రైతుల కోసం రూ.14 వేల కోట్లు: ఈ అర్హతలుంటే మీరూ రూ.లక్షలు పొందవచ్చు

First Published | Sep 5, 2024, 12:26 PM IST

రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం  చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 7 ప్రత్యేక పథకాలను ప్రకటించింది. వ్యవసాయాభివృద్ధికి, రైతుల చేయూతకు ఏకంగా రూ.14000 కోట్లు కేటాయించింది. అవి పొందడానికి మీకు అర్హత ఉందో లేదో తెలుసుకోవాలంటే వాటి గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. 
 

రైతుల ఆదాయాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యంగా వ్యవసాయం, సంబంధిత రంగాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏడు పథకాలు తీసుకొచ్చింది. అవి క్రాప్ సైన్స్ స్కీమ్, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్, మేనేజ్‌మెంట్ అండ్ సోషల్ సైన్స్ ప్రోగ్రామ్, సస్టైనబుల్ లైవ్‌స్టాక్ హెల్త్ అండ్ ప్రొడక్షన్ స్కీమ్, హార్టికల్చర్ సస్టెయినబుల్ అభివృద్ధి, వ్యవసాయ విజ్ఞాన కేంద్రాల బలోపేతం, సహజ వనరుల నిర్వహణ ప్రాజెక్టులు. వీటి కోసం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం నిధుల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ.13966 కోట్లు ఉంది.
 

క్రాప్ సైన్స్ స్కీమ్ (రూ. 3979 కోట్లు)..
కేంద్ర ప్రభుత్వం క్రాప్ సైన్స్ స్కీం(Crop Science Scheme) వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనను ప్రోత్సహించేందుకు, రైతులకు అధునాతన పద్ధతులను అందించేందుకు రూపొందించిన పథకం. క్రాప్ సైన్స్ స్కీమ్ కోసం రూ. 3979 కోట్లను ప్రభుత్వం ప్రకటించింది. 

నూతన సాంకేతికతను ఉపయోగించి విత్తనాలు, పంటల దిగుబడిని పెంచడం, నష్టాలను తగ్గించడం, ఎరువులు, నీటిని సమర్థవంతంగా వినియోగించటం ఈ స్కీమ్‌ లక్ష్యాలు. అంతేకాకుండా కొత్త రకాల పంటలను సృష్టించడం, వాటి పై పరిశోధనలు చేయడం కూడా ఈ పథకం ద్వారా రైతులు చేయవచ్చు. 

ఇందు కోసం కేంద్ర ప్రభుత్వమే పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసి శాస్త్రవేత్తల ద్వారా పంటల్లో కొత్త రకాల పద్ధతులను అభివృద్ధి చేయడానికి ప్రోత్సహిస్తుంది. ఇందులో రైతులకు శిక్షణ ఇవ్వడం ద్వారా కొత్త సాంకేతికతలను నేర్పిస్తారు. మీకు ఆసక్తి ఉంటే ఈ పథకం ద్వారా లబ్ధి పొంది వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు.
 


డిజిటల్ అగ్రికల్చర్ మిషన్.. 
డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ (Digital Agriculture Mission) కేంద్ర ప్రభుత్వం 2021-2025 కాలంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించేందుకు రూపొందించిన పథకం. వ్యవసాయంలో డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం, డేటా ఆధారిత నిర్ణయాలు, సుస్థిరతను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యాలు. ఈ పథకం కోసం కేంద్రం రూ. 2817 కోట్లు ప్రకటించింది. 

ఈ పథకం ద్వారా వ్యవసాయంలో డిజిటల్ టూల్స్ (IoT, AI, డ్రోన్స్, GIS) డేటా ఆధారిత వ్యవస్థలను కేంద్రం ప్రవేశపెడుతుంది. రైతులు డిజిటల్ పద్ధతులను వాడటం ద్వారా వారి పని పద్ధతులను మెరుగుపరచుకోవచ్చు. వ్యవసాయ నిధులు, సబ్సిడీలు ఉపయోగించుకొని రైతులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవచ్చు. 


వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాయంతో పంటల విస్తరణ, సస్యరక్షణ, నీటి వినియోగం, ఎరువుల వినియోగాన్ని పెంచేలా ఈ పథకం రూపొందించారు. ఈ పథకం ద్వారా ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థలు కలిసి డిజిటల్ టెక్నాలజీని ప్రవేశపెట్టి, రైతులకు సేవలు అందిస్తాయి. 

* వ్యవసాయ విజ్ఞాన కేంద్రాల బలోపేతం ప్రాజెక్టు(Strengthening of Krishi Vigyan Kendras) 
కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యవసాయ విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ అందించేందుకు రూపొందించిన ఒక ముఖ్యమైన పథకం. ఈ ప్రాజెక్ట్ కింద కృషి విజ్ఞాన కేంద్రాలు(KVKs) గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి సంబంధించిన అన్ని అంశాలపై రైతులకు నైపుణ్యాలు, పరిజ్ఞానం, సాంకేతికతను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పథకం కోసం కేంద్రం రూ.1202 కోట్లు కేటాయించింది.  రైతులకు వారి స్థానిక భాషల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీని ద్వారా వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని సులభంగా అర్థం చేసుకొని, తమ వ్యవసాయంలో అమలు చేయగలగడం సాధ్యమవుతుంది. వ్యవసాయ సాంకేతికతలను ప్రత్యక్షంగా రైతుల పంట పొలాల్లో పరీక్షించి, వారి స్థితిగతులకనుగుణంగా సూచనలు చేస్తారు. 

అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్, మేనేజ్‌మెంట్ అండ్ సోషల్ సైన్స్ ప్రోగ్రామ్ (రూ. 2291 కోట్లు)
ఈ పథకం ద్వారా ప్రభుత్వం రైతులకు నూతన సాంకేతికపై ప్రత్యేక అవగాహన కల్పిస్తుంది. ప్రత్యేక శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తుంది. ఆసక్తి ఉన్న రైతులు ఈ పథకంలో చేరి ప్రభుత్వం ఇచ్చే ట్రైనింగ్ తీసుకొని వ్యవసాయాన్ని మెరుగుపరచుకోవచ్చు. 

ఇదే విధంగా సస్టైనబుల్ లైవ్‌స్టాక్ హెల్త్ అండ్ ప్రొడక్షన్ స్కీమ్ కింద రూ. 1702 కోట్లు, హార్టికల్చర్ సస్టెయినబుల్ అభివృద్ధికి రూ. 860 కోట్లు, సహజ వనరుల నిర్వహణ రూ. 1115 కోట్లు ప్రకటించింది. ఇవి త్వరలో కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల అవనున్నాయి. రైతులు ఈ పథకాల గురించి స్థానిక వ్యవసాయ కేంద్రాల్లో పూర్తి వివరాలు తెలుసుకొని ఉపయోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. 

Latest Videos

click me!