సాయి ధరమ్ తేజ్ ప్రమాదం: మీడియాపై పవర్ పంచ్ లు, వైఎస్ జగన్ టార్గెట్

First Published Sep 26, 2021, 8:58 AM IST

సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపై వార్తాకథనాలు రాసే మీడియాకు రాజకీయ అవినీతి గురించి రాసే ధైర్యం లేదని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉద్వేగభరితంగా మాట్లాడారు.  

హైదరాబాద్: సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉద్వేగభరితంగా మాట్లాడారు. సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపై రాసిన వార్తాకథనాలకు ఆయన మీడియాపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. వైసీపీ నేతలపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
 

సాయి ధరమ్ తేజ్ 45 కిలోమీటర్ల అతి వేగంతో ఆటోను తప్పించబోయి ప్రమాదానికి గురయ్యాడని రాశారని, 45 కిలోమీటర్ల అతి వేగం అనే పదాలను ఆయన ఒత్తి పలికారు. సాయి ధరమ్ తేజ్ సాఫ్ట్ టార్గెట్ కాబట్టి ఇష్టం వచ్చినట్లు వార్తాకథనాలు రాశారని ఆయన విమర్శించారు. సాయి ధరమ్ తేజ్ ఇంకా కోమాలో ఉన్నాడని, అటువంటి కథనాలు ఎలా రాస్తారని ఆయన అన్నారు.  రాజకీయ అవినీతి గురించి ఎందుకు మాట్లాడరని ఆయన మీడియాను అడిగారు.  

సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపై వార్తాకథనాలు రాసే మీడియాకు రాజకీయ అవినీతి గురించి రాసే ధైర్యం లేదని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకానంద హత్య ఎందుకు జరిగిందో రాయాలని, కోడికత్తి వ్యవహారంపై రాయాలని ఆయన అన్నారు. ఇడుపులపాయలో డబ్బులున్నాయంటారని, ఎందుకు దాని గురించి రాయరని పవన్ కల్యాణ్ అన్నారు. రాయలసీమలో బలిజలు ఎందుకు నలిగిపోతున్నారో రాయాలని ఆయన అన్నారు. వైసీపీ నాయకులు వ్యభిచారం చేసినవారికి మద్దతు తెలిపారని ఆయన అన్నారు. స్పైసీగా ఉండాలంటే అవన్నీ రాయాలని ఆయన మీడియాను ఉద్దేశించి అన్నారు. 

హీరో నానిని ఇటీవల అందరూ తిడుతుంటే బాధేసిందని ఆయన చెప్పారు. ఏ వైపు థియేటర్లు మూత పడితే నాని సినిమాను ఎక్కడ విడుదల చేసుకోవాలని ఆయన అడిగారు. అప్పుడు సినీ థియేటర్ల యజమానులు వైసీపీ నేతలతో మాట్లాడుకోవాలని, దానికి నాని ఏం చేస్తారని ఆయన అన్నారు. చిరంజీవిది మంచి మనసు కాబట్టి బతిమాలుకుంటారని ఆయన అన్ారు. సన్నాసి అనే మాట ఏమిటంటే తమ నాయకులకు చిరంజీవి అంటే సోదర భావన అని అంటారని, చిత్ర పరిశ్రమకు అక్కరకు రాని సోదర భావన ఎందుకని ఆయన అన్నారు. ఆ సన్నాసి అంటూ పదే పదే వత్తి పలుకుతూ ఆ సన్నాసి పేరు గుర్తుకు రావడం లేదని ఆయన అన్నారు. 
 

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని వైసీపి నేతలు సహించలేదని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా వదిలిపెట్టలేదని ఆయన అన్నారు. ఆ సన్నాసికి చెప్పండి, పవన్ కల్యాణ్ సినిమాను ఆపేసి చిత్ర పరిశ్రమ గురించి చూడాలని అని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ సినిమాను ఆపేస్తే భయపడిపోతారని అనుకున్నారని, చిత్రపరిశ్రమ వైపు చూస్తే వైసీపీ నేతలు కాలిపోతారని ఆయన అన్నారు. టీడీపీ ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడినివారు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన అడిగారు. 

మోహన్ బాబుపై కూడా పవన్ కల్యాణ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశ్ రాజ్ ను సమర్థించారు. మోహన్ బాబు విద్యాసంస్థలకు కూడా నిబంధనలు వర్తింపజేస్తే ఏం చేస్తారని ఆయన అడిగారు. రాష్ట్రంలో థియేటర్లు ఎందుకు పనిచేయడం లేదు, మోహన్ బాబు సినీ పరిశ్రమ సమస్యలపై వైసీపీ నేతలతో మాట్లాడాలని ఆయన అన్నారు. వైసీపీ నేతలు బంధువులు అని మోహన్ బాబు చెబుతుంటారని, చిత్రపరిశ్రమ జోలికి రావద్దని వైసీపీ నేతలకు చెప్పాలని, మోహన్ బాబు మాజీ పార్లమెటు సభ్యులని, మోహన్ బాబుకు బాధ్యత ఉందని, మోహన్ బాబు మాట్లాడాలని ఆయన అన్నారు. 
 

ప్రకాశ్ రాజ్ ను నాన్ లోకల్ అనడాన్ని ఆయన వ్యతిరేకించారు. ప్రతిభావంతమైన నటుడు అని చెప్పారు. వకీల్ సాబ్ సినిమా పవన్ కల్యాణ్ చేయాల్సింది కాదని ప్రకాశ్ రాజ్ అన్నారని ఆయన అన్నారు. తమలో తమకు గొడవలుంటాయని, విభేదాలు ఉంటాయని, సినిమాకు వచ్చేసరికి ఒక్కటేనని ఆయన అన్నారు. భారతదేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చునని ఆయన అన్నారు.

ఏపీలో ఉన్నది వైసీపీ రిపబ్లిక్ కాదని, ఇండియన్ రిపబ్లిక్ అని, ఈ విషయం వైసీపీ నేతలకు చెప్పాలని పవన్ కల్యాణ్ అన్నారు. సినీ పరిశ్రమకు ఇబ్బందులు కలిగిస్తే తాట తీస్తానని ఆయన హెచ్చరించారు. సినిమా టికెట్ల విక్రయాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం తన చేతుల్లో తీసుకోవడంపై తీవ్రంగా ప్రతిస్పందించారు. సినిమా టికెట్ల ఆదాయం చూపించి అప్పులు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆయన అన్నారు. సినీ పరిశ్రమ చాలా సెన్సిటివ్ అని ఆయన అన్నారు. 

గుండాకు, క్రిమినల్ పొలిటిషియన్ కు భయపడితే ఏమీ చేయలేమని ఆయన అన్నారు. గుండాలకు భయపడితే మనం బతకలేమని ఆయన అన్నారు. సినీ పరిశ్రమ అంతా ఒక్కటేనని ఆయన అన్నారు. తన పేరు చెప్పి సినీ పరిశ్రమను దెబ్బ తీస్తున్నారని ఆయన అన్నారు. సినీ పరిశ్రమకు కుల, మత, ప్రాంతీయ భేదాలు లేవని ఆయన అన్నారు. సినీ కళాకారులు దోపిడీలు, దొమ్మీలు చేయడం లేదని, కష్టపడి సంపాదించుకుంటున్నామని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏమీ చేయకపోతే తమ పని తాము చేసుకుంటామని ఆయన చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తిని గుండెల్లో నింపుకున్నవాడిని కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నానని ఆయన అన్నారు. అధికారాన్ని విచక్షణారిహతంగా వాడితే గడాఫీ గతి పడుతుందని ఆయన హెచ్చరించారు.

click me!