ఈ ప్రకృతి ఎన్నో రంగులతో నిండి ఉంటుంది. అందుకే మన చుట్టూ ఎన్నో రంగులు ఉంటాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతులు, మతాలలో ప్రతి రంగుకు వేర్వేరు అర్థాలు ఉన్నాయి. హిందూ మతంలో నలుపుకు ఉన్న ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బ్లాక్ కలర్ చాలా మంది ఇష్టముంటుంది. అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా బ్లాక్ కలర్ బట్టలు, వాచ్ , బూట్లు మొదలైనవి ఎన్నో కొంటుంటారు. కానీ హిందూ మతంలో నలుపు రంగును పవిత్రంగా పరిగణించరు. మీకు తెలుసా? హిందూ మతంలో.. పెళ్లి అయిన తర్వాత ఒక సంవత్సరం పాటు నలుపు రంగు వాడకాన్ని నిషేధించారు. బ్లాక్ కలర్ బట్టలు, వాచ్ లను పెట్టుకోవడం వల్ల చెడు శకునాలు వస్తాయని నమ్ముతారు.
జ్యోతిష్యం ప్రకారం.. నలుపు రంగు శనితో ముడిపడి ఉంటుంది. మనలో చాలా మంది నల్ల చారలతో ఉన్న గడియారాలు ధరించడం చూసి ఉంటారు. జాతకంలో శని మంచి స్థానంలో ఉంటే.. కొన్నిసార్లు జ్యోతిష్యులు నలుపు రంగు ధరించమని సలహానిస్తారు. అలాగే జాతకంలో శనిదేవుడు మంచి స్థానంలో ఉంటే.. ఆ వ్యక్తికి గౌరవం, డబ్బు, కీర్తి లభిస్తుంది. అందుకే నల్ల పట్టీతో గడియారం ధరించడం చెడు శకునంగా పరిగణించబడదు.
నలుపు రంగు, హిందూ సంస్కృతి
దీపావళి, సంక్రాంతి, దసరా, రక్షా బంధన్ వంటి పండుగలకు ప్రకాశవంతమైన రంగు బట్టలనే వేసుకుంటుంటారు. కానీ ఎట్టి పరిస్థితిలో బ్లాక్ కలర్ బట్టలను మాత్రం వేసుకోరు. అలాగే దేవాలయాలకు లేదా ఏదైనా పెద్ద వేడుకలకు వెళ్లేటప్పుడు కూడా బ్లాక్ కలర్ బట్టలను వేసుకోరు. బ్లాక్ కలర్ సాధారణంగా దుఃఖంతో ముడిపడి ఉంటుందని చాలా మంది నమ్ముతారు. అందుకే శుభకార్యాలకు నలుపు రంగు బట్టలను వేసుకోరు.
హిందూ మతంలో.. నలుపు రంగు మరణం, చీకటికి ప్రతీకగా భావిస్తారు. అయితే చెడు కంటి చూపు పడకుండా ఉండేందుకు కూడా దీనిని ఉపయోగిస్తారు. అందుకే చిన్న పిల్లలకు కాటుకతో బొట్టు పెడతారు. అయితే సోమ, మంగళవారాల్లో నలుపు రంగు బట్టలను చాలా మంది వేసుకోరు.
సోమవారం బ్లాక్ కలర్ బట్టలను ఎందుకు వేసుకోరు?
సోమవారం సాధారణంగా శివుడికి అంకితం చేయబడింది. సోమవారం నాడు భక్తులు శివుడిని పూజిస్తారు. హిందూ మతంలో.. శివుడు అత్యున్నత శక్తుల దేవుడిగా పరిగణించబడతాడు. హిందూ పురాణాల ప్రకారం.. ఈ రోజు బ్లాక్ కలర్ బట్టలను వేసుకోవడం మానుకోవాలి. ఎందుకంటే నలుపు రంగు చీకటి, మరణంతో సంబంధం కలిగి ఉంటుంది.
మంగళవారం బ్లాక్ కలర్ బట్టలకు ఎందుకు దూరంగా ఉండాలి?
సోమవారం లాగే మంగళవారం కూడా నలుపు రంగు బట్టలను వేసుకోవడం మానేయాలి. ఎందుకంటే కుజుడు, శని శత్రువులని నమ్ముతారు. నలుపు శని రంగు అని మనందరికీ తెలుసు. అందుకే మంగళవారం నలుపు రంగు దుస్తులు ధరించడం అశుభంగా భావిస్తారు.
ఆంజనేయ భక్తులకు మంగళ, శనివారాలు చాలా ముఖ్యమైన రోజులు. హనుమంతుడిని విశ్వాసంతో, భక్తిశ్రద్ధలతో పూజించడం ద్వారా జీవితంలోని అన్ని రోగాలు నయమవుతాయి. హనుమంతుడికి నలుపు రంగు నచ్చదని కూడా నమ్ముతారు. హనుమంతుని అనుగ్రహం పొందడానికి ఆలయానికి వెళ్లేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు ధరించడం మంచిది కాదు.