వైసీపీ ఎమ్మెల్యే రోజా తీరుపై ప్రస్తుతం సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. మొన్నటి వరకు ఆమె పై ప్రశంసల వర్షం కురవగా.. నేడు మాత్రం విమర్శల వర్షం కురుస్తోంది. కరోనా వేళ ఇదేంది రోజమ్మా అంటూ నెటిజన్లు కూడా మండిపడుతున్నారు.
ఇంతకీ మ్యాటరేంటంటే.. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి
ఈ నేపథ్యంలో లాక్ డౌన్ విధించారు. ఈ లాక్ డౌన్ సమయంలో రోజా.. ఆకలితో అలమటించే ప్రజల కోసం రోజూ వంట చేసి స్వయంగా వడ్డించారు
ఈ క్రమంలో ఆమెపై అందరూ ప్రశంసలు కురిపించారు. రోజా ఒక్కతే మా బాధలు పట్టించుకుంటున్నారంటూ ఓ మున్సిపల్ అధికారి వీడియో తీసి మరీ ప్రకటించాడు.
పేదల కోసం ఆమె చేస్తున్న కృషి కి సోషల్ మీడియాలో కూడా జేజేలు పలికారు. కానీ.. తాజాగా విడుదలైన ఒక్క వీడియోతో ఆ ప్రశంసలన్నీ పోయి.. వాటి స్థానంలో విమర్శలు వస్తున్నాయి.
లాక్ డౌన్ వేళ నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రవర్తించిన తీరు వివాదాస్పదమవుతోంది. ప్రజలకు అవగాహనకల్పించి వారికి నిత్యావసర వస్తువుల పంపిణీలో ప్రజాప్రతినిధులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే రోజా తన నియోజవర్గంలో పర్యటించారు.
చిత్తూరు జిల్లా పుత్తూరు సుందరయ్యనగర్‌లో బోరుబావి ప్రారంభోత్సవానికి రోజా వెళ్లారు. ఆ సమయంలో ఆమెకు పూలతో స్వాగతం పలికారు. అక్కడి జనం పూలు నేలపై జల్లుతుంటే రోజా నడుచుకుంటూ వెళ్లడం చర్చనీయాంశమైంది.
దీనిపై జనసేన కార్యకర్తలు ఘాటుగా స్పందిస్తున్నారు. వైసీపీ నేతల చీప్ పబ్లిసిటీతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ ట్విట్టర్‌లో ఫైర్ అయ్యారు
లాక్ డౌన్ సమయంలో ఆమె అలా పర్యటించడం ఓ వివాదాస్పదమైతే.. పూలు చల్లించుకోవడం మరింత వివాదానికి దారి తీసింది.
పైగా అక్కడి ప్రజలు సామాజిక దూరం కూడా పాటించకపోవడంతో.. మరిన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై రోజా ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.