
సత్తెనపల్లి : సొంత బాబాయ్ ని గొడ్డలితో నరికిచంపించి ఆ నింద తనపై వేయాలని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చూసారని మాజీ సీఎం, టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు ఆరోపించారు. చివరకు చనిపోయిన బాబాయ్ క్యారెక్టర్ మంచిదికాదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. సొంత చెల్లే జగన్ ను నమ్మడం లేదు... తన తండ్రి హత్యపై ఆమె అడుగున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చంద్రబాబు అడిగారు.
సత్తెనపల్లిలోలో జరిగిన 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన రోడ్ షో లో ప్రసంగిస్తూ సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై విరుచుకుపడ్డారు.
పల్నాటి పులి కోడెల శివప్రసాద్ ఎవరికీ భయపడే వ్యక్తి కాదని... అలాంటిది ఆయనే ఆత్మహత్య చేసుకున్నాడంటే ఈ సైకో సీఎం ఎంతలా వేధించాడో అర్థం చేసుకోవచ్చని చంద్రబాబు అన్నారు. సత్తెనపల్లి అభివృద్దికి, ఇక్కడి ప్రజల సంక్షేమానికి కృషిచేసిన గొప్ప నాయకుడి ఆత్మహత్యకు కారణమైన సీఎంను ఏం చేయాలి? అని ప్రజలను అడిగారు చంద్రబాబు.
జగన్ రెడ్డి అరాచక పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆనందంగా లేరని చంద్రబాబు అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలతో ఆడుకుంటూ ధరలను రెండింతలు పెంచిన చేతకాని ప్రభుత్వం ఇదని అన్నారు. చివరకు చెత్తమీద కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్ అంటూ మండిపడ్డారు.
కోడి కత్తి డ్రామా జగన్ దే అని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ స్పష్టంగా చెప్పిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పట్టుబడిన నిందితుడికి టిడిపితో ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థే తేల్చిందన్నారు. ఇక తిరుమల వెంకటేశ్వరస్వామి పింక్ డైమండ్ తాను దోచుకున్నట్లు తప్పుడు ప్రచారం, వివేకా హత్యపై తనపై ఆరోపణలు చేసారని... ఇలాంటి ఫేక్ నేత మనకు ముఖ్యమంత్రి కావడం మన ఖర్మ అన్నారు.
చుట్టుపక్కల రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఉన్నత చదువులు చదివేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంటే ఏపీలో మాత్రం తగ్గుతోందని... ఇందుకు సైకో జగన్ పాలనే కారణమని చంద్రబాబు అన్నారు. ఏపీ నుండి తెలంగాణకు పీజి చెయ్యడానికి రెండు లక్షల మంది విద్యార్థులు వెళ్లారంటే ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థ చేసుకోవచ్చని అన్నారు. సైకోకు చదువు రాదు కాబట్టి ఎవరూ చదువుకోకూడదని కోరుకుంటున్నాడు..తన పిల్లలు బాగా చదువుకున్నారు కాబట్టే అందరి పిల్లలను బాగా చదివించాలని ఉంటుందని చంద్రబాబు అన్నారు.
తెలంగాణ, ఏపీని ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ సోదరులతో పోల్చారు చంద్రబాబు. తండ్రి ఆస్తులను పంచుకుని విడిపోయిన అంబానీ బ్రదర్స్ లో ముఖేష్ పెద్ద వ్యాపారవేత్తగా నిలిస్తే అనిల్ వ్యాపారంలో దెబ్బతిన్నారని అన్నారు. ఇప్పుడు తెలంగాణ, ఏపి పరిస్థితి కూడా అంతేనని... బాగా చేసుకున్న తెలంగాణ అభివృద్ది చెందితే ఏపి వెనకబడిందని అన్నారు.జగన్ పాలనే ఏపీ వెనకబాటుకు కారణమని అన్నారు. రెండోసారి టిడిపి అధికారంలోకి వచ్చివుంటే తెలంగాణతో పాటు ఏపీ కూడా దేశంలో టాప్ స్టేట్ గా వుండేదని చంద్రబాబు అన్నారు.
ఆనాడు ముద్దులు పెట్టిన జగన్ ....ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నాడని చంద్రబాబు అన్నారు. ఈ నాలుగేళ్లలో రూ.2లక్షల కోట్లు దోపిడీ చేసాడని ఆరోపించారు. కేవలం మద్యంలోనే 40 వేల కోట్లు దోచుకుంటే ఇసుక, మైనింగ్ అక్రమాల ద్వారా ఇంకెంత దోచుకుని వుంటాడని అన్నారు చివరికి యువత జీవితాలతో ఆడుకుంటూ గంజాయిని కూడా తన అక్రమార్జనకు వాడుకుంటున్నాడని... వైసీపీ పాలనలో గంజాయి వాణిజ్య పంటగా మారిందని చంద్రబాబు ఎద్దేవా చేసారు.
అసలు డయాఫ్రం వాల్ అంటే తెలియని వ్యక్తి ఇరిగేషన్ మంత్రి అయ్యారంటూ అంబటి రాంబాబును ఎద్దేవా చేసారు. నోరుందని ఆంబోతులా రంకెలు వేస్తే లాభం లేదని అంబటి తెలుసుకోవాలన్నారు. పెదకూరపాడు సత్తెనపల్లి రోడ్డు వేయలేని ఈయన టీడీపీని విమర్శించే పెద్దమగాడా అంటూ మండిపడ్డారు. సైకో సీఎం ముఖంలో ఆనందం కోసం రోజూ తనను, పవన్ కళ్యాణ్ ను ఈ మంత్రి విమర్శిస్తుంటాడని చంద్రబాబు అన్నారు.