దేశంలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికల జరిగితే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీదే పై చేయి అవుతుందని India TV-CNX Opinion Poll పేర్కొంది. ఏపీలోని మొత్తం 25 లోక్ సభ స్థానాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ 18 సీట్లను గెలుచుకుంటుందని తెలిపింది. అంటే గత ఎన్నికల్లో గెలుచుకున్న 22 సీట్ల కంటే నాలుగు తక్కువ.
ఇక ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగు దేశం పార్టీ 2019 లోక్ సభ ఎన్నికల్లో మూడు సీట్లకే పరిమితం అయింది. అయితే, ఈ సారి టీడీపీ ఏడు స్థానాలను గెలుచుకుంటుందని ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ పేర్కొంది. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు బీజేపీతో తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఓటింగ్ శాతం గమనిస్తే.. వైఎస్సార్సీపీకి 46 శాతం, టీడీపీకి 36 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒంటరిగా ఉన్న బీజేపీ 8 శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉంటుందని అంచనా వేసింది. మొత్తంగా ఆంధ్రాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డకౌట్ అవుతాయని అంచనా వేసింది.
అయితే, 2024 లోక్ సభ ఎన్నికల సమయానికి పరిస్థితులు మారే అవకాశం లేకపోలేదు. ఇటీవల కొత్త పొత్తులు ఏర్పడి విచ్ఛిన్నం కావడంతో మారుతున్న రాజకీయ పరిస్థితులతో 2024 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ లో కొత్త కూటములు వస్తాయని భావిస్తున్నారు. ప్రతిపక్షాల మహాకూటమిలో చంద్రబాబు నాయుడు గానీ, జగన్మోహన్ రెడ్డి గానీ లేకపోవడం గమనార్హం. అయితే, వైసీపీ పలు కీలక బిల్లులపై పార్లమెంటులో కేంద్రానికి మద్దతు పలికింది. 2024 ఎన్నికలకు ముందు టీడీపీ మళ్లీ ఎన్డీయే గూటికి చేరుతుందా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు.
ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ ప్రకారం తెలంగాణలో అధికార బీఆర్ఎస్ అధిక స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ తెలంగాణలో 8 స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది.
తెలంగాణలో బీజేపీ తన అధిక్యం పెంచుకోనుంది. బీజేపీ ఆరు స్థానాల్లో విజయం సాధిస్తుందని ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ తెలిపింది. ఇక కాంగ్రెస్ కు మరోసారి నిరాశ తప్పదని పేర్కొంది. కాంగ్రెస్ రెండు, ఎంఐఎం ఒక స్థానంలో విజయం సాధిస్తాయని తెలిపింది.