Telugudesam Party
Politics : రాజకీయ పార్టీ అనగానే అధికారంకోసం ఏమైనా చేస్తుందనే భావన ప్రజల్లో ఉంది. పార్టీ ఆదేశిస్తే ఏం చేయడానికైనా నాయకులు, కార్యకర్తలు ఎప్పుడూ సిద్దంగా ఉండాలి. అయితే ఏ రాజకీయ పార్టీకయినా కొన్ని నియనిబంధనలు ఉంటాయి... వాటిని ప్రతిఒక్కరూ అనుసరించాలి. నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణగా ఉంటూ పార్టీ లైన్ లో నడవాలి. పార్టీలో ఎవరి బాధ్యతలు వారు చూసుకోవాల్సి ఉంటుంది... పార్టీ అదేశానుసారం నడుచుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఏ పార్టీ అయినా ప్రజలకు దగ్గరయి అధికారాన్ని పొందగలుగుతుంది.
కొన్నిసార్లు కార్యకర్తల అభీష్టం మేరకు పార్టీ నడుచుకోవాల్సి ఉంటుంది. మరికొన్నిసార్లు వ్యూహాత్మక మౌనం పాటించాల్సి ఉంటుంది. నాయకులు ఏం మాట్లాడినా అది పార్టీ వాయిస్ గా ప్రజల్లోకి వెళుతుంది... కాబట్టి చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సి ఉంటుంది. ఇలా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం వంటి పార్టీల్లో అయితే చాలా నియమ నిబంధనలు ఉంటాయి. ఈ పార్టీలో ఏదైనా విషయంపై అధికార ప్రతినిధులు మాట్లాడాలంటే చాలా తతంగా ఉంటుంది. ఈ ప్రక్రియ ఎలా ఉంటుందో ఆ పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ వివరించారు.
TDP Vijay Kumar
ఓ ప్రెస్ మీట్ పెట్టాలంటే ఇంత తతంగం ఉంటుందా?
రాజకీయ పార్టీల వాయిస్ ను ప్రజలముందుకు తీసుకెళ్ళేది ఆ పార్టీ అధికార ప్రతినిధులు. అంటే ఏదయినా అంశంపై పార్టీ తరపున మాట్లాడేందుకు మీడియా ముందుకు వస్తుంటారు ఈ అధికార ప్రతినిధులు. ఇలా తెలుగుదేశం పార్టీలో ఆనం వెంకట్రమణారెడ్డి, విజయ్ కుమార్ లాంటివారు అధికార ప్రతినిధులుగా ఉన్నారు. వీరు మీడియా ముందుకు ఎక్కువగా వస్తుంటారు. తమ పార్టీ వాయిస్ ను వినిపించడమే కాదు ప్రత్యర్థి పార్టీల తీరును కూడా ఈ అధికార ప్రతినిధులు ఎండగడుతుంటాయి.
అయితే ఇటీవల కొన్ని రాజకీయ అంశాలపై ఎందుకు స్పందించడంలేదని ఆనంతో పాటు తనను కొందరు అడుగుతున్నారని విజయ్ కుమార్ తెలిపారు. ఆ అంశమేమిటి? దానిగురించి ఎందుకు స్పందించడంలేదు? అధికార ప్రతినిధులుగా తమ పనితీరు ఎలా ఉంటుంది? అనేది విజయ్ కుమార్ వివరించారు.
''నిన్న నన్ను, ఆనం వెంకట్రమణా రెడ్డిలను టాగ్ చేసి, మేమెందుకు ఫలానా విషయం మీద మాట్లాడలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు, జగన్ పిన్నమ్మ, జూపూడి ల గురించి పోస్ట్ పెట్టడానికి భయము...అంటూ ఏవేవో వ్రాసారు.... తనకు తెలీదు , ఒకరు చెప్తే వినరు అనే సామెత వుంది....ముందు రాజకీయ పార్టీలు ఎలా పని చేస్తాయో తెలుసుకోండి'' అని విజయ్ కుమార్ సూచించారు.
''టిడిపిలో దాదాపు ముప్పై మంది అధికార ప్రతినిధులు వున్నారు. ప్రతి రోజు ఉదయం ఒక కమిటీ ఆన్లైన్లో సమావేశం అవుతుంది. ఆ రోజు ఏయే ఇష్యూలను తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి, ఎవరు మాట్లాడాలో నిర్ణయిస్తారు. ఆ నిర్ణయాన్ని వివిధ స్థాయిలో ఆమోదించిన పిమ్మట ప్రెస్ మీట్ పెట్టాల్సిన వ్యక్తికి చెప్తారు. సున్నితమైన ఆంశాలపై మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారు... ఎవరు మాట్లాడాలో నిర్ణయిస్తారు. ఆ అంశాన్ని తీసుకోవాలా వద్దా? అన్నది కూడా నిర్ణయించేది కమిటీనే. దీని సూచనల మేరకే మేము నడుచుకోవాల్సి ఉంటుంది" అని విజయ్ కుమార్ తెలిపారు.
''పార్టీ ఆఫీసులో మాట్లాడే ప్రతి ఒక్క ప్రెస్ మీట్ పార్టీ చెప్పిన ప్రకారమే జరుగుతాయి, అందుకే అది అఫీసియల్ ప్రెస్ మీట్ అవుతుంది. ఇవేమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు వ్రాసేస్తే ఎలా? ప్రతి పార్టీకి, సంస్థకు కొన్ని రూల్స్, రెగులేషన్స్ వుంటాయి కదా..! అవేమీ తెలియకుండా, మనం చెప్పినట్టు నడవాలి అంటూ రిమోట్ కంట్రోల్ చేద్దామని ప్రయత్నిస్తే ఎలా? కాస్త తెలుసుకొని వ్రాయండి...!'' అని విజయ్ కుమార్ సూచించారు.