
Sankranti Special Trains : సంక్రాంతి పండగ దగ్గరపడుతోంది... దీంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీల సెలవులపై క్లారిటీ వచ్చింది. ఇక ఇరు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్, సాప్ట్ వేర్, బ్యాంక్ ఉద్యోగులకు కూడా సంక్రాంతికి మూన్నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి. దీంతో పండక్కి సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు... కానీ అందరిలో ఒకటే ఆందోళన... ఎలా వెళ్లాలని. హైదరాబాద్ నుండి ఆంధ్ర ప్రదేశ్ కు వెళ్లేవారిలో ఈ ఆందోళన మరీ ఎక్కువగా వుంది.
హైదరాబాద్ లో ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవారు అధికంగా వున్నారు. వీళ్లంతా సంక్రాంతికి సొంతూళ్లకు వెళతారు... పండగ సమయంలో ఏపీవాళ్లు ఎక్కువగా వుండే కూకట్ పల్లి వంటి ప్రాంతాలు ఖాళీగా బోసిపోయి కనిపిస్తాయి. ఇలా సంక్రాంతి ముందు హైదరాబాద్ నుండి ఏపీవైపు వెళ్లే బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతాయి. ఇప్పటికే బస్సులు, రైలు టికెట్స్ మొత్తం బుక్కయిపోయాయి...దీన్నిబట్టే రద్దీ ఏ స్థాయిలో వుంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఇలా సంక్రాంతి పండగవేళ హైదరాబాద్ - ఆంధ్ర ప్రదేశ్ మధ్య రద్దీని దృష్టిలో వుంచుకుని దక్షణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పండగవేళ ఏపీకి ప్రత్యేక రైళ్ళను నడిపేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు హైదరాబాద్-కాకినాడ మధ్య ఆరు ప్రత్యేక రైళ్ళను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్ల వివరాలను తెలుసుకుందాం.
హైదరాబాద్ - కాకినాడ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లు ఇవే :
హైదరాబాద్ లోని వివిధ రైల్వే స్టేషన్ల నుండి కాకినాడకు ప్రత్యేక రైళ్లు బయలుదేరనున్నాయి. ఈ నెల అంటే జనవరి 9 నుండి జనవరి 11 వరకు ఈ రైళ్లు నడుస్తాయి. ఈ మూడురోజుల్లో హైదరాబాద్- కాకినాడ రూట్ లో ప్రయాణించేవారు ఈ ప్రత్యేక రైల్ సర్వీసులను ఉపయోగించుకోవచ్చు.
కాచిగూడ - కాకినాడ టౌన్ :
హైదరాబాద్ లోకి కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి 07653 నెంబర్ గల రైలు జనవరి 9న కాకినాడకు బయలుదేరుతుంది. రాత్రి 8.30 గంటలకు బయలుదేరే ఈ రైలు తర్వాతిరోజు (జనవరి 10న) ఉదయం 8 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది. జనవరి 11న కూడా సేమ్ ఇలాగే రాత్రి 8.30 కు కాచిగూడ నుండి బయలుదేరి తర్వాతిరోజు జనవరి 12న ఉదయం 8 గంటలకు కాకినాడ చేరుకుంటుంది.
కాకినాడ టౌన్ - కాచిగూడ :
కాకినాడ టౌన్ నుండి కాచిగూడకు ట్రైన్ నెంబర్ 07654 జనవరి 10 సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరుతుంది. ఇది తర్వాతిరోజు అంటే జనవరి 11న ఉదయం 4.30 కి కాచిగూడకు చేరుకుంటుంది. ఇదే ట్రైన్ మళ్లీ జనవరి 12న కాకినాడలో సాయంత్రం 5.10 కి మర్నాడు జనవరి 13 ఉదయం 4.30 కి కాచిగూడ చేరుకుంటుంది.
ఈ రెండు స్పెషల్ రైళ్లు (07653,07654) మల్కాజ్ గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు,తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది. అంటే ఈ ప్రాంతాలమధ్య రాకపోకలు సాగించేవారు కూడా ఈ స్పెషల్ ట్రైన్స్ ను ఉపయోగించుకోవచ్చు.
హైదరాబాద్ - కాకినాడ టౌన్ :
హైదరాబాద్ అంటే నాంపల్లి రైల్వే స్టేషన్ నుండి జనవరి 10న మరో స్పెషల్ ట్రైన్ కాకినాడకు బయలుదేరుతుంది. 07023 నెంబర్ రైలు నాంపల్లి నుండి 6.30 గంటలకు బయలుదేరి తర్వాతిరోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. కాకినాడ నుండి 07024 నంబర్ రైలు జనవరి 11న రాత్రి 8 గంటలకు బయలుదేరుతుంది. తర్వాతిరోజు అంటే జనవరి 12న ఉదయం 8.30కి ఇది హైదరాబాద్ చేరుకుంటుంది.
ఈ రెండు స్పెషల్ రైళ్ళు (07023,07024) సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు,భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది. హైదరాబాద్ - కాకినాడ మధ్య నడిచే ఈ ప్రత్యేక రైళ్లలో ఈ ప్రాంతాలవారు కూడా ప్రయాణించవచ్చు.
రేపట్నుంచే ఈ స్పెషల్ ట్రైన్ బుకింగ్స్ స్టార్ట్ :
హైదరాబాద్ - కాకినాడ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లలో టికెట్ రిజర్వేషన్ ఇవాళ (జనవరి 2, 2025) గురువారం నుండి ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకే టికెట్స్ రిజర్వేషన్ బుకింగ్ ప్రారంభం అవుతుందని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్వో శ్రీధర్ ఓ ప్రకటన విడుదలచేసారు. ఈ రైళ్లలో సెకండ్ ఏసి,థర్డ్ ఏసి, స్లీపర్, జనరల్ బోగీలు అందుబాటులో వుంటాయని తెలిపారు.
సంక్రాంతి పండక్కి హైదరాబాద్ - కాకినాడ మార్గంలో ప్రయాణానికి ప్లాన్ చేసుకున్నవారు వెంటనే టికెట్స్ బుక్ చేసుకొండి. ఇవేగాక దక్షిణమధ్య రైల్వే హైదరాబాద్ నుండి ఏపీలోని మరికొన్ని ప్రాంతాలకు కూడా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ప్లాన్ చేస్తోంది. సంక్రాంతి పండగ సందర్భంగా రద్దీని తగ్గించేందుకు, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు మరికొన్ని స్పెషల్ ట్రైన్ సర్వీస్ లను కూడా నడపనున్నారు. ఈ వివరాలను కూడా త్వరలోనే వెల్లడించనుంది సౌత్ సెంట్రల్ రైల్వే.