ప్రకాశం మర్డర్ కేసు : 15 రోజులుగా సిమ్ లు, ప్రాంతాలు మార్చి భార్యతో వేరే వ్యక్తిలా ఛాటింగ్ చేస్తూ... హతమార్చి

First Published May 22, 2023, 10:03 AM IST

వేరే వ్యక్తి పేరుతో భార్యతో ఛాటింగ్ చేస్తూ.. భర్తే రాధను హత్య చేసినట్లు తేలింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

ప్రకాశం : ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు జిల్లాలో వెలుగు చూసిన ఓ  వివాహిత హత్య కేసు చివరికి ఓ కొలెక్కి వచ్చింది. కోట రాధ (35) అనే మహిళ హత్యకు గురైంది. ఆమెను  తానే హత్య చేశానని పోలీసుల విచారణలో భర్త మోహన్ రెడ్డి అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అయితే, రాధను భర్త మోహన్ రెడ్డి ఒక్కడే హత్య చేశాడా? లేక ఈ హత్యకు  ఇంకెవరైనా సహకరించారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.  

కారణమేంటంటే.. రాదను హత్య చేసి... ఆమె మృతదేహాన్ని రోడ్డుమీద పడేయడం.. రాధ శరీరంపై ఉన్న తీవ్ర గాయాలు పోలీసుల్లో ఈ కొత్త అనుమానాలను  రేకెత్తిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే.. కోట రాధ అనే మహిళ తన స్నేహితుడైన కాశిరెడ్డికి పెద్ద మొత్తంలో అప్పు ఇప్పించింది. అయితే దాన్ని తిరిగి  రాబట్టుకోలేకపోయింది. 

phone

ఈ విషయమే వారి కుటుంబంలో వివాదాలకు దారితీసింది. దీంతో విసిగిపోయిన భర్త మోహన్ రెడ్డి ఎలాగైనా భార్యను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు.  ఆ తర్వాత సమయం కోసం వేచి చూశాడు. తన ప్లాన్ లో భాగంగా 15 రోజులుగా సెల్ ఫోన్ మెసేజ్లు నాటకానికి తెరలేపాడు. రాధా ఇటీవల తన సొంతూరులో జరిగే చౌడేశ్వరి దేవి కొలుపులకు  హాజరు కావడం కోసం పుట్టింటికి వెళ్ళింది. 

దీన్ని మోహన్ రెడ్డి సరైన సమయంగా భావించి తన నాటకానికి తెర లేపాడు కాశిరెడ్డి పేరుతో సిమ్ కొన్నాడు. ఆ తర్వాత అతని పేరుతోనే భార్య మొబైల్ కు మెసేజ్లు పెట్టాడు.  చాటింగులు కాశిరెడ్డి పేరుతో చేసాడు. ఈ విషయాన్ని రాధ గుర్తించలేకపోయింది.

sim card

ప్రాంతాలు మార్చి..  ఫోన్లు మార్చి..
గత వారం రోజులుగా తన ప్లాన్ లో భాగంగా మోహన్ రెడ్డి అనేక సిమ్ కార్డులు మార్చాడు.  మార్చిన సిమ్ కార్డులతో రాధతో చాటింగ్ చేశాడని  పోలీసులు గుర్తించారు.

ఈనెల 17వ తారీఖున హత్య జరగడానికి కొద్దిగా ముందు కూడా సూర్యాపేట నుంచి ఇదే రకమైన మెసేజ్లు పంపించాడు. అంతేకాదు ఒక చెరుకు రసం బండి వ్యక్తికి తన ఫోన్ పని చేయడం లేదని నమ్మించి అతని ఫోన్  తీసుకుని  అందులో తన సిమ్ కార్డు వేసుకొని కాశీరెడ్డి పేరుతో రాధకు మెసేజ్లు పంపించాడు. 

ఇదే క్రమంలో పల్నాడు జిల్లా వినుకొండ నుంచి కూడా ఒక టీ దుకాణం దగ్గర మరో వ్యక్తి సెల్ ఫోన్ నుంచి మెసేజ్లు పంపించాడు. అతని సెల్ నుంచి మెసేజ్ చేస్తూ కనిగిరికి సాయంత్రం మూడు గంటల వరకు వస్తానంటూ  మెసేజ్ పెట్టాడు.

ఆ తర్వాత కనిగిరి చేరుకున్న మోహన్ రెడ్డి పామూరు బస్టాండ్ లో ఓ యువతీతో పరిచయం చేసుకున్నాడు. కంభం వైపు వెళ్లేందుకు ఆమె ఎదురు చూస్తుంది. ఆమె దగ్గర కూడా సేమ్ తన ఫోన్ పని చేయడం లేదంటూ కథ చెప్పి.. ఫోన్లో తన సిమ్ వేసుకుని కనిగిరి వచ్చినట్టుగా రాధకు మెసేజ్ పెట్టాడు. ఈ చాటింగ్ అంతా కాశీ రెడ్డి చేస్తున్నాడని నమ్మిన రాధ, డబ్బులు ఇస్తాడని కనిగిరి చేరుకుంది.

ఆమె హత్య కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత నిందితుడు ఎవరో పోలీసులకు అర్థం అయ్యాక.. రాధ అంత్య క్రియలు పూర్తయ్యే వరకు వేచి ఉన్నారు. ఆ తర్వాత మోహన్ రెడ్డిని కోదాడలో అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. తానొక్కడే ఈ నేరం చేసినట్లుగా పేర్కొన్నాడు. అయితే, రాధ శరీరం మీద ఉన్న గాయాలను పరిశీలించిన పోలీసులకు ఇది ఒకరితో అయ్యే పని కాదని మోహన్ రెడ్డితో పాటు మరికొందరు కూడా ఈ హత్యలో పాల్గొని ఉంటారని అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే, ఆ వ్యక్తులు ఎవరు.. ఎంతమంది ఉన్నారనేది ఇంకా తేలాల్సి ఉంది.

భర్త మీద అనుమానం రావడానికి కారణం రాధ తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు. కాశీరెడ్డి  తన కూతురిని హత్య చేశాడని రాధ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు  మోహన్ రెడ్డి మీద అనుమానం వచ్చింది.  పోలీసుల విచారణ సమయంలో రాధ భర్త మోహన్ రెడ్డి అక్కడే ఉన్నా కూడా తనకేమీ తెలియదన్నట్లుగా  వ్యవహరించాడు. అంతేకాదు తన భార్యను కాశిరెడ్డి హత్య చేశాడని నమ్మించాడు.

అనుమానం వచ్చిన పోలీసులు మోహన్ రెడ్డి కదలికల మీద కన్నేసి ఉంచారు. వారి దర్యాప్తులో రాధ హత్య జరిగిన సమయంలో నిందితుడు మోహన్ రెడ్డి కనిగిరిలోనే ఉన్నట్లు గూగుల్ టేక్ అవుట్ ద్వారా గుర్తించారు పోలీసులు. అయితే మోహన్ రెడ్డి మాత్రం తాను ఆరోజు హైదరాబాదులోనే ఉన్నట్టు అందరితో చెప్పడంతో పోలీసులకు అనుమానం మొదలయ్యింది. మోహన్ రెడ్డి ఎంతో తెలివిగా నాటకమాడినప్పటికీ హంతకుడు ఎవరన్నది పోలీసులకు స్పష్టత వచ్చినట్లయింది. 

click me!