విజయవాడ కార్పోరేషన్ మేయర్ పదవిని కైవసం చేసుకోవడానికి అధికార వైసీపీ, విపక్ష టీడీపీలు వ్యూహా, ప్రతి వ్యూహాలను సిద్దం చేసుకొంటున్నాయి. రెండు పార్టీల నేతలు మంత్రులు, మాజీ మంత్రులను విజయవాడ కార్పోరేషన్ ఎన్నికలకు ఇంచార్జీలుగా నియమించారు.
undefined
నామినేషన్ల ఉపసంహారణకు గడువు ముగిసింది. విజయం కోసం వైసీపీ, టీడీపీలు తమ శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నాయి. ఏకగ్రీవాల విషయంలో అధికార పార్టీ ఆశించిన లక్ష్యాలు నెరవేరకపోవడంతో ఓటర్లపై పట్టు సాధించేలా బాధ్యులైన నాయకులు కార్యాచరణ ప్రణాళికలు వేగవంతం చేశారు.
undefined
విజయవాడ నగరపాలక సంస్థను కైవసం చేసుకోవడాన్ని అధికార, ప్రతిపక్షాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో అక్కడ ఎన్నికలు ఉత్కంఠగా మారాయి. మరో నగరపాలక సంస్థ మచిలీపట్నంలో కూడా ఆసక్తికర పోరు నెలకొంది.
undefined
అధికార పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను స్థానిక శాసనసభ్యుడు, మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) భుజస్కంధాలపై వేసుకొన్నారు, తెదేపా తరఫున మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావులు బాధ్యత తీసుకున్నారు.
undefined
మచిలీపట్నంలోని 50 డివిజన్లలో పోటీ అనివార్యం అనుకుంటున్న తరుణంలో 11వ వార్డులో తెదేపా అభ్యర్థి నాటకీయంగా బరిలో నుంచి తప్పుకోవడం చర్చనీయాంశం అయ్యింది.
undefined
మిగిలిన కొన్ని డివిజన్లలో కూడా తమ అభ్యర్థులను పోటీ నుంచి వైదొలిగేలా అధికార పక్ష నాయకులు చేసిన బెదిరింపులు, ప్రలోభాలు పనిచేయలేదని కొల్లు రవీంద్ర ఆరోపించారు. గడచిన ఎన్నికల్లో తెదేపా విజయం సాధించిన నేపథ్యంతో పాటు తమ హయాంలో చేసిన అభివృద్ధి పనులు అభ్యర్థుల గెలుపునకు దోహదపడతాయనే ధీమాలో తెదేపా నాయకులు ఉన్నారు.
undefined
నగరంలోని కొన్ని డివిజన్లలో జనసేనకు పట్టు ఉంది. గడచిన పంచాయతీ ఎన్నికల్లో తాము బలపర్చిన అభ్యర్థులకు అనూహ్య మద్దతు లభించడంతో ఆశావహ దృక్పథం ఉన్న ఆ పార్టీ నాయకులు నగరపాలక సంస్థ ఎన్నికల్లో సైతం పట్టు నిరూపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు.
undefined
ఎక్కువ డివిజన్లలో బహుముఖ పోరు నెలకొంది. 17చోట్ల మాత్రమే ప్రధాన పక్షాల నుంచి ఇరువురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఒక్కో డివిజన్‌లో ముగ్గురు నుంచి ఐదుగురు అభ్యర్థుల వరకు ఉన్నారు.
undefined
ఎవరికి వారు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అవసరమైన డివిజన్లు దక్కుతాయన్న విశ్వాసంతో ఉన్నా పోలింగ్ తేదీ నాటికి ఎటువంటి మార్పులు చోటుచేసుకుంటాయో అన్న అనుమానాలు వెంటాడుతున్నాయి.
undefined
తమకు పక్కాగా దక్కుతుందనుకుంటున్న ఓటు బ్యాంకును చెదరకుండా కాపాడుకోవడంతో పాటు ఎదుటి పక్షానికి చెందిన వారిని ప్రసన్నం చేసుకునే పనిలో వార్డు స్థాయిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు.
undefined
ఆర్థికపరమైన అంశాల్లో కాస్త బలహీనంగా ఉన్న అభ్యర్థులకు తగు తోడ్పాటు అందించే దిశగా నాయకులు తమదైన ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికే జనసేన కార్యాలయంలో నిత్యావసర సరకులు నిల్వ చేశారని, మరో వార్డులో వైకాపా నాయకుని ఇంట్లో కుక్కర్లు ఉన్నాయన్న ఫిర్యాదులు వచ్చాయి.
undefined