CJ Roy : రివాల్వర్‌తో కాల్చుకుని బిగ్ బాస్ స్పాన్సర్, బిలియనీర్ సిజే రాయ్ ఆత్మహత్య

Published : Jan 30, 2026, 06:13 PM ISTUpdated : Jan 30, 2026, 08:15 PM IST

CJ Roy : బెంగళూరులో ఐటీ సోదాల వేళ కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ సిజే రాయ్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన పారిశ్రామిక రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 

PREV
15
ఐటీ దాడుల భయం : సిజే రాయ్ ఆత్మహత్య

బెంగళూరు నగరంలో పెను సంచలనం చోటుచేసుకుంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ 'కాన్ఫిడెంట్ గ్రూప్' వ్యవస్థాపకుడు, చైర్మన్ సిజే రాయ్ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు తన కార్యాలయంపై సోదాలు నిర్వహిస్తున్న సమయంలోనే ఆయన ఈ దారుణానికి ఒడిగట్టారు. తన వద్ద ఉన్న రివాల్వర్‌తో తలపై కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషాద ఘటన పారిశ్రామిక వర్గాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.

25
అధికారుల ముందే కాల్చుకున్న సిజే రాయ్

శుక్రవారం మధ్యాహ్నం సమయంలో బెంగళూరులోని రిచ్‌మండ్ సర్కిల్ సమీపంలో ఉన్న ల్యాండ్‌ఫర్డ్ రోడ్డులోని కాన్ఫిడెంట్ గ్రూప్ కార్యాలయానికి ఐటీ అధికారులు చేరుకున్నారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో అధికారులు సోదాలు ప్రారంభించారు. సుమారు గంటసేపు సిజే రాయ్‌ను అధికారులు విచారించినట్లు సమాచారం. అయితే, విచారణ జరుగుతున్న సమయంలోనే రాయ్ అకస్మాత్తుగా తన రివాల్వర్ తీసి తలకు గురిపెట్టుకుని కాల్పులు జరుపుకున్నారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అధికారుల కళ్లముందే ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది.

35
బిలియనీర్ ప్రస్థానం.. రాయ్ ఆస్తులు

కేరళకు చెందిన సిజే రాయ్ బెంగళూరులో తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌లో ఉన్నత విద్యను పూర్తి చేసిన ఆయన, బెంగళూరులోని సర్జాపుర రోడ్డులో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించి అనతి కాలంలోనే అగ్రస్థాయికి ఎదిగారు. 2025 ఫోర్బ్స్ ప్రకటించిన 100 మంది అత్యంత ధనవంతుల జాబితాలో కూడా ఆయన చోటు దక్కించుకున్నారు. ఆయన మొత్తం ఆస్తి విలువ సుమారు 1 బిలియన్ అమెరికన్ డాలర్లు అని అంచనా. దక్షిణ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన రియల్ ఎస్టేట్ టైకూన్‌గా ఆయనకు గుర్తింపు ఉంది.

45
విలాసవంతమైన జీవితం.. గతంలోనూ దాడులు

సిజే రాయ్ కి విలాసవంతమైన కార్లంటే అత్యంత మక్కువ. ఆయన గ్యారేజీలో 50కి పైగా ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. కేవలం భారతదేశంలోనే కాకుండా దుబాయ్ వంటి విదేశాల్లో కూడా ఆయనకు భారీగా ఆస్తులు ఉన్నాయి. గతంలో కూడా కాన్ఫిడెంట్ గ్రూప్ సంస్థలపై ఐటీ అధికారులు పలుమార్లు దాడులు నిర్వహించారు. అయితే ఈసారి దాడులు జరుగుతున్న క్రమంలోనే ఆయన ప్రాణాలు తీసుకోవడం వెనుక ఉన్న అసలు కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

55
బిగ్ బాస్ లోనూ తన ముద్రవేసిన సిజే రాయ్

సిజే రాయ్ కేవలం వ్యాపారవేత్తగానే కాకుండా, పాపులర్ రియాలిటీ షో 'బిగ్ బాస్' సహా పలు టీవీ కార్యక్రమాలకు భారీగా నగదు బహుమతులు అందజేసే స్పాన్సర్ గా ప్రజలకు సుపరిచితులు. సమాజంలో మంచి పేరున్న వ్యక్తి ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐటీ అధికారులు సోదాలు చేస్తున్న సమయంలో అసలేం జరిగింది అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ముఖ్య గమనిక: ఆత్మహత్య పరిష్కారం కాదు

జీవితంలో ఎదురయ్యే ఆర్థిక పరమైన ఇబ్బందులు లేదా మానసిక ఒత్తిళ్లకు ఆత్మహత్య ఏమాత్రం పరిష్కారం కాదు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబానికి తీరని శోకాన్ని మిగిలిస్తాయి. మీకు ఎలాంటి మానసిక ఆందోళనలు ఉన్నా, ఒంటరితనంగా అనిపించినా మనోధైర్యాన్ని కోల్పోకండి. సహాయం కోసం ఈ క్రింది హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించండి..

• రోష్ని - హైదరాబాద్: 040-66202000 / 040-66202001

• ప్రభుత్వ హెల్ప్ లైన్: 104

Read more Photos on
click me!

Recommended Stories