పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో చాలామంది CNG కార్ల వైపు చూస్తున్నారు. ఇప్పుడు మార్కెట్లోకి ఇథనాల్‌తో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్లు కూడా వచ్చేశాయి. మరి ఈ రెండింటిలో ఏది బెటరో చూద్దాం.
ముడి చమురు దిగుమతిని, వినియోగదారుల ఆర్థిక భారాన్ని తగ్గించడానికి భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ అంటే ఫ్లెక్స్ ఫ్యూయల్‌ను దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టడంతో భారతదేశ ఇథనాల్ రవాణా ప్రణాళిక కొత్త దశకు చేరుకుంది. ఢిల్లీలో E85 ఇంధనం ధర లీటరుకు రూ.82.12గా నిర్ణయించారు. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సాధారణ E20 పెట్రోల్ కంటే దాదాపు రూ.20 తక్కువ.
మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ కావడంతో చాలా కంపెనీలు ప్లెక్స్ ఫ్యూయల్ కార్ల తయారీపై దృష్టి పెట్టాయి. ఇప్పటికే మారుతి సుజుకి దేశంలోనే తొలి మాస్-మార్కెట్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు 'వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్-ఫ్యూయల్'ను పరిచయం చేసింది. ఈ క్రమంలో ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు కొనడం మంచిదేనా? CNG కంటే ఇందులో మైలేజ్ ఎక్కువ వస్తుందా? అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి.
24
సిఎన్జి vs ప్లెక్ప్ ఫ్యూయల్.. మైలేజ్ విషయంలో ఏది బెస్ట్?
గత కొన్నేళ్లుగా భారత మార్కెట్లో CNG కార్లకు మంచి ఆదరణ ఉంది. పెట్రోల్, డీజిల్ కంటే CNG ధర గణనీయంగా తక్కువగా ఉండటంతో, కిలోమీటరుకు అయ్యే ప్రయాణ ఖర్చు చాలా తక్కువ. చాలా CNG కార్లు ఒక కిలోకు 25 నుంచి 35 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తాయి. అందుకే రోజూ ఆఫీసుకు వెళ్లేవారు, ట్యాక్సీ డ్రైవర్లు, తరచుగా లాంగ్ డ్రైవ్‌లు చేసేవారు CNG కార్లనే మొదటి ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు.
మరోవైపు ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు సాధారణ పెట్రోల్‌తో పాటు, E85 లేదా E100 వంటి అధిక శాతం ఇథనాల్ కలిపిన ఇంధనంతో కూడా నడుస్తాయి. ఇథనాల్ ధర పెట్రోల్ కంటే తక్కువే అయినా దాని 'ఎనర్జీ డెన్సిటీ' (శక్తి సాంద్రత) తక్కువ. అంటే CNG లేదా సాధారణ పెట్రోల్ కారు ప్రయాణించే దూరానికి, ఫ్లెక్స్-ఫ్యూయల్ కారుకు కొంచెం ఎక్కువ ఇంధనం అవసరం. దీనివల్ల మైలేజ్ కాస్త తక్కువగా వచ్చే అవకాశం ఉంది.
34
సిఎన్జి vs ప్లెక్ప్ ఫ్యూయల్.. ధర పరంగా ఏది బెస్ట్?
కార్ల ధరలను పరిశీలిస్తే ప్రస్తుతం CNG కార్లు మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉన్నాయి, అనేక మోడల్స్ కూడా ఉన్నాయి. అయితే సాధారణ పెట్రోల్ మోడల్ కంటే CNG మోడల్ ధర సుమారు రూ.80,000 నుంచి రూ.1 లక్ష వరకు ఎక్కువగా ఉంటుంది.
మరోవైపు ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీ భారతదేశంలో ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ రకం కార్ల ఆప్షన్స్ తక్కువగా ఉన్నాయి. ఇటీవల ప్రదర్శించిన మారుతి వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు అంచనా ఎక్స్-షోరూమ్ ధర రూ.7.24 లక్షలు అని చెబుతున్నారు. ఇది సాధారణ పెట్రోల్ మోడల్ కంటే సుమారు రూ.85,000 నుంచి రూ.86,000 వరకు ఎక్కువ.
మొత్తంగా సిఎన్జి vs ప్లెక్ప్ ఫ్యూయల్ లో ఏది బెస్ట్?
ప్రయాణ ఖర్చు, మైలేజ్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో CNG కార్లే ఎక్కువ లాభదాయకంగా కనిపిస్తున్నాయి. కానీ ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీలో అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే… ఇది దేశీయంగా తయారయ్యే ఇథనాల్ వాడకాన్ని పెంచి, దేశ ఆర్థిక వ్యవస్థకు సహాయపడుతుంది.
మీ ప్రాంతంలో CNG బంక్ నెట్‌వర్క్ బాగుండి, మీ వార్షిక ప్రయాణం (కిమీ) ఎక్కువగా ఉంటే, మీరు నిస్సందేహంగా CNG కారును ఎంచుకోవచ్చు. కానీ భవిష్యత్తులో దేశవ్యాప్తంగా E85 ఇంధనం లభ్యత పెరిగి, ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్ల ధరలు కూడా తగ్గితే, ఈ టెక్నాలజీ CNGకి గట్టి పోటీదారుగా మారడంలో ఎలాంటి సందేహం లేదు.