నమ్మకమైన సంస్థ నుంచి లోన్ తీసుకోండి
బంగారం లోన్ తీసుకునే ముందు బ్యాంక్ లేదా RBI ఆమోదించిన NBFC నుంచే లోన్ తీసుకుంటున్నారా లేదా అని నిర్ధారించుకోండి. స్థానిక జువెలర్స్ లేదా అనుమానాస్పద కంపెనీల నుంచి లోన్ తీసుకోవడం ప్రమాదకరం.
వడ్డీ రేట్లను పోల్చి చూడండి
ప్రతి కంపెనీ లేదా బ్యాంక్ బంగారం లోన్‌పై వేర్వేరు వడ్డీ రేట్లు వసూలు చేస్తాయి. కొన్ని 7% నుంచి ప్రారంభిస్తే.. మరికొన్ని 15% వసూలు చేస్తాయి. పోల్చి చూడకుండా లోన్ తీసుకోవడం అంటే అదనపు భారం మోయడమే. కాబట్టి అనేక చోట్ల పోల్చి చూసిన తర్వాతే లోన్ తీసుకోండి.
ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలు
తక్కువ వడ్డీ చూపించి ప్రాసెసింగ్ ఫీజు, సర్వీస్ ఛార్జ్, డోర్‌స్టెప్ ఫీజు వంటివి వసూలు చేసే కంపెనీలు కూడా ఉంటాయి. కాబట్టి వాటి వివరాలు ముందే తెలుసుకోండి. దానివల్ల తర్వాత ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అప్పు భారం పెరగదు.
లోన్ టు వాల్యూ (LTV)
మీ బంగారం విలువలో ఎంత శాతం లోన్ పొందుతారో తెలుసుకోండి. RBI నిబంధనల ప్రకారం, గరిష్టంగా 75% వరకు లోన్ పొందవచ్చు. ఉదాహరణకు మీ నగల విలువ లక్ష రూపాయలైతే 75,000 రూపాయల వరకు మాత్రమే లోన్ పొందవచ్చు.
లోన్ తిరిగి చెల్లించే గడువు
బంగారం లోన్ గడువు సాధారణంగా 6 నుంచి 24 నెలల వరకు ఉంటుంది. సకాలంలో తిరిగి చెల్లించకపోతే మీ బంగారం వేలానికి వెళ్లవచ్చు. కాబట్టి గడువు, EMI ఎంపికలను అర్థం చేసుకుని లోన్ తీసుకోండి.
బంగారం భద్రత
గోల్డ్ లోన్ తీసుకునే ముందు బంగారం భద్రతా విషయాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. భద్రతా పరంగా నమ్మకం అనిపిస్తేనే లోన్ తీసుకోవడం మంచిది.
డాక్యుమెంట్లు, ఒప్పందం
చాలా మంది చదవకుండానే డాక్యుమెంట్లపై సంతకం చేస్తారు. లోన్ ఒప్పందాన్ని జాగ్రత్తగా చదవండి. లోన్ మొత్తం, వడ్డీ రేటు, చెల్లింపు నిబంధనలు, చెల్లించని పక్షంలో ఏం జరుగుతుందో స్పష్టంగా తెలుసుకోండి. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉంటాయి.