
YS Jaganmohan Reddy : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ యాక్షన్ కు సిద్దమయ్యారు. కొత్త ప్రభుత్వానికి ఇంతకాలం సమయం ఇచ్చిన ఇకపై పోరాటానికి రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా ముల్లును ముల్లుతోనే తియ్యాలన్న సామెతను ఆయన ఫాలో అవుతున్నారు... ఏ సోషల్ మీడియాను ఉపయోగించిన ఆయనను దెబ్బతీసారో అదే సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండాలని జగన్ సూచించారు.
వైసిపి సోషల్ మీడియా స్ట్రాటజీ :
ఇవాళ(బుధవారం) తాడేపల్లిలోని తన కార్యాలయంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసిపి స్థానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు ప్రభుత్వంతో పోరాటం గురించి చర్చించారు. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు ఇప్పటినుండే ప్రజల్లోకి వెళ్లాలని... ఆ దిశగా వారిని ప్రోత్సహించాలని నాయకులకు సూచించారు వైఎస్ జగన్.
ప్రతి కార్యకర్తకు సోషల్ మీడియా అకౌంట్లు వుండేలా చూడాలని నాయకులకు సూచించారు జగన్. ట్విట్టర్, ఇన్ స్టా, ఫేస్ బుక్, వాట్సప్, యూట్యూబ్ ... ఇలా అన్ని సోషల్ మీడియాల్లో మరింత యాక్టివ్ గా వుండాలి...అందుకోసం అందరికీ అకౌంట్స్ వుండాల్సిన అవసరం వుందన్నారు. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా వెంటనే సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించాలని సూచించారు. ఆసుపత్రిలో డాక్టర్ ఎందుకు లేడు? పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదు? అమ్మఒడి ఏమైంది? ఇలా ప్రతి ఒక్కదాని గురించి అడగండి ... ఈ పాలనలో రోడ్లు ఎలా వున్నాయి? ప్రజల పరిస్థితి ఎలా తయారయ్యింది? అధికారులు ఎలా వ్యవహరిస్తున్నారు? ఇలా ప్రతిది ఫోటో తీసి అప్ లోడ్ చేయాలని సూచించారు.
మనం కేవలం ఒక్క చంద్రబాబుతోనో, పవన్ కల్యాణ్ తోనో యుద్ధం చేయడం లేదు... ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి చెడిపోయిన నెగిటివ్ మీడియాతో యుద్ధం చేస్తున్నామని జగన్ అన్నారు.వీళ్లు ఆకాశం నుంచి ఒక అబద్దాన్ని సృష్టిస్తున్నారు...దానికి రెక్కలు కట్టి ఇంత మందితో ప్రచారం చేయిస్తున్నారని అన్నారు. ఇవన్నీ తిప్పికొట్టాలంటే వాళ్ల కంటే మనం బలంగా తయారు కావాలి...అలా జరగాలంటే ప్రతి కార్యకర్త విప్లవంలా పనిచేయాలన్నారు. మన అస్త్రం సోషల్ మీడియానే... దాన్ని సమర్దవంతంగా వాడితే ప్రభుత్వాన్ని గద్దె దింపవచ్చని వైఎస్ జగన్ అన్నారు.
వైసిపి బలోపేతానికి జగన్ సూచనలు :
ప్రస్తుతం ప్రతిపక్షంలో వున్నాం... కొంచెం కష్టపడితే మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్ అన్నారు. ఇప్పుడు పార్టీ గట్టిగా నిలబడాలంటే ఆర్గనైజేషన్ బలంగా ఉండాలన్నారు. ప్రతి గ్రామం, మండలం, నియోజకవర్గంలోనూ వైసిపి బలంగా ఉందన్నారు. దీన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. ఇందుకోసమే ఈ సంక్రాంతి నుండి ప్రజల్లోకి వస్తున్నట్లు జగన్ తెలిపారు.
తాను వచ్చేఏడాది 2025 ఆరంభంలోనే జిల్లాల పర్యటన చేపట్టనున్నట్లు జగన్ తెలిపారు. సంక్రాంతి తర్వాత అంటే జనవరి మూడో వారం నుంచి ఈ పర్యటన ప్రారంభం అవుతుందన్నారు.ప్రతి బుధ, గురువారం ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటిస్తారు... రెండు రోజులు అక్కడే ఉంటానని తెలిపారు. అక్కడే నిద్ర చేస్తాననన్నారు. ప్రజలతోనే కాదు పార్టీ కార్యకర్తలతో మమేకం అవుతానన్నారు. కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం అన్న పేరుతో ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు జగన్ ప్రకటించారు.
ఈ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయింది... ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలయ్యింది. కాబట్టి ఈ సమయంలో మనం ప్రజల తరపున నిలబడాల్సిన అవసరం వుందన్నారు. జమిలి అంటున్నారు... ఇదే నిజమైతే ఎన్నికలు ముందుగానే వస్తాయి. కాబట్టి ఇప్పటినుండే చురుగ్గా వుండాలని... ప్రజల తరపున పనిచేయాలని సూచించారు. ప్రజల తరపున గళం వినిపించాలని జగన్ సూచించారు.
అందరినీ నేను ఒక్కటే కోరుతున్నాను... ప్రతిఒక్కరూ ప్రజలకేం కావాలి, వారికి తోడుగా అండగా ఉండాలి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఇలాంటి సమయంలోనే మనం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తుపెట్టుకోవాలని జగన్ అన్నారు.
మోసంతో అధికారంలో వచ్చిన ఈ టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రజల కోపానికి గురికాక తప్పదన్నారు. అప్పుడు వీళ్లు ఎంత దూరంలో పడతారంటే... తెలుగుదేశం పార్టీకి సింగిల్ డిజిట్ కూడా రాని రోజులు మనం చూస్తామన్నారు. మనం అందరం కలిసికట్టుగా నిలబడాల్సిన సమయం ఇదని జగన్ పేర్కొన్నారు.
తన పర్యటన ప్రారంభమయ్యే లోగా జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి పార్టీ కమిటీలు పూర్తి చేయాలని జగన్ సూచించారు. తన పర్యటన మొదలైనప్పుడు గ్రామ స్థాయి, బూత్ కమిటీల నియామకాలు పూర్తి చేద్దామని సూచించారు. ఈ కమిటీల పూర్తైన తర్వాత ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి వెళ్లాలని జగన్ ఆదేశించారు.