400 ఏళ్లుగా వర్షం కురవని ప్లేస్ ఎక్కడుందో మీకు తెలుసా?

First Published | Nov 16, 2024, 9:44 AM IST

మీకు తెలుసా? ప్రపంచంలో ఓ ప్రాంతంలో 400 సంవత్సరాలుగా వర్షం కురవలేదు. దీంతో ఇప్పుడు ఆ ప్లేస్ ఎలా మారిపోయిందంటే.. మీరు కాని అక్కడికి వెళితే సైన్స్ ఫిక్షన్ సినిమాలోని సీన్లు చూసినట్లు ఉంటుంది. వందల ఏళ్లుగా చుక్కనీరు లేకపోవడంతో ఆ ప్రాంతం అంగారక గ్రహంలా కనిపిస్తుంది. ఇంత విచిత్రమైన ప్లేస్ ఎక్కడుందో తెలుసుకుందాం రండి. 

నాలుగు వందల సంవత్సరాలుగా వర్షం కురవకపోవడంతో ఇక్కడ ప్రకృతి దృశ్యాలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇక్కడ ఉప్పు పొరలుగా ఏర్పడిపోయింది. గొప్ప ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇక్కడ గాలి వల్ల చెక్కినట్టుగా రాతి నిర్మాణాలు తయారయ్యాయి. వీటిని చూస్తే ఎవరో చెక్కి ఇక్కడ పెట్టారా అన్నట్టు ఉంటుంది. విశాలమైన ఇసుక దిబ్బలు సైన్స్ ఫిక్షన్ సినిమాలోని దృశ్యాలను గుర్తుకు తెస్తాయి. అంతేకాకుండా ఎడారిలోని కొన్ని ప్రాంతాలు అంగారక గ్రహంలా కనిపిస్తాయి.

ఇంత చిత్రమైన ప్రాంతం ఉత్తర చిలీలో ఉంది. అదే అటకామా ఎడారి. ఇది 1000 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది. భూమిపై అత్యంత అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు కనిపించే ప్రాంతాల్లో ఇదొక్కటి. ఈ అటకామా ఎడారిలో వందల సంవత్సరాలుగా వర్షం పడలేదు. కొన్ని ప్రాంతాల్లో ఒక్క చుక్క నీరు కూడా లేకుండా శతాబ్దాలు గడిచిపోయాయి.

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా దాని అంగారక రోవర్‌ల కోసం పరీక్షా కేంద్రంగా ఈ ఎడారిని ఉపయోగిస్తుంది. చంద్రుని లోయ వంటి ప్రదేశాలు, గాలి వల్ల చెక్కినట్టుగా ఉండే శిఖరాలు కూడా ఈ ఎడారి ప్రాంతంలో ఉన్నాయి.


1570 నుండి 1971 వరకు అటకామా ఎడారిలో వర్షం పడలేదు. 1971లో అటకామా ఎడారిలో వర్షం పడింది. ఆ తర్వాత జరిగిన అటకామా ఎడారి పుష్పించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. వర్షం కారణంగా ఎడారి అంతటా రంగురంగుల పువ్వులు వికసించాయి. ఎల్ నినో సంఘటన కారణంగా ఇలాంటి వర్షం పడ్డప్పుడల్లా ఎడారి పుష్పాలతో నిండిపోతుంది. ఇటీవల అంటే 2024 జూలై నెలలో అటకామా ఎడారి పుష్పాలతో కళకళలాడింది. ఈ అద్భుత దృశ్యాన్ని చూడటానికి వేలాదిగా పర్యాటకులు అటకామాకు వెళ్లారు.

అటకామా ఎడారి ప్రపంచంలోనే అతిపెద్ద పొగమంచు ఎడారి. భూమిపై వర్షపాతం దాదాపుగా లేని ప్రాంతం అయినప్పటికీ కొన్ని జీవులు ఈ ఎడారిలో నివసిస్తాయి. 'కమాన్చకా' అనే తీరప్రాంత పొగమంచు వాటి మనుగడకు సహాయపడుతుంది. కమాన్చకా అనే దట్టమైన తీరప్రాంత పొగమంచు ఈ ఎడారిలోని అరుదైన జీవులను కాపాడుతుంది. పసిఫిక్ మహాసముద్రం నుండి వీచే ఈ పొగమంచు, ఎడారికి కొంత తేమను అందిస్తుంది. దీని వల్ల కొన్ని రకాల మొక్కలు, అరుదైన నాచు, కొన్ని జంతువులకు తగినంత నీరు లభిస్తుంది.

అటకామా ఎడారిలోని కొన్ని ప్రాంతాల్లో సంవత్సరానికి ఒక మిల్లీమీటరు కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. కానీ ఈ ఎడారి భూమి కింద "అటకామా జలాశయం" అనే విస్తారమైన భూగర్భ జల నిల్వ ఉంది. ఇది పురాతన నీటి నిక్షేపాలు, ఆండీస్ పర్వతాల నుండి వచ్చే నీరని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

అటకామాలో ఎల్ టాటియో గీజర్స్ అనే ప్రకృతి అద్భుతాన్ని కూడా చూడవచ్చు. ఇది అటకామాలో ఎత్తుగా ఉండే వేడి నీటి ప్రాంతం. సూర్యుడు ఉదయించే సమయంలో భూమిపై వేడి నీటి బుగ్గల నుండి ఆవిరి స్తంభాల రూపంలో బయటకు వెళ్లడం మీరు చూడవచ్చు.

అటకామాలో మరో అద్భుతమైన ప్రదేశం చిలీలోని అతిపెద్ద ఉప్పు మైదానం. దీన్ని సాలార్ డి అటకామా అంటారు. ఇక్కడ భారీగా ఉప్పు నిక్షేపాలు ఉన్నాయి. అంతేకాకుండా ఫ్లెమింగో పక్షులు ప్రత్యేక ఆకర్షణ. సాన్ పెడ్రో డి అటకామా అనే ప్రాంతం అటకామా ఎడారి మధ్యలో ఉంది. ఇది అటకామెనో గిరిజన సంస్కృతికి నిలయమైన అందమైన నగరం. పురాతన శిలాశాసనాలు, పాత కోట శిథిలాలను ఇక్కడ చూడవచ్చు.

Latest Videos

click me!