మీ వెహికల్ యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇలా చేయండి

First Published | Nov 12, 2024, 4:18 PM IST

అనుకోకుండా జరిగేవే ప్రమాదాలు. ప్రయాణ సమయంలో ప్రమాదాల వల్ల మనుషులకు ఏమీ కాకపోయినా వెహికల్స్ తీవ్రంగా దెబ్బతింటాయి. ప్రమాదం జరిగిన తర్వాత మీ వాహనానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలా చేయాలో మీకు తెలుసా? ఇక్కడ వివరంగా తెలుసుకుందాం రండి. 

మన దేశంలో కార్, బైక్ నడపడానికి లైసెన్స్ ఎంత ముఖమో.. ఇన్స్యూరెన్స్ తీసుకోవడం కూడా తప్పనిసరి. ఇది ప్రమాదం జరిగినప్పుడు మీకు అనేక రకాలుగా భద్రత కల్పిస్తుంది. గాయాలైతే హాస్పిటల్ ఖర్చులకు ఉపయోగపడుతుంది. మరణం చెందితే మీ కుటుంబం ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడకుండా బీమా డబ్బు ఆదుకుంటుంది. ప్రమాదాలు జరిగిన తర్వాత వెహికల్ బీమా క్లెయిమ్‌లను అప్లై చేయడానికి మీరు ఏమి చేయాలి? ఇక్కడ తెలుసుకోండి. 

కార్, బైక్ ఏ వాహనం ఉన్నా వాటికి బీమా ఎంత ముఖ్యమో తెలుసుకోవాల్సిన బాధ్యత యజమానిపై ఉంటుంది. దానికి సంబంధించిన ప్రాసెస్ అర్థం చేసుకోవడం ఫస్ట్ చాలా ముఖ్యం.

మీరు ఎప్పుడు జర్నీ చేసినా ముందుగా మీ వాహనానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇన్సూరెన్స్ పేపర్స్ దగ్గర ఉంచుకోవాలి. అవి సక్రమంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు బీమా రీన్యూవల్ చేయించుకుంటూ ఉండాలి. ప్రమాదం జరిగితే ముందుగా బీమా తీసుకున్న సంస్థను సంప్రదించి ప్రమాదం గురించి పూర్తి వివరాలను తెలియజేయాలి. ఏ సమాచారాన్నీ దాచకూడదు.

Latest Videos


సమీప పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేయించాలి. వెహికల్ దొంగిలించడం లేదా గుర్తు తెలియని వ్యక్తుల వల్ల వాహనం దెబ్బతినడం వల్ల జరిగే నష్టాలకు FIR లేదా మొదటి సమాచార నివేదిక చట్టపరమైన రక్షణను అందిస్తుంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి FIR నమోదు చేయించండి. అలాగే ఆ FIR కాపీని తప్పకుండా తీసుకోండి. FIR నమోదు చేయడం వల్ల మీకు జరిగిన ప్రమాదంలో ఎలాంటి చట్టపరమైన సమస్యలు మీరు రాకుండా ఉంటాయి.

సాక్ష్యం కోసం ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఫోటోలు, వీడియోలు తీయండి. ఫోటోలు, వీడియోలు మీకు జరిగిన ప్రమాదానికి సాక్ష్యంగా ఉంటాయి. బీమా కవరేజీని పొందేటప్పుడు మీ బీమా ప్రొవైడర్‌కు పరిస్థితిని వివరించడంలో ఇవి సహాయపడతాయి. మీ వాహనం, ప్రమాదం జరిగిన ప్రదేశంలోని అన్ని నష్టాలను ఫోటో తీయాలి. నష్టం స్థాయిని అంచనా వేయడానికి ఫోటోలు స్పష్టంగా ఉండేలా చూసుకోవాలి.

ఇప్పుడు వాహన బీమా తీసుకున్న సంస్థ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి క్లెయిమ్ అప్లై చేయండి. లాగిన్ అయిన తర్వాత బీమా క్లెయిమ్ పేజీలో అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి. పాలసీ వివరాలు, డ్రైవింగ్ లైసెన్స్, FIR కాపీ, మీ వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వంటివి అప్‌లోడ్ చేయాలి. చివరగా క్లెయిమ్ ఫారమ్‌ను పూర్తి చేసి సబ్మిట్ చేయండి.

ప్రమాద నష్టాన్ని అంచనా వేయడానికి ఆఫీసర్ ను పంపాలని రిక్వెస్ట్ పెట్టండి. ఆయన వచ్చి ప్రమాద ఆధారాలు అన్నింటినీ చెక్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీకి కన్ఫర్‌మేషన్ ఇస్తారు. బీమా సంస్థ పాలసీలను బట్టి ఈ చెకింగ్ జరగడానికి కొంత సమయం పట్టవచ్చు.

బీమా సంస్థ నుండి బీమా క్లెయిమ్ అనుమతి పొందిన తర్వాత మాత్రమే వాహనాన్ని రిపేర్ చేయించాలి. మీ బీమా సంస్థ గ్యారేజీలలో ఒకదానిలో వాహనాన్ని ఉచితంగా రిపేర్ చేసుకోవచ్చు. లేదా వేరే ఏదైనా గ్యారేజీ నుండి మీ వాహనాన్ని రిపేర్ చేసుకుని దానికి అయ్యే ఖర్చులను బీమా సంస్థ నుండి తిరిగి పొందవచ్చు. దీనికి అన్ని ఖర్చుల బిల్లులను కచ్చితంగా అందించాలి.

click me!