ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి సంవత్సరానికి రూ. 20 మాత్రమే ప్రీమియంగా చెల్లిస్తే సరిపోతుంది.

భారతదేశంలోని అత్యధిక జనాభాకు భద్రతా బీమాను అందించడమే ఈ పథకం లక్ష్యం. గతంలో ఈ పథకం వార్షిక ప్రీమియం రూ. 12గా ఉండేది. ఇది జూన్ 1, 2022 నుండి రూ. 20కి పెంచారు. ధరలు, ఆదాయాలు పెరిగిన నేపథ్యంలో ఇది కూడా తక్కువ ప్రీమియం అనే చెప్పొచ్చు. కాబట్టి పేద ప్రజలు కూడా సులభంగా ఈ పాలసీ తీసుకోవచ్చు. 


ప్రమాదంలో బీమా చేసిన వ్యక్తి మరణిస్తే వారి నామినీకి బీమా నగదు మొత్తం అందుతుంది. 18 ఏళ్ల నుండి 70 ఏళ్ల వయసు ఉన్న వారు ఈ పథకానికి అర్హులు. లబ్ధిదారుని వయస్సు 70 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఈ పాలసీ లభించదు. ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీకి ముందు పాలసీ అమౌంట్ ఆటో డెబిట్ అవుతుంది. 

ఈ పథకం కింద బీమా చేసిన వ్యక్తి తీవ్రంగా గాయపడినా రూ.2 లక్షలు అందుతాయి. కళ్ళు, చేతులు, కాళ్ళు కోల్పోయినా రూ. 2 లక్షలు అందుతాయి. శాశ్వత పాక్షిక వైకల్యం కలిగితే రూ. 1 లక్ష వరకు లభిస్తుంది.

ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజనకు చెల్లించే వార్షిక ప్రీమియం రూ. 20 ఒక సంవత్సరానికి మాత్రమే చెల్లుతుంది. ఆ తర్వాత పథకాన్ని రిన్యూవల్ చేయించుకోవాలి. ప్రమాదం కారణంగా మరణం లేదా వైకల్యం కలిగితే నిబంధనల ప్రకారం బీమా మొత్తం అందిస్తారు. 

పాలసీదారుని వయస్సు 18 నుండి 70 ఏళ్ల మధ్య ఉండాలి. పాలసీదారుడు సేవింగ్స్ ఖాతాను ఎల్లప్పుడూ యాక్టివేషన్ లో ఉంచాలి. అకౌంట్ మూసివేస్తే పాలసీ కూడా రద్దు అవుతుంది. ప్రీమియంను సేవింగ్స్ ఖాతా నుండి ఆటో డెబిట్ చేయడానికి అనుమతి పత్రంపై సంతకం చేయాలి.

Latest Videos

click me!