తెలుగు యువత ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మదనపల్లెకు చెందిన గుండ్లపల్లె శ్రీరామ్ చినబాబు నియమితులయ్యారు. చంద్రబాబునాయుడు తీసుకొన్న నిర్ణయం పార్టీ నేతలకు ఆశ్చర్యం నెలకొంది.
చిత్తూరు జిల్లాలో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబునాయుడు ఈ నిర్ణయం తీసుకొన్నారని కొందరు పార్టీ నేతలు చెబుతున్నారు. బీసీ నేతలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చే పార్టీగా టీడీపీకి పేరుంది. గత ఎన్నికల సమయంలో బీసీలు టీడీపీకి దూరమయ్యారు. దీంతో బీసీలకు టీడీపీ పెద్ద పీట వేస్తోంది.
ఈ క్రమంలోనే బీసీ సామాజిక వర్గానికి చెందిన చినబాబుకు పదవిని కట్టబెట్టడం ద్వారా బీసీల పక్షపాతి తమ పార్టీ అనే సంకేతాలు ఇచ్చింది.
చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని నీరుగట్టవారిపల్లెకు చెందిన గుండ్లపల్లె శ్రీరామ్ చినబాబు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మదనపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ గా కూడ పనిచేశారు.
చేనేత సామాజికవర్గానికి చెందిన ఇతడికి పట్టణంలో పెద్ద సంఖ్యలో వున్న ఆ వర్గీయులపై చెప్పుకోదగ్గ పట్టు వుంది. ముఖ్యంగా ఆ వర్గంలో యువత గణనీయ సంఖ్యలో అతడి వెన్నంటి వుంది. కాంగ్రెస్ నుంచీ తరువాత టీడీపీలో చేరినప్పటికీ స్థానిక రాజకీయాల కారణంగా అతడికి పెద్ద ప్రాధాన్యత లభించలేదు.
అయితే అంగళ్ళు ఘటనలో వైసీపీ వర్గీయులు జరిపిన దాడిలో చినబాబు వాహనం కూడా ధ్వంసమైంది. ఈ విషయాన్ని పార్టీ ముఖ్యనేత నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి అధినేత దృష్టికి తీసుకెళ్ళారు.
దీంతో చంద్రబాబు అతడికి ఫోన్ చేసి నేరుగా మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆ సందర్భంగా అధినేత ఆరా తీయడంతో మదనపల్లె నియోజకవర్గంలో కీలక సామాజికవర్గానికి చెందిన నాయకుడని తేలింది. దీంతో పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలని అప్పుడే నిర్ణయించారు. ఆ బాధ్యతను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి అప్పగించారు.
ఈ విషయంలో జిల్లా టీడీపీలో స్వల్పంగా అభ్యంతరాలు తలెత్తినా స్వయంగా అధినేతే జోక్యం చేసుకోవడంతో సద్దుమణిగిపోయాయి. వాస్తవానికి డిసెంబరులోనే నియామకం జరగాల్సి వుండగా రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలతో చంద్రబాబు బిజీ కావడంతో ఆలస్యమైంది.
ఇప్పటికే పశ్చిమ ప్రాంతానికి చెందిన నల్లారి కిషోర్, అమరనాధరెడ్డి, మద్దిపట్ల సూర్యప్రకాష్ తదితరులకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించింది. తాజాగా చేపట్టిన తెలుగు యువత నియామకం ఆ డివిజన్‌తో పాటు ప్రత్యేకించి మదనపల్లె నియోజకవర్గంలో పార్టీ మరింత బలపడే అవకాశం లేకపోలేదు.