
భారతదేశంలో మొబైల్ వినియోగదారుల సంఖ్య అధికంగా ఉంది. ఇప్పటికీ చాలామంది ఇప్పటికీ పాత ప్లాస్టిక్ సిమ్ కార్డులనే వినియోగిస్తున్నారు. కానీ భవిష్యత్తులో మాత్రం eSIM టెక్నాలజనీ అభివృద్ధి చెందుతుంది. ఎక్కువ స్మార్ట్‌ఫోన్‌లు, పరికరాలు eSIM టెక్నాలజీని సపోర్ట్ చేసే విధంగానే వస్తాయి. సాధారణ సిమ్ వాడుతున్నవారు భవిష్యత్తులో eSIM నెట్‌వర్క్‌లను మారిపోవచ్చు. కానీ ముందుగా అదేంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. eSIM అంటే ఏమిటి, ఇది సాధారణ సిమ్ కార్డ్ నుండి ఎలా భిన్నంగా ఉంటుంది? అనే సందేహాలకు ఇక్కడ సమాధానం ఇచ్చాము.
eSIM అంటే ఎంబెడెడ్ సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. ఇది స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌బిల్ట్ చేసిన డిజిటల్ సిమ్ కార్డ్. దీన్ని సాధారణ సిమ్ కార్డ్ లాగా ఫోన్లోకి ఇన్సర్ట్ చేయడం లేదా తీసివేయడం వంటివి చేయాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా, మీ మొబైల్ ఆపరేటర్ దీన్ని డిజిటల్‌గా యాక్టివేట్ చేస్తారు. మనదేశంలో జియో, ఎయిర్‌టెల్, వీ.. వంటి పెద్ద టెలికాం కంపెనీలు ఇప్పటికే కొన్ని రకాల ఫోన్లలో eSIM సేవలను అందించడం మొదలుపెట్టాయి. బీఎస్ఎన్ఎల్ కూడ త్వరలో ఈ సేవలు మొదలుపెట్టబోతోంది. కానీ ఎంతోమంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ఈ టెక్నాలజీ గురించి పెద్దగా తెలియదు.
SIM అంటే సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. ఇది ప్రస్తుతం మనమందరం వాడుతున్నాం. మొబైల్ ఫోన్‌లో ఇన్సర్ట్ చేసే చిన్న ప్లాస్టిక్ కార్డులాగా ఉంటుంది. ఇది మీ మొబైల్ నంబర్, నెట్‌వర్క్, కాంటాక్ట్‌ల వంటి సమాచారాన్ని నిల్వ చేస్తుంది. ప్రస్తుతం మన దేశంలో నానో-సిమ్‌లను ఉపయోగిస్తున్నాము. ఇవి సిమ్ కార్డుల కన్నా చిన్నగా ఉండే వెర్షన్.
• సాధారణ సిమ్ కార్డును మొబైల్ లో పెట్టి తిరిగి తీయవచ్చు. కానీ, eSIM ఇన్‌బిల్ట్ చేసి ఉంటుంది. దాన్ని తొలగించడం కుదరదు.
• eSIM వాడుతున్న వారు QR కోడ్‌ని స్కాన్ చేసి మొబైల్ ఆపరేటర్‌ని మార్చుకోవచ్చు. కానీ, సాధారణ సిమ్ కార్డుకి మాత్రం ఇలా మొబైల్ ఆపరేటర్ మార్చుకోవడానికి రెండు మూడు రోజుల సమయం పడుతుంది.
• eSIM టెక్నాలజీ ఎంతో ఆధునికమైనది. దీన్ని ఒకేసారి ఫిజికల్ సిమ్, డిజిటల్ సిమ్ రెండింటినీ ఉపయోగించడానికి సహాయపడుతుంది. మీరు ఒకే ఫోన్‌లో రెండు నంబర్లను ఉపయోగించవచ్చు.
• eSIMను దొంగిలిచండం వంటివి జరగవు. ఇది చాలా సురక్షితమైనది.
• eSIM ఫోన్ లోపల స్థలాన్ని ఆక్రమించదు. ఆదా చేస్తుంది. దీని వల్ల, ఫోన్ మరింత సన్నగా భవిష్యత్తులో తయారయ్యే అవకాశం ఉంది. పెద్ద బ్యాటరీలను ఫోన్లో పెట్టే అవకాశం ఉంది. కాబట్టి సాధారణ సిమ్ తో పోలిస్తే eSIM చాలా బావుంటుందనే చెప్పాలి.
eSIM వాడడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
• దీనితో సులువుగా నెట్‌వర్క్ మార్పిడి చేసుకోవచ్చు. జియో, ఎయిర్‌టెల్, వీ వంటి ఆపరేటర్ల మధ్య మీరు బయటికి వెళ్లకుండానే నెట్ వర్క్ మారిపోవచ్చు.
• సిమ్ కార్డ్ దెబ్బతింటుందనే భయం లేదు. ఎందుకంటే ఇది వస్తువు రూపంలో ఉండదు.
• ప్రయాణాలు చేసేవారికి ఇది చాలా ఉపయోగకరమైనది. వేరే రాష్ట్రాలకు లేదా దేశాలకు వెళ్లినప్పుడు కొత్త సిమ్ కార్డ్ కొనకుండానే, అంతర్జాతీయ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.
• డ్యూయల్ సిమ్ ఫంక్షనాలిటీ కూడా దీనితో చాలా సులభం. పని, వ్యక్తిగత నంబర్‌ల కోసం డ్యూయల్ సిమ్ ఫంక్షనాలిటీని సపోర్ట్ చేస్తుంది.
• తక్కువ పరికర మద్దతు: మనదేశంలని అన్ని స్మార్ట్‌ఫోన్‌లు eSIMని సపోర్ట్ చేయలేవు. ఐఫోన్‌లు, గూగుల్ పిక్సెల్, కొన్ని శామ్‌సంగ్ గెలాక్సీ మోడల్స్ మాత్రమే eSIM పనిచేస్తుంది.
• క్లిష్టమైన యాక్టివేషన్: ఫిజికల్ సిమ్‌ని ఇన్సర్ట్ చేసి వాడటం ప్రారంభించినట్లు కాకుండా, eSIM యాక్టివేషన్‌కు QR కోడ్‌ని స్కాన్ చేయడం, చాలా దశలను పాటించాల్సి ఉంటుంది. ఏదైనా తప్పు జరిగితే వెంటనే యాక్టివేట్ అవ్వదు.
• ఫోన్‌ల మధ్య మార్చడం కష్టం: ఫిజికల్ సిమ్‌ని ఫోన్ నుండి తీసివేసి, మరొక ఫోన్‌లో సులువుగా చేసుకోవచ్చు. eSIMని మాత్రం పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్లో సెటప్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది.
• ఫోన్ పాడైతే : మీ ఫోన్ పాడైతే ఫిజికల్ సిమ్ లాగా eSIMని బయటికి తీయలేరు. మీ ఆపరేటర్ నుండి కొత్త యాక్టివేషన్ కోరాల్సి ఉంటుంది. ఇది అదనపు సమయం తీసుకుంటుంది.